President polls: విపక్ష నేతల సమావేశం వాయిదా: Kharge

ABN , First Publish Date - 2022-07-12T01:47:25+05:30 IST

రాష్ట్రపతి ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించేందుకు భావసారూప్యం గల విపక్ష నేతలతో ఈనెల..

President polls: విపక్ష నేతల సమావేశం వాయిదా: Kharge

కలబురగి: రాష్ట్రపతి ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించేందుకు భావసారూప్యం గల విపక్ష నేతలతో ఈనెల13న జరగాల్సిన సమావేశం 17వ తేదీకి వాయిదా పడింది. రాజ్యసభలో కాంగ్రెస్ విపక్ష నేత మల్లికార్జున ఖర్గే సోమవారంనాడిక్కడ మీడియాతో మాట్లాడుతూ, పలువురు విపక్ష నేతలు ముందుగానే కొన్ని కార్యక్రమాలకు కమిట్ అయినందున సమావేశం తేదీని వాయిదా వేశామని చెప్పారు. వ్యక్తిగతంగా కానీ, ఆన్‌లైన్ కాన్ఫరెన్స్ ద్వారా కానీ, వాట్సాప్ ద్వారా కానీ తామంతా సమావేశమవుతామన్నారు.


రాష్ట్రపతి ఎన్నికలో పార్టీల మద్దతుపై అడిగిన ఓ ప్రశ్నకు ఖర్గే సమాధానమిస్తూ, జేఎంఎం (JMM) ఇంకా తమ వైఖరి చెప్పలేదని, విపక్ష పార్టీల అభ్యర్థి యశ్వంత్ సిన్హాకు మద్దతిస్తామని మహరాష్ట్ర మాజీ సీఎంకు 'ఆప్' హామీ ఇచ్చిందని తెలిపారు. జనతాదళ్ (ఎస్) ఇప్పటికే పార్లమెంటరీ కమిటీ సమావేశంలో ఎవరికి మద్దతిచ్చేది చాలా స్పష్టంగా చెప్పిందని అన్నారు. రాష్ట్రపతి ఎన్నికల్లో గెలిచామా లేదా అనేది సెకండరీ అవుతుందని, దేశంలో ప్రజాస్వామ్య రక్షణ కోసం జరుపుతున్న సైద్ధాంతిక పోరాటం ఇదని ఆయన వివరించారు. దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణకు విపక్ష పార్టీల మధ్య ఐక్యత అనివార్యమని చెప్పారు.


శ్రీలంకలో పరిణామాలు దురదృష్టకరం...

శ్రీలంకలో తలెత్తిన రాజకీయ పరిణామాలు దురదృష్టకరమని ఓ ప్రశ్నకు సమాధానంగా ఖర్గే చెప్పారు. మన పొరుగుదేశాల్లో సుపరిపాలన ఉంటే మనం హ్యాపీగా ఉంటామని, శ్రీలంకతో భారత దేశానికి దశాబ్దాలుగా చక్కటి సంబంధాలు ఉన్నాయని చెప్పారు. అయితే శ్రీలంకలో అంతర్గత సంక్షోభం గురించి తాను మాట్లాడనని, ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వంతో మన దేశం సత్సంబంధాలు నెరపాల్సి ఉంటుందని చెప్పారు. భవిష్యత్తులో శ్రీలంక తరహాలో ఆర్థిక సంక్షోభం ఎదుర్కోవాల్సి వస్తుందా అనే ప్రశ్నకు, శ్రీలంకలో తలెత్తిన ఆర్థిక సంక్షోభంతో ఇండియాను తాను పోల్చనని, అయితే దేశంలో ఆర్థిక పరిస్థితి బాగోలేదని, ద్రవ్యోల్బణం తీవ్రంగా ఉందని తమ పార్టీ నేత రాహుల్ గాంధీ చాలాసార్లు చెప్పారని అన్నారు. ప్రధానిని కూడా ఈ దిశగా తాము హెచ్చరించామని, అయితే ఆయన ఎలాంటి పట్టింపు లేకుండా ఉన్నారని అన్నారు. శ్రీలంక, జపాన్‌లలో తలెత్తిన పరిస్థితిని నుంచి మన దేశం కూడా పాఠాలు నేర్చుకోవాల్సి ఉంటుందని అన్నారు. జపాన్ మాజీ ప్రధాని షింజో అబే హత్యను తనతో పాటు కాంగ్రెస్ పార్టీ ఖండించిందని చెప్పారు. షింజో అబే చాలా మంచి వ్యక్తి అని, ఆయన ప్రధానిగా ఉండా మంచి పాలన అందించారని ఖర్గే ప్రశంసించారు.


ఎన్డీయే ప్రజావ్యతిరేక పాలన...

ఎన్డీయే ప్రభుత్వం ప్రజావ్యతిరేక ప్రభుత్వమని ఖర్గే విమర్శించారు. ''వాళ్లు ఉజ్వల యోజన ప్రకటించారు. ప్రస్తుతం ఆ స్కీమ్ లబ్ధిదారుల పరిస్థితి ఏమిటి? కేంద్ర ప్రభుత్వం ఉగ్నిపథ్ యోజన ప్రారంభించింది. పరిమిత కాల ఉద్యోగం పూర్తి చేసుకున్న తర్వాత అగ్నివీరుల పరిస్థితి ఏమిటి?'' అని ఖర్గే ప్రశ్నించారు.

Updated Date - 2022-07-12T01:47:25+05:30 IST