ధరా భారం

Jun 22 2021 @ 01:28AM

సామాన్యుడిపై దరువు

కొండెక్కిన కూరగాయల ధరలు

అందనంత దూరంలో  నిత్యావసరాలు

వాహనదారులకు పెట్రో వాత

ఆందోళన కలిగిస్తున్న పన్నులు 

భయపెడుతున్న కరెంట్‌ బిల్లులు

తలకిందులైన కుటుంబ బడ్జెట్‌

దినదినగండంగా  మధ్యతరగతి జీవనం 

 పెరిగిన ధరలతో సామాన్యుడి బతుకు భారంగా మారింది. కొవిడ్‌ మొదటి, రెండు వేవ్‌లతో ఇప్పటికే ఉపాధి కరువై జనం అల్లాడుతున్నారు. అదే సమయంలో ధరాఘాతంతో నాలుగువేళ్లు నోట్లోకి పోయే పరిస్థితులు కనిపించడం లేదు. అప్పులు పుట్టక, ఆదాయం లేక పడుతున్న అవస్థలు  అన్నీఇన్నీ కావు. ఏకంగా ఒకేసారి అన్నిరకాల మోతలతో మధ్యతరగతి వారు సైతం అల్లాడు తున్నారు. నిత్యావసరాల ధరలు ఇప్పటికే చుక్కలనంటగా, నూనెలు కాగుతున్నాయి. పండ్లు, కూరగాయల ధరలు కొండెక్కి కూర్చున్నాయి. కనీసం పప్పులతో సరిపెట్టుకుందామనుకున్నా అవీ పేలుతున్నాయి. పైగా పెట్రోలు, డీజిల్‌ ధరలు మండుతున్నాయి. వీటన్నింటికీ తోడు సర్కారు వారి సరికొత్త పన్నులు గుదిబండగా మారాయి. కరెంట్‌ బిల్లులు, ఇంటి అద్దెలు భయపెడుతున్నాయి. మొత్తంగా కుటుంబ బడ్జెట్‌ తల్లకిందులైంది. 


ఒంగోలు (కార్పొరేషన్‌), జూన్‌ 21 : కొవిడ్‌.. కుటుంబ వ్యవస్థపై తీవ్రప్రభావం చూపింది. పేదల జీవితాలను చిన్నాభిన్నం చేసింది. గత రెండు మూడునెలలుగా పాక్షిక లాక్‌డౌన్‌ ఆంక్షలతో ఉపాధి అంతంతమాత్రంగా ఉంది. మరోవైపు పెరిగిపోతున్న ధరలు, నెల వచ్చేసరికి కట్టాల్సిన కిస్తీలు, కరెంటు బిల్లులు, అద్దెల భయం, పేద, మధ్యతరగతి వారిని వణికిస్తోంది. ఇటీవల కాలంలో పేదలు, సామాన్యులపై ధరలు దరువు వేస్తుండగా, అడ్డూఅదుపులేకుండా పెరిగిపోతున్న పెట్రో ధరలు వాహనదారుడి నడ్డివిరుస్తున్నాయి. నిత్యావసర ధరలు దడ పుట్టిస్తున్నాయి. సామాన్యుడికి పెరిగిన ధరలతో పొట్ట నిండే పరిస్థితి కనిపించడం లేదు. దానికితోడు నెలనెలా తడిసిమోపెడవుతున్న ఇంటి అద్దెలు, కరెంట్‌ బిల్లులు, పెట్రో వాతతో మధ్యతరగతి ప్రజల జీవనం దినదినగండంగా మారింది. 


మండిపోతున్న కూరగాయలు

మార్కెట్లో కూరగాయల ధరలు మండిపోతున్నాయి. గడిచిన నెలరోజులుగా పెరిగిన ధరలు దిగి రావడం లేదు. కూరగాయల సంగతి పక్కన పెట్టినా ఆకు కూరల ధరలు సైతం అదిరిపోతున్నాయి. ఇప్పటికే  కోళ్లు, చేపలు వేసవి గిరాకీ పేరుతో అధిక ధరలకు విక్రయిస్తున్నారు. ఇదివరకు రూ.100 తీసుకెళితే కనీసం ఐదారు రకాల కూరగాయలతో ఇంటికొచ్చే వారు.. ఇప్పుడు రెండు రకాలు కూడా కొనలేని పరిస్థితి ఉందని వినియోగదారులు వాపోతున్నారు. ప్రధానంగా పచ్చిమిర్చి కేజీ రూ.70కి చేరింది. టమాటా పదిహేను రోజులుగా రూ.20 పలుకుతోంది. బీరకాయ రూ.40కు, క్యారెట్‌ ఏకంగా మిర్చితో పోటీపడుతూ రూ.80కి చేరింది. ఇక బీన్స్‌ పేరు వింటేనే భయం పుడుతోంది. నెల క్రితం వరకూ కిలో రూ.40 ఉన్న బీన్స్‌ ధర ఇప్పుడు ఒక్కసారిగా రూ.80కు పెరిగింది. చిక్కుడుకాయలు కేజీ రూ.50కి అమ్ముతున్నారు. అల్లం కిలో రూ.100, దోసకాయ రూ.40, బంగాళదుంప రూ.40, దొండకాయ రూ.20, వంకాయ రూ.52, క్యాబేజీ రూ.40, బీట్‌రూట్‌ రూ.40, కాకరకాయ రూ.60, మునక్కాయ లు కేజీ రూ.65లు అమ్ముతున్నారు. ఆకు కూరలు కట్ట ఒకటి రూ.5లకు అమ్ముతుండగా, కొత్తిమీర కట్ట గతంలో రూ.20 నుంచి ప్రస్తుతం రూ.40కు పెరిగింది. ఇక కూరగాయలు కొంటే ఉచితంగా ఇచ్చే కరివేపాకు కనీసం రూ.10కు తక్కువ లేకుండా అమ్ముతున్నారు. 


వాహనదారుడిపై పెట్రో వాత 

నేడు అందరికీ వాహనం సాధారణమైంది. బండి లేనిదే బయటకు కాలు బయటపెట్టని పరిస్థితి. అయితే ప్రస్తుతం పెరుగుతున్న పెట్రో ధరలతో వామ్మో వాహనం వద్దు.. వాకింగ్‌ మేలు అంటూ వాహనదారులు వాపోతున్నారు. కేంద్రప్రభుత్వం తీసుకుంటున్న అసంబద్ధ విధానాలతో పెట్రోలు, డీజిల్‌ ధరలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. దీంతో మధ్యతరగతి వారు వాహన బయటకు తీయడానికి భయపడుతుండగా, కుటుంబ జీవనం కోసం ఉపాధి మార్గంగా ఎంచుకున్న ఆటోవాలాలు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. ఈ నేపథ్యంలోఆటోవాలాలు ధరలు పెంచగా సామాన్యులకు ఆ సౌకర్యమూ దూరమైంది. 2019లో కేంద్ర బడ్జెట్‌ ప్రవేశపెట్టక ముందు లీటరు పెట్రోలు ధర రూ.73.98, డీజిల్‌ 68.85 ఉండేది. కాగా గత ఏడాదిలో పెట్రోలు రూ.76.89, డీజిల్‌ 70.81కు పెరిగింది. తాజాగా ఈ ఏడాది ప్రతిరోజూ పైసల రూపంలో పెరుగుతూ లీటరు పెట్రోలు రూ.100 దాటేసింది. డీజిల్‌ కూడా అదేదారిలో ఉంది. గ్యాస్‌ సిలిండర్‌ ధర కూడా రూ. 860కు చేరింది. 


సొంతింటికీ ‘పన్ను’ పోటు 

సొంతింటి యజమానులపై పన్ను పిడుగుపడింది. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం పేరుతో అమలుచేస్తున్న జీఐఎస్‌విధానం పట్టణ ప్రజలపై పన్నుపోటు తెచ్చింది. గతేడాదిలో జియోగ్రాఫికల్‌ ఇన్‌ఫర్మేషన్‌ సిస్టమ్‌ విధానం ఇంటి పన్నులు పెంచిన ప్రభుత్వం మరోసారి పన్నులు పెంచేందుకు సిద్ధమైంది. ఆయా పట్టణాల్లో ఆస్తి విలువ ఆధారితంగా పన్నులు పెంచుతూ జీవో విడుదల చేసింది. కొద్దినెలల క్రితం వరకు సాధారణంగా ఉన్న ఆస్తిపన్నులు ఒక్కసారిగా పెరిగిపోయాయి. దీంతో పన్నుల పెంపు భారంపై భయాందోళన చెందుతున్న గృహ యజమానులు అధిగమించేందుకు అద్దెలు పెంచుతున్నారు. అంతే కాకుండా చెత్తపన్ను, యూజర్‌ చార్జీల పేరుతో పట్టణ ప్రజలపై మోత మోగిస్తున్నారు. 
Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.