ధర.. దడ

ABN , First Publish Date - 2022-05-14T05:30:00+05:30 IST

రోజురోజుకూ పెరిగిపోతున్న ధరలతో సామాన్య, మధ్యతరగతి కుటుంబాలపై పెనుభారం పడుతోంది. ఈరోజు ఉన్న ధర రేపు, రేపు ఉన్న ధర ఆ మర్నాడు ఉండడం లేదు. ఇదేమంటే... ధరలు పెరిగిపోతున్నాయన్న జవాబు ఠక్కున వ్యాపారస్తుల నోట నుంచి వినిపిస్తోంది.

ధర.. దడ


నింగినంటుతున్న నిత్యావసరాల ధరలు
సామాన్యుడిపై బాదుడే బాదుడు
కిలో చికెన్‌ రూ.300 పైనే..
లీటర్‌ ఆయిల్‌ రూ.195
టమాటా కిలో రూ.80
కిలో అల్లం రూ.240
రాజాం రూరల్‌/ శృంగవరపుకోట/ గజపతినగరం, మే 15:
రోజురోజుకూ పెరిగిపోతున్న ధరలతో సామాన్య, మధ్యతరగతి కుటుంబాలపై పెనుభారం పడుతోంది. ఈరోజు ఉన్న ధర రేపు, రేపు ఉన్న ధర ఆ మర్నాడు ఉండడం లేదు. ఇదేమంటే... ధరలు పెరిగిపోతున్నాయన్న జవాబు ఠక్కున వ్యాపారస్తుల నోట నుంచి వినిపిస్తోంది. గత్యంతరం లేని పరిస్థితుల్లో భారమైనా సరే కొనుక్కోకాల్సిన దుస్థితి నెలకొంది. మండుతున్న ఎండలు, పంటల దిగుబడి తగ్గిపోవడం, పెళ్లిళ్ల సీజన్‌ కావడంతో ధరలు అమాంతంగా పెరుగుతు న్నాయి. చికెన్‌, మటన్‌, కోడిగుడ్ల ధరలు కూడా పెరగడంలో పోటీపడుతున్నాయి దాదాపుగా అన్నిరకాల కూరగాయలు, ఆకుకూరల ధరలు పెరిగాయి. టమాఠా రూ.80కి చేరింది.  పొడుగు చిక్కుళ్లు, క్యారెట్‌ కిలో రూ.60 పైమాటే. వంకాయలు కిలో రూ.40 కాగా, బీరకాయలు కిలో రూ.60కి చేరింది. పెద్దవి రెండు అరటికాయలు రూ.30 కాగా చిన్నవి మూడు రూ.30కి అమ్ముతున్నారు. అల్లం కిలో రూ.240 నుంచి రూ.300కి చేరింది. ఆకుకూరలూ అల్లాడిస్తున్నాయి.

ట‘మోత’
టమాట లేందే కూర లేదు. చారు లేదు.. అసలు వంటే కుదరదని మహిళలు ఖరాకండిగా చెబుతారు. చేసినా రుచించదంటారు. మన వంటకాల్లో టమాట అంతగా కీలకమైపోయింది. అదే ఇప్పుడు నింగిపై కూర్చొంది. ధర రోజురోజుకూ పైపైకి ఎగబాకుతోంది. బహిరంగ మార్కెట్‌లో కిలో రూ.75 నుంచి రూ.80 ధరకు సామాన్యులు కొనలేక.. ఉండలేక ఇబ్బంది పడుతున్నారు. గత నెల ఇదే తేదీ వరకు కిలో రూ.10 పలికిన టమాటా ఇప్పుడు ఏకంగా కిలో రూ. 80కు చేరింది. నెల రోజుల వ్యవధిలోనే కిలో వద్ద రూ.70 పెరిగింది. బహిరంగ మార్కెట్‌లో శనివారం కిలో రూ.75 నుంచి రూ.80 పలికిన టామాట రైతుబజార్లలో కిలో రూ.62కు విక్రయించారు. గత ఏడాది జనవరి నుంచి జూన్‌ వరకు రైతు బజార్లలో రూ. 10 నుంచి 20 వరకు అమ్మిన టమాట అక్టోబర్‌ నెల నాటికి రూ.50కు పెరిగింది. నవంబర్‌ నెలలో రూ. 80 వరకు చేరింది. డిసెంబర్‌ నుంచి ధర తగ్గుతూ వచ్చింది. ఈ ఏడాది జనవరి నుంచి ఏప్రిల్‌ వరకు కిలో రూ. 15 దాటలేదు. ఏప్రిల్‌ 23నుంచి క్రమంగా పెరుగుతూ వస్తోంది. రైతు బజార్లలో గత ఏడాది ఇదే సమయంలో కిలో రూ.13 ఉన్న ధర ఇప్పుడు కిలో రూ.62 పలుకుతోంది. ఎస్‌.కోటలో స్థానిక రైతులతో పాటు అనకాపల్లి సమీప జిల్లాల నుంచి దిగుమతి అయ్యే టమాటా ప్రస్తుతం మదనపల్లి నుంచి మాత్రమే వస్తుండడంతో డిమాండ్‌ పెరిగిందని బహిరంగ మార్కెట్‌లో విక్రయించే వ్యాపారులు, రైతు బజారు రైతులు చెబుతున్నారు.

చికెన్‌ కిలో రూ.300
మాంసం ప్రియులకు  చికెన్‌  ధర చుక్కలు  చూపిస్తోంది. కిలో చికెన్‌ రూ.300 చెబుతుండడంతో కొనేందుకు సుముఖత చూపలేకపోతున్నారు. వారం రోజుల కిందట రూ.250 పలికిన చికెన్‌ ఒక్కసారిగా రూ.50 పెరగడంతో వారాంతంలో కూడా కొనడానికి సందేహిస్తున్నారు. ధర పెరగడంతో వ్యాపారం పడిపోయిందని ఇటు వ్యాపారులూ నిరాశ వ్యక్తంచేస్తున్నారు. ఎండ వేడికి  కోళ్లు చనిపోతుండడంతో ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నా మని, పెరిగిన ధరకు చికెన్‌ కొనుగోళ్లు పడిపోయాయని అంటున్నారు.   
-----------

Updated Date - 2022-05-14T05:30:00+05:30 IST