2021లో అమెరికా అధ్యక్షుడు, ఆయన సతీమణి ఆదాయం ఎంతో తెలుసా..

ABN , First Publish Date - 2022-04-17T00:05:13+05:30 IST

గతేడాది అమెరికా అధ్యక్షుడు బైడెన్, ఆయన సతీమణి మొత్తం 610,702 డాలర్ల ఆదాయం పొందారు. ఈ విషయాన్ని ట్యాక్స్ చెల్లింపుల సందర్భంగా బైడెన్ దంపతులు పేర్కొన్నారు.

2021లో అమెరికా అధ్యక్షుడు, ఆయన సతీమణి ఆదాయం ఎంతో తెలుసా..

ఎన్నారై డెస్క్: గతేడాది అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, ఆయన సతీమణి మొత్తం 610,702 డాలర్ల ఆదాయం పొందారు. ఈ విషయాన్ని ట్యాక్స్ చెల్లింపుల సందర్భంగా బైడెన్ దంపతులు పేర్కొన్నారు. ఈ ఆదాయంపై వారు మొత్తం 150,439 డాలర్ల పన్ను చెల్లించారు. బైడెన్ దంపతుల ట్యాక్స్ చెల్లింపులకు సంబంధించిన వివరాలను శ్వేతసౌధం తాజాగా వెల్లడించింది. ఇక ఉపాధ్యక్షురాలు కమాలా హ్యారిస్, ఆమె భర్త డగ్ ఎమ్హాఫ్ గతేడాది మొత్తం  1,655,563 డాలర్లు ఆర్జించారు. 523,371డాలర్ల ఫెడరల్ ట్యాక్స్ చెల్లించారు. 1970 నుంచి అమెరికా అధ్యక్షులు తమ ఆదాయం, పన్ను చెల్లింపులకు సంబంధించిన వివరాలను ప్రజల ముందు పెడుతున్నారు. ఇది ఓ సాంప్రదాయంగా కొనసాగుతోంది. 


కాగా.. తన ట్యాక్స్ వివరాలను బహిర్గతం చేసేందుకు అప్పటి అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ నిరాకరించారు. 2020 అధ్యక్ష ఎన్నికల్లో ఇది బైడెన్‌కు ఓ ఆయుధంగా మారింది. ట్రంప్ తన ఆదాయ వివరాలు బహిర్గతం చేయట్లేదంటూ మండిపడ్డ బైడెన్.. తాను వ్యక్తిగత ఆర్థికాంశాల విషయంలోనూ పారదర్శకత పాటిస్తానని ప్రచారం చేసుకున్నారు. అంతేకాకుండా.. 2020 ఎన్నికలకు ముందు 22 ఏళ్లల్లో తాను చెల్లించిన పన్నుల  వివరాలన్నిటినీ బహిరంగ పరిచారు. అయితే.. ట్రంప్ మాత్రం తన ఆర్థికవ్యవహారాలు ఆడిట్ అవుతున్న కారణంగా ట్యాక్స్ వివరాలు వెల్లడించలేకపోయానని చెప్పుకొచ్చారు. కానీ.. ట్రంప్ విషయంలో అప్పటికే ప్రజలు ఓ స్థిరాభిప్రాయానికి రావడంతో చివరికి గెలుపు బైడెన్‌ను వరించింది.

Updated Date - 2022-04-17T00:05:13+05:30 IST