మధుమేహాన్ని ముందుచూపుతో...

ABN , First Publish Date - 2020-09-22T05:30:00+05:30 IST

రక్తంలో చక్కెర స్థాయిలు సాధారణం కంటే ఎక్కువగా, మధుమేహ నిర్థారణకు తక్కువగా ఉన్న స్థితిని ప్రి డయాబెటిక్‌గా భావించాలి. ఈ స్థితిని నిర్లక్ష్యం చేస్తే, భవిష్యత్తులో టైప్‌2 డయాబెటిస్‌కు దారి తీయవచ్చు...

మధుమేహాన్ని  ముందుచూపుతో...

రక్తంలో చక్కెర స్థాయిలు సాధారణం కంటే ఎక్కువగా, మధుమేహ నిర్థారణకు తక్కువగా ఉన్న స్థితిని ప్రి డయాబెటిక్‌గా భావించాలి. ఈ స్థితిని నిర్లక్ష్యం చేస్తే, భవిష్యత్తులో టైప్‌2 డయాబెటిస్‌కు దారి తీయవచ్చు. ఇలా జరగకుండా ఉండాలంటే ఆహారంలో తగిన మార్పులు చేసుకోవాలి. ఇందుకోసం ఫుడ్‌ సేఫ్టీ అండ్‌ స్టాండర్డ్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా సూచిస్తున్న మార్గదర్శకాలు ఇవే!


  1. ఆహారం బరువును బట్టి: అధిక బరువు ఉన్నవాళ్లు తక్కువ కేలరీలు పొందే వీలున్న ఆహారం తీసుకోవాలి. శరీరం శక్తిని ఖర్చు చేసే తీరు ఆధారంగా, ఇతరత్రా ఆరోగ్య సమస్యలను దృష్టిలో ఉంచుకుని మాక్రోన్యూట్రియంట్లు సరిపడా అందే ఆహారాన్ని ఎంచుకోవాలి.
  2. ఆహారం ఇలా: పీచు, విటమిన్లు, ఖనిజలవణాలతో పాటు, చక్కెర, సోడియం, కొవ్వులు తక్కువగా ఉండే పిండిపదార్థాలతో కూడిన ఆహారం ఎంచుకోవాలి. పిండిపదార్థాలు తగ్గించడం మూలంగా గ్లైసెమిక్‌ ఇండెక్స్‌ అదుపులో ఉంటుంది. పిండిపదార్థాలు, కేలరీల పరిమాణం పెరిగిపోకుండా చక్కెరతో కూడిన పదార్థాలు అరుదుగా తీసుకోవాలి.
  3. చేపలు, మాంసం: చేపలు, లేత మాంసం, పప్పులు, బీన్స్‌, నట్స్‌ ఎక్కువగా, రెడ్‌ మీట్‌ తక్కువగా తీసుకోవాలి. రోజు మొత్తంలో పాల పదార్థాలు రెండు సార్లకు మించి తీసుకోకూడదు. ప్రి డయాబెటిక్స్‌ వృక్షాధార మాంసకృత్తులకు ప్రాధాన్యం ఇవ్వడం ద్వారా శరీర బరువు పెరగకుండా నియంత్రించుకోవచ్చు. 
  4. కొవ్వులు: శరీరానికి అందే మొత్తం కేలరీల్లో కొవ్వులు 30శాతం, శాచురేటెడ్‌ ఫ్యాట్‌ 10శాతం ఉండేలా జాగ్రత్తపడాలి. ఇందుకోసం ఆరోగ్యకరమైన నూనెలను పరిమితంగా వాడుకోవాలి. నూనెలో ముంచి వేయించే పద్ధతులకు బదులు గ్రిల్‌, బేక్‌ లాంటి వంట ప్రత్యామ్నాయాలు ఎంచుకోవాలి.
  5. స్నాక్స్‌: అనారోగ్యకరమైన స్నాక్స్‌కు బదులుగా గుప్పెడు బాదం, జీడిపప్పు, వాల్‌నట్స్‌, పిస్తాలు ఎంచుకోవాలి.
  6. పీచు ఎక్కువ: ఆహారంలో ఎక్కువ పీచు, తక్కువ గ్లైసెమిక్‌ ఇండెక్స్‌ ఉండేలా చూసుకోవాలి. ఇందుకోసం ప్రతి వెయ్యి కిలో కేలరీల్లో కనీసం 20 గ్రాముల పీచు ఉండేలా పదార్థాలను (పప్పుధాన్యాలు, బీన్స్‌, పళ్లు) ఎంచుకోవాలి.
  7. ఉప్పు: ఉప్పు రోజుకు 2,300 మిల్లీగ్రాములు (ఒక టీస్పూను) మించకూడదు.
  8. చక్కెర: తీపి పానీయాలకు బదులుగా నిమ్మరసం, మజ్జిగ, జల్‌జీరా, తాజా నీళ్లు తాగాలి.

Updated Date - 2020-09-22T05:30:00+05:30 IST