Presidential polls: రాష్ట్రపతి ఎన్నికల బ్యాలెట్ మెటీరియల్ పంపిణీ

ABN , First Publish Date - 2022-07-13T17:29:45+05:30 IST

కేంద్ర ఎన్నికల సంఘం (EC) కార్యాలయం ‘నిర్వచన్ సదన్’ నుంచి రాష్ట్రపతి ఎన్నికల(Presidential polls) బ్యాలెట్ మెటీరియల్ తరలింపు ప్రక్రియ కొనసాగుతోంది.

Presidential polls: రాష్ట్రపతి ఎన్నికల బ్యాలెట్ మెటీరియల్ పంపిణీ

న్యూఢిల్లీ: కేంద్ర ఎన్నికల సంఘం (EC) కార్యాలయం ‘నిర్వచన్ సదన్’ నుంచి రాష్ట్రపతి ఎన్నికల(Presidential polls) బ్యాలెట్ మెటీరియల్ తరలింపు ప్రక్రియ కొనసాగుతోంది. మంగళవారం పుదుచ్చేరి, తెలంగాణ సహా 14 రాష్ట్రాలకు అధికారులు తరలించారు. ఆయా రాష్ట్రాల నుంచి వచ్చిన అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులు  బ్యాలెట్ మెటీరియల్ తీసుకువెళ్లారు. రాష్ట్రపతి ఎన్నికల్లో అసెంబ్లీ కార్యదర్శులు అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులుగా వ్యవహరిస్తారు. రాష్ట్రపతి ఎన్నికల కోసం తరలించే బ్యాలెట్ మెటీరియల్‌ను విమాన మార్గం ద్వారానే తరలిస్తారు. ఆయా రాష్ట్రాల రాజధానులకు వెళ్లే విమానాల్లో 'మిస్టర్ బ్యాలెట్ బాక్స్' పేరుతో టికెట్ కొనుగోలు చేసి పంపిస్తారు. 


హిమాచల్ ప్రదేశ్, ఢిల్లీ మినహా అన్ని రాష్ట్రాలకు వాయుమార్గంలోనే బ్యాలెట్ మెటీరియల్‌ను తరలిస్తారు. ఈనెల 15వ తేదీ వరకు అన్ని రాష్ట్రాల అసెంబ్లీ భవనాల్లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్‌లకు చేరవేస్తారు. ఇప్పటికే పలు రాష్ట్రాలకు అందగా మిగిలిన రాష్ట్రాలకు బుధవారం (ఈరోజు) తరలించనున్నామని ఎన్నికల సంఘం అధికారులు తెలిపారు. ఈ మొత్తం ప్రక్రియను కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమీషనర్ రాజీవ్ కుమార్ దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. కాగా ఈనెల 18న రాష్ట్రపతి ఎన్నికల పోలింగ్ జరగనుంది. అనంతరం ఈనెల 21న పార్లమెంట్ హౌస్‌లో ఓట్ల లెక్కింపు జరగనుంది.


ఎంపీలు అందరూ పార్లమెంట్ హౌస్‌లోనే తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని సభ్యులకు బీజేపీ నిర్దేశం చేసింది. ఈనెల 16 సాయంత్రానికి ఎంపీలు అందరూ తప్పక ఢిల్లీ చేరుకోవాలని ఆదేశించింది. 17న ఉదయం పార్లమెంట్ హౌస్‌లో రాష్ట్రపతి ఎన్నికల శిక్షణ, మాక్ పోలింగ్‌‌ను బీజేపీ  నిర్వహించనుంది.

Updated Date - 2022-07-13T17:29:45+05:30 IST