అహంకారం.. అనర్థాలకు మూలం

ABN , First Publish Date - 2020-12-31T06:42:17+05:30 IST

‘‘ఈ ప్రపంచంలోకి వచ్చిన వారెవరైనా అహంకారం అనే దుర్గుణాన్ని వదిలి ఇంకే మంచి గుణానైన్నా అలవరచుకుంటే.. అశాశ్వతమైన జీవితం అర్థవంతమవుతుంది’’ అంటాడు మహాత్మా కబీరు. అహంకారం

అహంకారం.. అనర్థాలకు మూలం

‘‘ఈ ప్రపంచంలోకి వచ్చిన వారెవరైనా అహంకారం అనే దుర్గుణాన్ని వదిలి ఇంకే మంచి గుణానైన్నా అలవరచుకుంటే.. అశాశ్వతమైన జీవితం అర్థవంతమవుతుంది’’ అంటాడు మహాత్మా కబీరు. అహంకారం మనిషిని అన్ని విధాలుగా నష్టపరిచే ఆలోచనా విధానం. అహంకారాన్ని విడిచినవాడు మాత్రమే సుగుణశీలుడు, సద్బుద్ధిగలవాడై జీవితానికున్న పరమార్థాన్ని తెలుసుకొని భగవంతుని కృపకు పాత్రుడు కాగలడని కబీరు మహాత్ముడి ఉపదేశం. మనిషి పతనానికి కారణాలు.. అహంకారం, గర్వమేనని మన పురాణాలు, ఇతిహాసాలు చెబుతున్నాయి. రావణుడు తన అహంకారం వల్లే రాముడి చేతిలో హతమయ్యాడు. పాండవులతో అహంకారంగా వ్యవహరించడం వల్లనే కౌరవులు నాశనమయ్యారు.  శిశుపాలుడి అహంభావమే అతడికి యమపాశమైంది. తన గురించి తాను గొప్పగా ఆలోచించడం ఇతరులను చిన్నచూపు చూస్తూ వారి తప్పులను వెదకడం అహంకారుల లక్షణం.


ఆత్మజ్ఞానం కలిగినవారు ప్రతి ఒక్కరినీ తమతో సమానంగా చూస్తారు. భూతదయ కలిగి ఉంటారు. ఇతరుల బాధల్ని తమ బాధగా భావిస్తారు. మండన మిశ్రుడికి తానొక గొప్ప తత్త్వవేత్తననే అహంకారం ఉండేది. ఆ గర్వంతో విర్రవీగుతూ ఇతరులను చులకనగా చూసేవాడు. అలాంటివాడు.. శంకరాచార్యులవారితో జరిగిన తర్కగోష్ఠిలో, ఆయన జ్ఞానం ముందు తలదించుకోవాల్సి వస్తుంది. అప్పుడతనితో ఆది శంకరులు.. ‘‘సముద్ర జలంలాంటి జ్ఞానంలో నాకు తెలిసింది గరిటెడు మాత్రమే’’ అని అంటారు. అప్పుడు మండన మిశ్రుడికి జ్ఞానోదయమై శంకరులను తన గురువుగా స్వీకరించాడు. ఆదిశంకరులు ఆయనకు సురేశ్వరాచార్యులు అని పేరుపెట్టి తగిన రీతిలో సత్కరించి దక్షిణ మటమైన శారదా పీఠానికి తొలి పీఠాదిపతిగా నియమించారు. అహంకారికి, నిరహంకారికి గల తేడాను విస్పష్టంగా తెలిపే ఉదాహరణ ఇది. అహంకారానికి సంబంధించి భారతంలో ఒక కథ ఉంది.


ఒక రోజు నిండు సభలో కర్ణుడిని అంతా దాన కర్ణునిగా కీర్తించడంతో దుర్యోధనుడి అహం దెబ్బతింటుంది. ‘‘నేనిచ్చిన రాజ్యంతో కర్ణుడు దానకర్ణుడయ్యాడు. మరి నేను రారాజునై ఉండి కూడా నాకు ఆ పేరు రావట్లేదు కదా?’’ అనుకొని.. వెంటనే రాజప్రాసాదంలో ఒక గంటను కట్టిస్తాడు. ఆర్తులు వచ్చి గంట మోగించి తమ కష్టం గురించి చెప్తే వారు అడిగింది ఇచ్చి పంపుతానని చాటింపు వేయిస్తాడు. అప్పుడు కృష్ణుడు దుర్యోధనుని అహాన్ని అణచాలనే ఉద్దేశంతో.. ఒక బ్రాహ్మణుడి వేషంలో వెళ్లి గంట కొడతాడు. తాను చేయబోయే యాగానికి సమిధలు కావాలని అడుగుతాడు. అయితే అది బాగా ముసురుపట్టి వానలు కురిసే కాలం కావడంతో దుర్యోధనుడు విసుక్కుంటాడు. ‘సమిధలు ఎప్పుడు అడగాలో తెలియదా?’ అని చీదరించుకుంటాడు. అప్పుడు బ్రాహ్మణ వేషంలోని కృష్ణుడు కర్ణుడి వద్దకు వెళ్లి కట్టెలు అడిగితే.. రాధేయుడు తన ఇంటి వాసాలు, దూలాలు పడగొట్టించి తీసుకెళ్లమంటాడు. కర్ణుని దానశీలత గురించి గూఢచారులు చెప్పగా విన్న దుర్యోధనుడు సిగ్గు పడి తాను పెట్టిన గంటను తొలగిస్తాడు. అహంకారికి, అసలైన దానశీలికి మధ్య ఉండే తేడాను తెలిపే కథ ఇది.


పరికిపండ్ల సారంగపాణి, 9849630290

Updated Date - 2020-12-31T06:42:17+05:30 IST