కళలు, సంస్కృతితో రామాయణ ప్రచారం.. యోగిపై రాష్ట్రపతి ప్రశంసలు

ABN , First Publish Date - 2021-08-29T20:46:07+05:30 IST

కళలు, సంస్కృతి ద్వారా రామాయణాన్ని సామాన్య ప్రజానీకానికి చేరువ చేసేందుకు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు ప్రశంసనీయమని..

కళలు, సంస్కృతితో రామాయణ ప్రచారం.. యోగిపై రాష్ట్రపతి ప్రశంసలు

అయోధ్య: కళలు, సంస్కృతి ద్వారా రామాయణాన్ని సామాన్య ప్రజానీకానికి చేరువ చేసేందుకు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు ప్రశంసనీయమని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ అన్నారు. ఇందుకోసం రామాయణ కాంక్లేవ్ నిర్వహించిన ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, ఆయన టీమ్‌ను అభినందిస్తున్నానని పేర్కొన్నారు. ఆదివారంనాడిక్కడ ప్రారంభమైన 'రామాయణ కాంక్లేవ్‌'లో రాష్ట్రపతి ప్రసంగించారు. అంతకుముందు, ఆదివారం ఉదయం రాష్ట్రపతి ప్రత్యేక ప్రెసిడెన్షియన్ ట్రైన్‌లో అయోధ్యకు వచ్చారు. గవర్నర్ ఆనందిబెన్ పటేల్, సీఎం యోగి ఆదిత్యనాథ్ ఆయనకు స్వాగతం పలికారు.


'రామచరిత మానస్‌'ను రాష్ట్రపతి తన ప్రసంగంలో ప్రస్తావిస్తూ, దేవుడు సర్వవ్యాపి అని, అందరిలోనూ ఉన్నాడని, ప్రతి ఒక్కరూ పరస్పరం గౌరవించుకోవాలని అన్నారు. రాముడు అందరివాడని, ప్రతి ఒక్కరిలోనూ రాముడున్నాడని పేర్కొన్నారు. రామాయణ కాంక్లేవ్ ప్రాధాన్యతను గుర్తించాలంటే రామకథ సంగ్రహాన్ని విస్తృతంగా ప్రచారం చేయాలని, అందులోని ఆదర్శ భావాలను అంతా అలవరచుకోవాలని సూచించారు. భవిష్యత్ రామరాజ్యం కావాలని ఆకాంక్షించారు. మహాత్మాగాంధీ సేవలను ఈ సందర్భంగా ఆయన ప్రస్తావిస్తూ, భారతదేశం రామరాజ్యం కావాలని గాంధీజీ అభిలషించేవారని, బాపు జీవితంలో రామనామానికి ఎంతో ప్రాధాన్యం ఉందని చెప్పారు. రామాయణంలో కూడా రాముడిని మర్యాద పురుషుడుగా చెప్పడం జరిగిందని అన్నారు. సామాజిక సామరస్యత, సమైక్యతకు రాముడు చూపించిన మార్గం చక్కటి ఉదాహరణ అని, ఇవాల్టికీ అది అనుసరణీయమని పేర్కొన్నారు. నాలుగు రోజుల పర్యటన నిమిత్తం రాష్ట్రపతి ఈనెల 26న ఉత్తరప్రదేశ్ వచ్చారు. గోరఖ్‌పూర్‌లో మహాయోగి గోరఖ్‌నాథ్ విశ్వవిద్యాలయాన్ని శనివారంనాడు ఆయన ప్రారంభించారు.

Updated Date - 2021-08-29T20:46:07+05:30 IST