హతవిధీ

ABN , First Publish Date - 2022-08-15T06:17:20+05:30 IST

హతవిధీ

హతవిధీ

డ్రైవర్లను టార్గెట్‌ చేసిన ఆర్టీసీ అధికారులు

బలవంతపు రిటైర్‌మెంట్ల కోసం ఒత్తిడి

అనారోగ్యం వస్తే చాలు.. అన్‌ఫిట్‌ అంటూ ముద్ర

‘ఆల్‌ అదర్‌ కేటగిరీ అన్‌ఫిట్‌’ పేరుతో తొలగింపు యత్నాలు

డ్రైవర్లను తగ్గించి, అద్దె బస్సులు తేవాలన్నదే పన్నాగం

ఉద్యోగ సంఘాలకు చేరుతున్న ఫిర్యాదులు


ఆర్టీసీలో బలవంత పు పదవీ విరమణ ప్రయత్నాలు జరుగుతున్నాయి. ప్రభుత్వంలో విలీనం చేశామని గొప్పలు చెబుతున్న రాష్ట్ర ప్రభుత్వం దొడ్డిదోవన ఉద్యోగులను విధుల నుంచి తొలగించే ప్రయత్నాలు చేస్తుండటంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అనారోగ్య సమస్య వస్తే చాలు.. మెడికల్‌ అన్‌ఫిట్‌గా చూపిస్తూ ఉద్యోగ విరమణ చేయమని ఒత్తిడి తెస్తున్నారు. ‘ఆల్‌ అదర్‌ కేటగిరీస్‌ అన్‌ఫిట్‌’ అని ముద్ర వేస్తున్నారు. విజయవాడ జోన్‌ పరిధిలోని ఎన్టీఆర్‌, గుంటూరు జిల్లాల్లో ఇలాంటి ఉదంతాలు వెలుగులోకి వస్తున్నాయి. 


(ఆంధ్రజ్యోతి, విజయవాడ)

- విద్యాధరపురం డిపోకు చెందిన ఒక డ్రైవర్‌ వెన్నెముక సమస్యతో ఆర్టీసీ హాస్పిటల్‌లో చికిత్స తీసుకున్నాడు. మెరుగైన చికిత్స కోసమని ప్రైవేట్‌ ఆసుపత్రికి రిఫర్‌ చేశారు. అక్కడ ట్రీట్‌మెంట్‌ పొందిన డ్రైవర్‌ ఆ తర్వాత కోలుకుని డిశ్చార్జి అయ్యాడు. అనంతరం డ్రైవర్‌గా కాకుండా, మరే పనికైనా వినియోగించుకోవచ్చని వైద్యులు రిపోర్టు ఇచ్చారు. దానిని పరిశీలించిన ఆర్టీసీ మెడికల్‌ బోర్డు ఏదైనా విభాగంలో పోస్టింగ్‌ కల్పించాల్సి ఉంటుంది. అందుకు విరుద్ధంగా మెడికల్‌ బోర్డు ‘ఆల్‌ అదర్‌ కేటగిరీ అన్‌ఫిట్‌’ అనే ముద్ర వేశారు. ‘నువ్వు ఏ పనీ చేయలేవు’ అంటూ పదవీ విరమణ చేయాల్సిందిగా బలవంతం పెట్టారు. దీంతో డ్రైవర్‌ తన ఫిట్‌నెస్‌పై అధికారులకు రీ ఎగ్జామిన్‌ చేయమని అర్జీ పెట్టుకున్నాడు. అయినా ఆర్టీసీ ఉన్నతాధికారుల నుంచి స్పందన రాలేదు. తన అర్జీ పెండింగ్‌లో ఉండటంతో ఉపాధి దెబ్బతింటుందన్న ఉద్దేశంతో ఆ డ్రైవర్‌ ప్రైవేట్‌ వాహనాలను తోలుతున్నాడు. ప్రైవేట్‌ వాహనాలను తోలుతున్న డ్రైవర్‌ సామర్థ్యాన్ని దృష్టిలో ఉంచుకుని, అతని వెన్నెముక ఇబ్బందులను పరిగణనలోకి తీసుకుని ఇతర పనులు చేయించవచ్చు. కానీ, మెడికల్‌ బోర్డు అంగీకరించలేదు. 

- గుంటూరు జిల్లాకు చెందిన మరో డ్రైవర్‌ కిడ్నీ సమస్యతో బాధపడుతూ విజయవాడ విద్యాధరపురంలోని సెంట్రల్‌ హాస్పిటల్‌ కు వచ్చాడు. మెరుగైన వైద్యం కోసం ఓ ప్రైవేట్‌ హాస్పిటల్‌కు పంపించారు. ఆ హాస్పిటల్‌లో చికిత్స తీసుకుని డిశ్చార్జి అయిన క్రమంలో ఆర్టీసీ మెడికల్‌ బోర్డుకు లేఖ పంపాడు. ప్రైవేట్‌ హాస్పిటల్‌ ఇచ్చిన రిపోర్టులో డ్రైవర్‌కు వచ్చిన కిడ్నీవ్యాధి తీవ్రతకు సంబంధించిన అంశాలను వివరించడంతో పాటు లాంగ్‌ డ్రైవింగ్‌ చేయకూడదని, నైట్‌డ్యూటీలు చేయకూడదని, బయటి ఆహారం తీసుకోకూడదని పేర్కొన్నారు. లాంగ్‌ డ్రైవ్‌ మినహా మిగిలిన డ్యూటీలు నిర్వహించవచ్చని తెలిపారు. లాంగ్‌ డ్రైవింగ్‌ సమస్య అయితే, సిటీ రూట్ల పరిధిలో డ్రైవింగ్‌ డ్యూటీ ఇవ్వొచ్చు. అధికారుల కార్లకు డ్రైవర్లుగా నియమించవచ్చు. ఏదైనా విభాగంలో విధులు అప్పగించవచ్చు. కానీ, ప్రైవేట్‌ హాస్పిటల్‌ ఇచ్చిన రిపోర్టును పరిశీలించకుండా ఆర్టీసీ మెడికల్‌ బోర్డు ‘ఆల్‌ అదర్‌ కేటగిరీ అన్‌ఫిట్‌’ ముద్ర వేసింది. దీంతో ఆర్టీసీ అధికారులు పదవీ విరమణ చేయటం తప్ప మరో మార్గం లేదంటూ డ్రైవర్‌ను బలవంత పెడుతున్నారు. 

ఎంత స్వార్థం

ఇలా ఆర్టీసీ ఉద్యోగ సంఘాల వద్దకు రోజూ అనేక కేసులు వస్తున్నాయి. ఆర్టీసీ ఉన్నతాధికారులతో ఉద్యోగ సంఘాల నాయకులు మాట్లాడుతున్న సందర్భాలు చాలానే ఉన్నాయి. మెడికల్‌ అన్‌ఫిట్‌ అంశాన్ని ఉపయోగించుకుని ఏకంగా డ్రైవర్లను పదవీ విరమణ చేయించే ఎత్తుగడలపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇందులోనూ ఆర్టీసీ అధికారులు స్వార్థాన్ని ప్రదర్శిస్తున్నారు. మెడికల్‌ బోర్డు అన్‌ఫిట్‌ చేసిన ఉద్యోగులకు వాలంటరీ రిటైర్‌మెంట్‌కు దరఖాస్తు చేసుకోమని కూడా చెప్పట్లేదు. అలా అయితే, మిగిలి ఉన్న సర్వీసు కాలానికి కూడా కలిపి లెక్కించి ప్రయోజనాలు కల్పించాల్సి ఉంటుంది. ఇది మరింత భారమవుతుంది. పదవీ విరమణ చేయమని మాత్రమే నిర్దేశిస్తున్నారు. తక్షణం పదవీ విరమణ చేస్తే అప్పటి వరకు మాత్రమే ప్రయోజనాలు దక్కుతాయి. అయితే, డ్రైవర్లు పదవీ విరమణకు ఇష్టపడకపోవటంతో ఒత్తిడి పెంచుతున్నారు. దీంతో సమస్యను పరిష్కరించాల్సిందిగా ఉద్యోగులు ఆర్టీసీ ఎండీ, చైర్మన్లను అభ్యర్థిస్తున్నారు. వారి నుంచి కూడా స్పందన ఉండట్లేదు. దీంతో ఉద్యోగులు నెలల తరబడి ఖాళీగా ఉంటున్నారు. 

ఎందుకిలా?

ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసినట్టే చేసి, నిర్వహణా భారం నుంచి తప్పుకొనేందుకు దొడ్డిదోవన ఇలా ఉద్యోగుల కుదింపు యత్నాలు చేస్తున్నారు. విజయవాడ జోన్‌ ఆర్టీసీ పరిధిలోని ఎన్టీఆర్‌, గుంటూరు జిల్లాల్లో ఉద్యోగులను పదవీ విరమణ చేయాల్సిందిగా బలవంతం చేస్తున్న ఉదంతాలు ఇటీవల వెలుగులోకి వస్తున్నాయి. జీతభత్యాల భారాన్ని కొంతవరకైనా తగ్గించేందుకు వీలైనన్ని మార్గాలను ప్రభుత్వం అన్వేషిస్తోంది. ఇటీవల కొత్త బస్సుల స్థానంలో పెద్దసంఖ్యలో అద్దె బస్సులను తీసుకుంటోంది. అద్దె బస్సులను పెంచుకునే క్రమంలో వ్యూహాత్మకంగానే ఆర్టీసీ ఉన్నతాధికారులు డ్రైవర్లపై దృష్టి సారించారని తెలుస్తోంది. అద్దె బస్సులను తీసుకోవాలంటే డ్రైవర్లను తగ్గించాలి. దీనిని దృష్టిలో ఉంచుకుని అనారోగ్యం పాలైన డ్రైవర్లను ఎంచుకుని అన్ని కేటగిరీల్లో అన్‌ఫిట్‌గా కావాలనే చూపిస్తున్నారని తెలుస్తోంది. 


Updated Date - 2022-08-15T06:17:20+05:30 IST