Bengalore: డ్రమ్స్ వాయించొద్దన్నారని విద్యుత్తు ఉత్పత్తి చేసిన ఘనుడు

ABN , First Publish Date - 2022-06-10T01:02:22+05:30 IST

బలమైన కోరిక ఉన్నప్పుడు దేనికైనా సిద్ధమవుతారు. అలాంటి కోరిక

Bengalore: డ్రమ్స్ వాయించొద్దన్నారని విద్యుత్తు ఉత్పత్తి చేసిన ఘనుడు

బెంగళూరు : బలమైన కోరిక ఉన్నప్పుడు దేనికైనా సిద్ధమవుతారు. అలాంటి కోరిక ఉన్నవారిని అడ్డుకునే ప్రయత్నం చేస్తే వారిలో మరింత పట్టుదల పెరుగుతుంది. కర్ణాటకలోని పృథ్వి మంగిరి అలాంటి యువకుడే. ఆయనకు డ్రమ్స్ వాయించడమంటే పిచ్చి. కానీ ఆ చుట్టుపక్కలవారు ఆ శబ్దాన్ని భరించలేక, పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇతరులను బాధపెట్టకుండా డ్రమ్స్ వాయించడాన్ని కొనసాగించడానికి చేసిన ప్రయత్నాల్లో ఆయన కరెంటును ఉత్పత్తి చేసి, విద్యుత్తు శాఖకు అమ్మగలిగే స్థాయికి ఎదిగారు. 


దక్షిణ బెంగళూరులోని బన్నేర్‌గట్టలో ఉంటున్న పృథ్వీ (30)  రోజూ ఉదయం, సాయంత్రం డ్రమ్స్ వాయిస్తూ ఉంటే, ఇరుగు, పొరుగువారు ఆయనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఆయన తన అభిరుచిని వదులుకోవలసి వచ్చింది. పృథ్వి ఆవేదనను గుర్తించిన ఆయన తాత గారు కే రాజన్ ఓ ఉపాయం చెప్పారు. ఇంట్లో ఓ గదిలో సౌండ్ ప్రూఫ్ చేయించారు. అయితే ఆ గది విపరీతంగా వేడిగా మారింది. దాన్ని తట్టుకోవడం కోసం ఎయిర్ కండిషనింగ్ చేయించారు. ఫలితంగా విద్యుత్తు బిల్లు నాలుగు రెట్లు పెరిగింది. నెలకు రూ.1,500 వరకు వచ్చే విద్యుత్తు బిల్లు రూ.7,000కు చేరింది. 


దీంతో రాజన్ మరో సలహా ఇచ్చారు. పర్యావరణ హితకరమైన పద్ధతిలో సౌర విద్యుత్తును ఉత్పత్తి చేయాలని తెలిపారు. తాతామనవళ్ళు ఇద్దరూ కలిసి బెంగళూరు విద్యుత్తు సరఫరా కంపెనీ లిమిటెడ్ సౌర విద్యుత్తు పథకంలో చేరారు. పృథ్వి అవసరానికి తగినట్లు అమర్చదగిన సోలార్ ప్యానెళ్ళను ఆ కంపెనీ నిర్ణయించింది. 5 కిలోవాట్ల సోలార్ జనరేషన్ ప్యానెల్స్‌ను అమర్చేందుకు అనుమతి ఇచ్చింది. రెండున్నరేళ్ళ క్రితం రూ.6 లక్షల వ్యయంతో 15 ప్యానెల్స్‌ను ఏర్పాటు చేశారు. 


పృథ్వి, రాజన్ ఇప్పుడు చాలా సంతోషంగా ఉన్నారు. నెలకు 5 కిలోవాట్ల విద్యుత్తును ఉత్పత్తి చేస్తూ, సుమారు 3 కిలోవాట్ల వరకు వినియోగించుకుని, మిగిలిన విద్యుత్తును ఆ కంపెనీకి అమ్ముతున్నారు. ఒక్కొక్క యూనిట్‌ విద్యుత్తును రూ.7కు అమ్ముతున్నారు. 


అయితే ఇప్పటికీ వీరికి విద్యుత్తు బిల్లు నెలకు సుమారు రూ.7,000 వస్తోంది. అయితే విద్యుత్తు కంపెనీకి విద్యుత్తును అమ్ముతుండటం వల్ల వచ్చే ఆదాయంతో ఈ బిల్లు చెల్లించిన తర్వాత సుమారు నెలకు రూ.400 నుంచి రూ.600 వరకు మిగులుతోంది. 


పృథ్వి తన గదిని స్టూడియోగా మార్చేశారు. దానికి ‘బ్రెడ్ అండ్ జామ్’గా పేరు పెట్టారు. బాలీవుడ్ పాటలు, విద్యా సంబంధిత కార్యక్రమాల రికార్డింగులు చేస్తున్నారు. ఆయన మెకానికల్ ఇంజినీరింగ్ కూడా చేశారు. 


Updated Date - 2022-06-10T01:02:22+05:30 IST