ఎమర్జెన్సీ.. చెరగని మచ్చ

ABN , First Publish Date - 2022-06-27T09:05:00+05:30 IST

ఇందిరాగాంధీ హయాంలో విధించిన ఎమర్జెన్సీ చీకటి రోజులను భావితరాలు మరువకూడదని ప్రధాని మోదీ అన్నారు.

ఎమర్జెన్సీ.. చెరగని మచ్చ

ప్రజలు ప్రజాసామ్య పద్ధతిలోనే బదులిచ్చారు.. జర్మనీలో మోదీ వ్యాఖ్యలు

దేశానికి గౌరవం తెచ్చిన మాలావత్‌ పూర్ణ

మన్‌ కీ బాత్‌లో ప్రధాని మోదీ ప్రశంసలు


ఆ చీకటి రోజులు మరవొద్దు!


న్యూఢిల్లీ, జూన్‌ 26: ఇందిరాగాంధీ హయాంలో విధించిన ఎమర్జెన్సీ చీకటి రోజులను భావితరాలు మరువకూడదని ప్రధాని మోదీ అన్నారు. ఆదివారం  ఆకాశవాణిలో ‘మన్‌ కీ బాత్‌’లో ఆయన ప్రసంగించారు. ‘ఇప్పుడు మనం 75 ఏళ్ల స్వాతంత్య్ర వేడుకలు జరుపుకొంటున్నాం. కానీ 1975 జూన్‌లో నాటి  పాలకులు దేశంలో అత్యవసర పరిస్థితి విధించారు. 21వ అధికరణ ప్రసాదించిన జీవించే హక్కును, వ్యక్తిగత స్వేచ్ఛ హక్కును హరించారు. న్యాయస్థానాలను, ప్రతి రాజ్యాంగ సంస్థను, మీడియాను తమ అధీనంలోకి తీసుకున్నారు. ఇన్ని చేసినా ప్రజాస్వామ్యంపై ప్రజల నమ్మకం చెక్కుచెదరలేదు. ప్రజాస్వామిక మార్గంలో నియంతృత్వ పోకడలను ప్రజలు ఓడించడం ప్రపంచంలో ఇంకెక్కడా కనబడదు’ అని తెలిపారు. భారత ప్రజాస్వామ్య చరిత్రలో ఎమర్జెన్సీ మాయని మచ్చ అని మోదీ మ్యూనిచ్‌లోనూ అభివర్ణించారు. 


అంతరిక్ష రంగంలో అపార అవకాశాలు

భారతీయ అంతరిక్ష రంగాన్ని ప్రధాని ప్రశంసించారు. ఈ రంగంలో ప్రైవేటువారికి అపార అవకాశాలు లభిస్తున్నాయని.. ప్రస్తుతం వందకు పైగా స్టార్ట్‌పలు నడుస్తున్నాయని చెప్పారు. చెత్తను సంపదగా మలిచే యత్నాల్లో భాగంగా మిజోరం రాజధాని ఐజ్వాల్‌లో చిట్టె లుయ్‌ నది ప్రక్షాళన, పుదుచ్చేరిలో సముద్రం నుంచి చెత్త తొలగింపును ప్రధాని కొనియాడారు. ప్రజలు కరోనా టీకా సకాలంలో తప్పక తీసుకోవాలని కోరారు. 


క్రీడాకారులకు ప్రశంసలు

నిరుడు ఒలింపిక్స్‌లో జావెలిన్‌ త్రోలో స్వర్ణపతకం గెలిచి సంచలనం సృష్టించిన నీరజ్‌చోప్రా ఇటీవలి కువర్టేన్‌ గేమ్స్‌లోనూ ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో బంగారు పతకం సాధించాడని మోదీ కొనియాడారు. ‘స్టార్ట్‌పల నుంచి క్రీడల వరకు భారతీయ యువత కొత్త రికార్డులు సృష్టిస్తోంది. చాలా సాధారణ కుటుంబాల నుంచి ప్రతిభావంతులు వెలికి రావడం ఈ గేమ్స్‌లో మరో ప్రత్యేకత. వీరంతా విజయాన్ని చేరుకునేందుకు ఎన్నో కష్టాలు పడ్డారు’’ అన్నారు. 


దేశానికి గౌరవం తెచ్చిన పూర్ణ

తెలంగాణకు చెందిన పర్వతారోహకురాలు మాలావత్‌ పూర్ణ దేశానికి గౌరవం తెచ్చే మరో ఘనత సాధించారని ప్రధాని మోదీ ప్రశంసించారు. ‘‘మాలావత్‌ పూర్ణ పేరు ప్రస్తావించకుండా క్రీడలు, ఫిట్‌నె్‌సపై చర్చ పూర్తి కాదు. 13 ఏళ్లకే ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించిన పూర్ణ తాజాగా మరో ఘనత సాధించారు. ఉన్నతమైన స్ఫూర్తితో ఉత్తర అమెరికాలోని మౌంట్‌ డెనాలీని అధిరోహించారు. ప్రపంచంలోనే అత్యంత కఠినమైన, అత్యంత ఎత్తైన ఏడు పర్వతాలను అధిరోహించి దేశానికి గౌరవం తీసుకొచ్చారు’’ అని కొనియాడారు. 

Updated Date - 2022-06-27T09:05:00+05:30 IST