ప్రతిష్ఠాత్మకంగా పరేడ్‌ గ్రౌండ్‌ సభ

ABN , First Publish Date - 2022-06-28T09:06:14+05:30 IST

బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల సందర్భంగా జూలై 3న పరేడ్‌ గ్రౌండ్‌లో నిర్వహించనున్న బహిరంగ సభను..

ప్రతిష్ఠాత్మకంగా పరేడ్‌ గ్రౌండ్‌ సభ

చరిత్రలో నిలిచిపోయేలా నిర్వహించాలని నిర్ణయం.. 

అసెంబ్లీ సెగ్మెంటు నుంచి 10వేల మంది సమీకరణ 

జేపీ నడ్డాకు ఘన స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు 

తెలంగాణ సంస్కృతిపై నోవోటెల్‌లో ఫొటో ఎగ్జిబిషన్‌

సభ, కార్యవర్గ సమావేశాల విజయానికి బీజేపీ కృషి


హైదరాబాద్‌, జూన్‌ 27 (ఆంధ్రజ్యోతి): బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల సందర్భంగా జూలై 3న పరేడ్‌ గ్రౌండ్‌లో నిర్వహించనున్న బహిరంగ సభను పార్టీ రాష్ట్ర నాయకత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ప్రధాని మోదీ పాల్గొంటున్న ఈ సభను చరిత్రలో నిలిచిపోయేలా నిర్వహించాలని నిర్ణయించింది. ఇందు కోసం ప్రతీ అసెంబ్లీ సెగ్మెంటు నుంచి కనీసం 10వేల మంది కార్యకర్తలు, ప్రజలను తరలించేలా సన్నాహాలు చేస్తోంది. ఈక్రమంలో 119 నియోజకవర్గాలకు సీనియర్‌ నాయకులకు బాధ్యతలు అప్పగించారు. వీరు క్షేత్రస్థాయిలో స్థానిక నేతలతో సమన్వయం చేసుకుంటున్నారు. సభ నిర్వహణ, జన సమీకరణపై పార్టీ ఇన్‌చార్జ్‌ తరుణ్‌ఛుగ్‌, జాతీయ పార్టీ కార్యదర్శి అరవింద్‌ మీనన్‌, సంస్థాగత కార్యదర్శి శివప్రకాశ్‌తో పాటు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ పార్టీ ముఖ్యులతో ఇప్పటికే రెండుసార్లు సమీక్షలు జరిపారు. రాష్ట్ర నేతలు జిల్లా, నియోజకవర్గం, శక్తి కేంద్రాల ఇన్‌చార్జ్‌లతో దశలవారీగా సమావేశాలు నిర్వహించారు. 


భారీగా జన సమీకరణ..

బహిరంగ సభకు గ్రేటర్‌ హైదరాబాద్‌, ఉమ్మడి రంగారెడ్డి జిల్లా నుంచి పెద్ద సంఖ్యలో జన సమీకరణకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. సభ కోసం ఇక్కడికి చేరుకోనున్న కేంద్ర మంత్రులు, వివిధ రాష్ట్రాల సీఎంలు, పార్టీ అధ్యక్షులు జూన్‌ 30, జూలై 1న ఇక్కడ స్థిరపడ్డ వివిధ రాష్ట్రాల ప్రజలు, పలు సామాజిక వర్గాల ప్రజలతో సమావేశమై, మోదీ సభకు తరలిరావాలని కోరనున్నారు. మరోవైపు, జూలై 1న హైదరాబాద్‌ చేరుకోనున్న బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు ఘన స్వాగతం పలికేందుకు నాయకులు ఏర్పాట్లు చేస్తున్నారు. శంషాబాద్‌ విమానాశ్రయం నుంచి కనీసం 50 వేల మంది కార్యకర్తలతో ర్యాలీ నిర్వహించాలని నిర్ణయించారు. జాతీయ కార్యవర్గ సమావేశాల సందర్భంగా హోటల్‌ నోవోటెల్‌లో తెలంగాణ ఉద్యమ చరిత్రతో పాటు సంస్కృతి, సంప్రదాయాలు, ఆహారపు అలవాట్లు ఉట్టిపడేలా ఫొటో ఎగ్జిబిషన్‌ ఏర్పాటు చేయనున్నారు. సమావేశాలు విజయవంతం కావాలని బీజేపీ ముఖ్యనేతలు సోమవారం నోవోటెల్‌ హోటల్‌లో ప్రత్యేక పూజలు చేశారు. 


స్వాగతం పలికేందుకు టెక్నాలజీ వినియోగం..

జాతీయ కార్యవర్గ సమావేశాలకు హాజరుకానున్న ప్రతినిధులను స్వాగతించడానికి బీజేపీ నేతలు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. విమానాశ్రయానికి చేరుకున్న తర్వాత వారిని ఆహ్వానించే నేత ఆయనతో ఫొటో దిగి ట్వీట్‌ చేస్తారు. వెంటనే ఆ మెసేజ్‌ సంబంధిత వాహనంతో ఉండే ప్రబంధక్‌(కార్యకర్త)తో పాటు నోవోటెల్‌ హోటల్‌లో ఆహ్వానం పలికే వారికి వెళుతుంది. అక్కడ వారు స్వాగతం పలుకుతారు. వారికి ఏ గది కేటాయించారో సంబంధిత నేతకు సందేశం ఇస్తారు. ఆయన, సదరు జాతీయ ప్రతినిధికి కేటాయించిన గది వద్దకు తీసుకువెళతారు. 

Updated Date - 2022-06-28T09:06:14+05:30 IST