ఉక్రెయిన్‌పై పుతిన్‌కు ఎందుకంత ఉడుకు?

ABN , First Publish Date - 2022-02-25T09:05:15+05:30 IST

ఉక్రెయిన్‌పై పుతిన్‌కు ఎందుకంత ఉడుకు..? అమెరికా సహా అనేక దేశాలు తీవ్రంగా హెచ్చరిస్తున్నా రష్యా అధ్యక్షుడి ఉడుంపట్టు సడలదెందుకు..? ఏదేమైనా తేల్చుకునేందుకు సిద్ధమంటూ తెగిస్తున్నారు ఎందుకు..? ప్రపంచమంతా కొవిడ్‌ సృష్టించిన విలయం

ఉక్రెయిన్‌పై పుతిన్‌కు ఎందుకంత ఉడుకు?

  • అసలు దేశమే కాదనేది రష్యా అధ్యక్షుడి దృఢ నమ్మకం
  • అమెరికా అధ్యక్షుడితో పాటు పలు వేదికలపై స్పష్టీకరణ
  • నాటో కూటమిలో చేరిక యత్నాలతో మరింత ఆగ్రహం
  • పశ్చిమ దేశాల కీలుబొమ్మలా మారుతుందని ఆందోళన
  • అణ్వాయుధాలు సమకూర్చుకుంటోందని ఇటీవల నింద
  • మనసులో బలంగా సోవియట్‌ విచ్ఛిన్నం అనుభవాలు..


మాస్కో, ఫిబ్రవరి 24: ఉక్రెయిన్‌పై పుతిన్‌కు ఎందుకంత ఉడుకు..? అమెరికా సహా అనేక దేశాలు తీవ్రంగా హెచ్చరిస్తున్నా రష్యా అధ్యక్షుడి ఉడుంపట్టు సడలదెందుకు..? ఏదేమైనా తేల్చుకునేందుకు సిద్ధమంటూ తెగిస్తున్నారు ఎందుకు..? ప్రపంచమంతా కొవిడ్‌ సృష్టించిన విలయం నుంచి ఎలా బయటపడాలా..? అని ఆలోచిస్తున్న సమయంలో రష్యా మాత్రం యుద్ధ భేరి మోగిస్తున్నదెందుకు..? ఈ ప్రశ్నలన్నిటికీ.. ఉక్రెయిన్‌ ఉనికినే సహించని పుతిన్‌ ధోరణి ఒక సమాధానం అయితే, అనేక రాజకీయ, భౌగోళిక, సాంస్కృతిక కారణాలు మరో సమాధానం. వీటి కారణాలను తెలుసుకుంటే ఉక్రెయిన్‌పై రష్యా ఏమీ ఉరుము లేని పిడుగులా విరుచుకుపడడం లేదని అర్థమవుతుంది. మరోలా చెప్పాలంటే పుతిన్‌ దృష్టిలో ఉక్రెయిన్‌ అనేది అసలు దేశమే కాదు. ఇదే విషయాన్ని 2008లో అమెరికా అప్పటి అధ్యక్షుడు జార్జి బుష్‌ ముందటే స్పష్టం చేశారు. అనేక విధాలుగా ఉక్రెయిన్‌ రష్యా అంతర్భాగమని పుతిన్‌ బలమైన నమ్మకం. దీనికితగ్గట్లే రష్యన్లు-ఉక్రెయిన్ల చారిత్రక ఐక్యతను గట్టిగా సమర్థిస్తూ పెద్ద వ్యాసం కూడా రాశారు. కాగా, ఉక్రెయిన్లు స్వతహాగా రష్యా అనుకూలురని, కానీ కొందరు వారి మనుసులో విష బీజాలు నాటి వ్యతిరేకులుగా మారుస్తున్నారనేది పుతిన్‌ భావనగా చరిత్ర విశ్లేషకులు పేర్కొంటుంటారు. అసలు ఇది యుద్ధమే కాదని.. ‘‘ఉక్రెయిన్లను విదేశీ ఆక్రమణదారుల నుంచి విముక్తులను చేయడం’’ అనేది క్రెమ్లిన్‌ (రష్యా అధ్యక్షుడి నివాసం) లెక్కగా చెబుతుంటారు.


నాటోలో చేరుతుందని..  

సోవియట్‌ యూనియన్‌ మాజీ దేశంగా, బలమైన సాంఘిక, సాంస్కృతిక సంబంధాలున్న, రష్యన్‌ భాష మాట్లాడే ప్రజలు అత్యధిక శాతం ఉన్న ఉక్రెయిన్‌ పూర్తిగా తమ కనుసన్నల్లో ఉండాలని రష్యా భావిస్తుంటే.. ఆ దేశం మాత్రం నాటో (నార్త్‌ అట్లాంటిక్‌ ట్రిటీ ఆర్గనైజేషన్‌) కూటమి, యూరోపియన్‌ యూనియన్‌ (ఈయూ)లో చేరే యత్నాలు చేయసాగింది. నాటోలో చేరికపై గతేడాది జనవరిలో ఉక్రెయిన్‌ అధ్యక్షుడు వ్లాదిమిర్‌ జెలెన్‌స్కీ.. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ను అభ్యర్థించారు. తమకు చిరకాల ప్రత్యర్థులైన కూటముల్లోకి చేరేందుకు ఉక్రెయిన్‌ సాగిస్తున్న మంతనాలు పుతిన్‌కు ఆగ్రహం తెప్పించాయి. మరోవైపు 2005, 2014లో ఉక్రెయిన్‌లో రష్యా అనుకూల వర్గాలను తరిమికొట్టిన ఘటనలో పశ్చిమ దేశాల పాత్ర ఉందనేది ఆయన అంచనా. కాగా, ఉక్రెయిన్‌కు సరిహద్దుల్లో ఉన్న చాలా దేశాలు నాటోలో సభ్యత్వం ఉన్నవే. ఈ దేశం కూడా కూటమిలో చేరితే.. నాటో చేతిలో కీలుబొమ్మగా మారుతుందని పుతిన్‌ ఆందోళన. దీంతో అణ్వాయుధాలు సమకూర్చుకుంటోందని, నయా నాజీ విధానాలు అవలంబిస్తోందని ఉక్రెయిన్‌పై ఇటీవల ఆయన మండిపడ్డారు. పర్యవసానంగా రక్త పాతం జరిగితే ఉక్రెయిన్‌దే బాధ్యతని హెచ్చరించారు. మరోవైపు ఎప్పుడైతే బైడెన్‌ను నాటోలో చేర్చుకోమని జెలెన్‌స్కీ కోరారో.. అప్పటినుంచి ఉక్రెయిన్‌ సరిహద్దులకు రష్యా సైన్యాన్ని తరలించడం ప్రారంభించింది.  


సోవియట్‌ విచ్ఛిన్నం సలిపిన గాయంతో..

అది 1989-1991 మధ్య కాలం. మహా సామ్రాజ్యంగా ఉన్న సోవియట్‌ యూనియన్‌ (యూఎ్‌సఎ్‌సఆర్‌) కుప్పకూలుతున్న సమయం. అప్పట్లో పుతిన్‌ సోవియట్‌ గూఢచార సంస్థ కేజీబీ అధికారిగా తూర్పు జర్మనీలో ఉన్నారు. సోవియట్‌ యూనియన్‌ పతనమై పదుల సంఖ్యలో కొత్త దేశాలుగా విడిపోవడం ఆయనను తీవ్రంగా కలచి వేసింది. అనంతర పరిణామాల్లో పశ్చిమ దేశాలు వెలిగిపోతుంటే.. రష్యా పేదరికంలోకి వెళ్లడం పుతిన్‌ మనసును బాగా గాయపర్చింది. ఇదే రష్యాకు పూర్వ వైభవాన్ని తీసుకువచ్చేలా.. ఒకప్పుడు తమ నుంచి విడిపోయిన ప్రాంతాలపై పట్టుకు ప్రయత్నించేలా చేస్తుంది.

Updated Date - 2022-02-25T09:05:15+05:30 IST