పండుగ పూట.. ధరల మంట!

ABN , First Publish Date - 2021-01-12T06:56:40+05:30 IST

నిత్యావసర వస్తువుల ధరలు జనానికి చుక్కలు చూపెడుతున్నాయి. తెలుగువారి పెద్ద పండుగ సంక్రాంతి వేళ అందరికీ ఇష్టమైన పిండివంటలకు కష్టాలొచ్చాయి.

పండుగ పూట.. ధరల మంట!

నడ్డి విరుస్తున్న నిత్యావసర సరుకులు

సలసల కాగుతున్న వంట నూనెలు

పేలుతున్న పప్పులు, బియ్యం

కొనుగోళ్లకు వెనకాడుతున్న జనం

పులుపెక్కిన చింతపండు,   మళ్లీ పెరిగిన ఉల్లి 

రెడీమెడ్‌ వంటకాల వైపు అందరిచూపు

వెలవెలబోతున్న పచారీదుకాణాలు 


నిత్యావసర వస్తువుల ధరలు జనానికి చుక్కలు చూపెడుతున్నాయి. తెలుగువారి పెద్ద పండుగ సంక్రాంతి వేళ అందరికీ ఇష్టమైన పిండివంటలకు కష్టాలొచ్చాయి. నూనెలు సలసలకాగుతున్నాయి. ఏకంగా కేజీకి రూ.50కిపైగా పెరిగాయంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. ఇక పప్పులు పేలుతున్నాయి. బియ్యం, ఇతర సరుకులూ వాటికి పోటీపడుతున్నాయి. కరోనా కాలంలో కొండెక్కిన  ధరలు ఎంతకీ తగ్గకపోగా పండుగ సమయంలో ఆకాశాన్నం టాయి. ఇంత జరుగుతున్నా ధరల నియంత్రణ అనేది మచ్చుకు కూడా కని పించడం లేదు. దీంతో వ్యాపారుల ఇష్టారాజ్యమైందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఫలితంగా సామాన్యుల పండుగ ఆనందం ఆవిరవుతోంది. పేదలైతే పిండివంటలు మర్చిపోవాల్సి వస్తోంది. వందలు కాదు వేలు ఉంటేనే సరుకులు అన్నట్లు పరిస్థితి తయారైంది. 


ఒంగోలు (కార్పొరేషన్‌) జనవరి 11 : సంక్రాంతి సందడి వచ్చేసింది. ఇతర ప్రాంతాల్లో ఉన్నవారు సొంతూర్లకు వస్తుండటంతో పిల్లలు, పెద్దలతో పల్లె ల్లో సందడి వాతావరణం నెలకొంది. పెద్ద పండుగ కళ ప్రతి ఇంటా ఉట్టిపడుతోంది. ఇంతవరకు బాగా నే ఉన్నా పిల్లలు, పెద్దలకు నోరూరించే సంక్రాంతి ప్రత్యేకతను చాటి చెప్పే ఘుమఘుమలు తగ్గాయి. ప్రధాన వంటకాలైన అరిసెలు, బూరెలు, బొబ్బట్లు, నువ్వుండలు, చక్రాలపై ధరల దెబ్బపడింది. పండుగ పేరుతో వ్యాపారులు నిత్యావసర వస్తువుల రేట్లను అమాంతం పెంచేశారు. నియంత్రణ లేకపోవడంతో వారు చెప్పిందే రేటుగా మారింది.

 

కొవిడ్‌ నుంచి కోలుకుని..

పది నెలలపాటు కొవిడ్‌ కాలం.. అన్నిరకాల వ్యాపారాలు దాదాపు మూతపడ్డాయి. సామాన్య, మధ్యతరగతి ప్రజలకు జీవనోపాధి కరువైంది. పేదల పరిస్థితి మరీ దారుణంగా గడిచింది. సాగు కలిసిరాక రైతుల ఆదాయాలు అంతంతమాత్రమే అయ్యాయి. ఇప్పుడిప్పుడే కరోనా భయం నుంచి కాస్తంత జనం బయటపడుతున్నారు. ఇంతలో వచ్చిన పెద్దపండుగ సంక్రాంతికి ఆర్థిక కష్టాలు ఇంకా వెంటాడుతునే ఉన్నాయి. ఇంకోవైపు నిత్యావసర ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. దీంతో పల్లెల్లో కాస్తంత సంక్రాంతి సందడి కనిపిస్తుండగా, పట్టణాల్లో మాత్రం అంతంతమాత్రంగానే ఉంది. మొత్తంగా సంక్రాంతి పూట ధరల మంట జనానికి దడ పుట్టిస్తోంది. 


వంట నూనెల పరుగు

సామాన్యులకు నిత్యావసర ధరలు దడ పుట్టిస్తుండగా, కూరగాయల ధరలు కొండెక్కి కూర్చున్నాయి. నెల వ్యవధిలోనే అన్ని రకాల సరుకులు కేజీకి ఏకంగా రూ.10 నుంచి 20వరకూ పెరిగాయి. అందరికీ తప్పనిసరి వంటకమైన అరిసెలకు వంట నూనెల ఎఫెక్ట్‌ తగిలింది. ఊహించని విధంగా కిలో రూ.150పైనే ఉండటంతో ఆవైపు చూసేందుకే భయపడుతున్నారు. కనీసం పప్పులతో సరిపెట్టుకుందాం అనుకున్న పెరిగిన ధరలతో ఏంకొనేటట్లు లేదు. దీంతో సామాన్యులు చాలావరకు ఒకటి అర వంటకాలతో సరిపెట్టుకుంటున్నట్లు చెబుతున్నారు. ఉల్లి ధర మళ్లీ పెరుగుతోంది. చింతపడి కిలో రూ. 270కి చేరింది.  


రెడీమేడ్‌ వంటకాల వైపు మొగ్గు

ఆకాశాన్నంటుతున్న ధరలతో దుకాణాల్లో సరుకులు కొని తీసుకెళ్లి వంటకాలు తయారుచేయడం పట్టణాల్లో దాదాపు తగ్గిపోయింది. దానికితోడు కుప్పలుతెప్పలుగా ఏర్పాటైన స్వగృహ ఫుడ్స్‌ అందరికీ అందుబాటులోకి వచ్చాయి. అయితే వాటిలోనూ పిండివంటల ధరలు మండిపోతున్నాయి. అదేమంటే వారూ ధరలు పెరిగాయని చెప్తున్నారు. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో పట్టణవాసులుఅవసరమైన తినుబండారాల కొనుగోలుకు వెళుతుండడంతో ఆ దుకాణాలు కళకళలాడుతున్నాయి. ముఖ్యంగా మధ్యతరగతి వారే రెడీమేడ్‌ వంటకాలపై మక్కువ చూపుతున్నట్లు వ్యాపారులు చెబుతున్నారు. ముఖ్యంగా సంక్రాంతి పండుగ కావడంతో కాలనుగుణంగా ఖర్చును సైతం లెక్కచేయకుండా పెద్ద కుటుంబాల వారు మాత్రమే వంటల ఘుమఘుమను కొనసాగిస్తున్నారు. 


Updated Date - 2021-01-12T06:56:40+05:30 IST