Mann Ki Baat: వరంగల్ జిల్లా వాసుల చొరవను మెచ్చుకున్న ప్రధాని

ABN , First Publish Date - 2022-08-29T00:48:20+05:30 IST

న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆకాశవాణి ద్వారా తన మనసులోని భావాలను పంచుకునే మన్ కీబాత్ కార్యక్రమంలో వరంగల్ జిల్లా వాసుల చొరవను మెచ్చుకున్నారు.

Mann Ki Baat: వరంగల్ జిల్లా వాసుల చొరవను మెచ్చుకున్న ప్రధాని

న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆకాశవాణి ద్వారా తన మనసులోని భావాలను పంచుకునే మన్ కీ బాత్ కార్యక్రమంలో వరంగల్ జిల్లా వాసుల చొరవను మెచ్చుకున్నారు. వరంగల్ జిల్లాలో జరిగిన ఒక గొప్ప ప్రయత్నం గురించి తెలుసుకున్నానంటూ ప్రధాని ప్రత్యేకంగా ప్రస్తావించారు. వరంగల్ జిల్లాలో  'మంగ్త్యా-వాల్యా తాండా' పేరుతో ఏర్పడిన కొత్త గ్రామ పంచాయితీలో ఇటీవల జరిగిన మార్పును ప్రధాని వెల్లడించారు. అటవీ ప్రాంతానికి సమీపంలో ఉన్న ఈ పంచాయితీ నీరు నిల్వ చేసుకునేందుకు అనుకూలంగా ఉండటంతో గ్రామస్తులు అమృత్ సరోవర్ అభియాన్ కింద చెరువును అభివృద్ధి చేశారని ప్రధాని ప్రశంసించారు. ఇటీవల కురిసిన వర్షాల కారణంగా ఈ చెరువు నీటితో నిండిపోయిందని ప్రధాని సంతోషం వ్యక్తం చేశారు. 


కొంతకాలం క్రితం 'మన్ కీ బాత్'లో అమృత్ సరోవర్ గురించి చెప్పగానే వివిధ జిల్లాల్లో స్థానిక పరిపాలన జత గూడిందని ప్రధాని చెప్పారు. స్వచ్చంద సంస్థలు తోడయ్యాయని, స్థానిక ప్రజలు భాగస్వాములవగా చూస్తుండానే అమృత్ సరోవర్ నిర్మాణం ప్రజా ఉద్యమంగా మారిందన్నారు. వరంగల్ జిల్లా  'మంగ్త్యా-వాల్యా తాండా' ఆదర్శంగా నిలుస్తుందన్నారు. దేశం కోసం ఏదైనా చేయాలనే భావన ఉన్నప్పుడు, తన కర్తవ్యాన్ని గుర్తించినప్పుడు, రాబోయే తరాల పట్ల ఆలోచన ఉన్నప్పుడు సామర్థ్యం కూడా తోడవుతుందని, సంకల్పం ఉదాత్తమవుతుందని ప్రధాని చెప్పారు. నీటి గురించి, నీటి సంరక్షణ ప్రాముఖ్యత గురించి వేల సంవత్సరాల క్రితమే మన సంస్కృతిలో పేర్కొన్నారని, దేశం ఈ జ్ఞానాన్ని తన శక్తిగా స్వీకరించినప్పుడు దేశ సామర్థ్యం అనేక రెట్లు పెరుగుతుందని ప్రధాని చెప్పారు.  



Updated Date - 2022-08-29T00:48:20+05:30 IST