ఇంటి వద్దకు గురువులు

ABN , First Publish Date - 2021-08-02T05:03:58+05:30 IST

గిరిజన గురుకులాల్లో చదువుతున్న పిల్లలపై గురువులు ప్రత్యేకంగా దృష్టిపెట్టారు. ఆన్‌లైన్‌ బోధనను విద్యార్థులు వింటున్నారా? లేదా? ఇంటి వద్ద హోంవర్క్‌ చేస్తున్నారా? లేదా? ఏమైనా సందేహాలు ఉంటున్నాయా? అనేది స్వయంగా వెళ్లి పరిశీలిస్తున్నారు. విద్యార్థుల సామర్థ్యం గురించి తల్లిదండ్రులను అడిగి తెలుసుకుంటున్నారు.

ఇంటి వద్దకు గురువులు
కురుపాం మండలం జుంబిరి కొండ శిఖర ప్రాంతానికి వెళ్తున్న మహిళా ఉపాధ్యాయులు

గిరిజన గురుకులాల విద్యార్థులకు ప్రత్యేకంగా బోధన

విద్యార్థుల సామర్థ్యంపై స్వయంగా పర్యవేక్షణ

(పార్వతీపురం)

గిరిజన గురుకులాల్లో చదువుతున్న పిల్లలపై గురువులు ప్రత్యేకంగా దృష్టిపెట్టారు. ఆన్‌లైన్‌ బోధనను విద్యార్థులు వింటున్నారా? లేదా? ఇంటి వద్ద హోంవర్క్‌ చేస్తున్నారా? లేదా? ఏమైనా సందేహాలు ఉంటున్నాయా? అనేది స్వయంగా వెళ్లి పరిశీలిస్తున్నారు. విద్యార్థుల సామర్థ్యం గురించి తల్లిదండ్రులను అడిగి తెలుసుకుంటున్నారు. గురుకులాల చీఫ్‌ సెక్రటరీ శ్రీకాంత్‌ ప్రభాకర్‌ ఆదేశంతో గిరిజన గురుకులాల విద్యార్థుల పట్ల ఉపాధ్యాయులు మరింత చొరవ చూపుతున్నారు. గురుకుల పాఠశాలలు, కళాశాలల్లో  చదువుతున్న విద్యార్థులను ఉపాధ్యాయులు, అఽధ్యాపకులు దత్తత  తీసుకున్నారు. జిల్లాలో 3,483 మంది విద్యార్థులు గురుకులాల్లో చదువుతున్నారు. ఇప్పటికే దాదాపు విద్యార్థులందరికీ ఫోన్‌ చేయడం.. అవకాశం ఉన్న విద్యార్థుల ఇళ్లకు వెళ్లడం చేస్తున్నారు. 183 మంది ఉపాధ్యాయులు, అధ్యాపకులకు ఈ బాధ్యతలను ప్రభుత్వం అప్పగించింది. వారు విద్యార్థుల వద్దకు వెళ్తున్నదీ? లేనిదీ తెలుసుకోవడానికి నిఘా పెట్టింది. ఉపాధ్యాయులు ఇంటింటికీ వెళ్లి విద్యార్థుల విద్యా బోధన, విద్యా ప్రమాణాలను పర్యవేక్షించి వారితో ఫొటోలు తీసుకుని ప్రిన్సిపాళ్లకు పంపాలి. 

విద్యార్థులు నష్టపోకూడదనే..

గురుకులాల రాష్ట్ర కార్యదర్శి శ్రీకాంత్‌ ప్రభాకర్‌ ఆదేశాలతో ఈ పద్ధతిని ప్రారంభించాం. కరోనా నేపథ్యంలో గురుకుల విద్యా సంస్థలు ప్రస్తుతం మూసి ఉన్నాయి. విద్యార్థులు నష్టపోకూడదనే ఉద్దేశంతో దత్తత తీసుకున్న గ్రామాలకు ఉపాధ్యాయులు, అధ్యాపకులు వెళ్తున్నారు. పిల్లల విద్యా ప్రమాణాలను పరిశీలిస్తున్నారు. 

- మిరియాల రాధాకృష్ణ, జిల్లా గిరిజన గురుకులాల కన్వీనర్‌, ప్రిన్సిపాల్‌


Updated Date - 2021-08-02T05:03:58+05:30 IST