స్వర్ణయుగం దిశగా..

ABN , First Publish Date - 2022-08-14T08:54:35+05:30 IST

భారత క్రీడారంగం స్వర్ణయుగం ముంగిట నిలిచిందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఇటీవలి కామన్వెల్త్‌ గేమ్స్‌లో పాల్గొన్న భారత బృందాన్ని శనివారం ఆయన..

స్వర్ణయుగం దిశగా..

న్యూఢిల్లీ: భారత క్రీడారంగం స్వర్ణయుగం ముంగిట నిలిచిందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఇటీవలి కామన్వెల్త్‌ గేమ్స్‌లో పాల్గొన్న భారత బృందాన్ని శనివారం ఆయన తన నివాసంలో సన్మానించారు. బర్మింగ్‌హామ్‌లో 22 స్వర్ణ, 16 రజత, 23 కాంస్యాలతో భారత్‌ మొత్తం 61 పతకాలు కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. ‘ఈ క్రీడల్లో మీరు చూపిన ప్రతిభను కేవలం పతకాల సంఖ్యతో అంచనా వేయలేం. మన క్రీడాకారులు హోరాహోరీగా పోరాడారు. విజేతలకు, పరాజితులకు ఒక సెకను, లేదా ఒక సెంటీమీటరు తేడా ఉండొచ్చు. భవిష్యత్‌లో ఆ తేడాను అధిగమించి పతకాలు సాధిస్తారన్న నమ్మకం ఉంది’ అని ప్రధాని పేర్కొన్నారు.


‘ ఇది ఆరంభం మాత్రమే. ఈ విజయాలతో మనం సంతృప్తి చెందకూడదు. స్వర్ణ యుగం దిశగా దేశ క్రీడా రంగం సాగుతోంది’ అని మోదీ అభిప్రాయపడ్డారు. ‘అందరినీ కలుపుకొనిపోయే, వైవిధ్యమైన, శక్తివంతమైన క్రీడా విధానంతో ప్రపంచానికి ఆదర్శంగా నిలవాల్సిన బాధ్యత మనపై ఉంది. ప్రతిభ కలిగిన క్రీడాకారులు మన ఆస్తి. వారిని ఎట్టి పరిస్థితుల్లో వదిలేయకూడదు’ అని పిలుపునిచ్చారు. ‘మనం బలంగా ఉన్న క్రీడలను మరింతగా బలోపేతం చేయడమేకాదు..కొత్త క్రీడాంశాల్లో కూడా మన ముద్ర వేశాం. హాకీలో పునర్‌వైభవానికి ప్రయత్నిస్తున్నాం’ అని మోదీ గుర్తు చేశారు. ‘గత కామన్వెల్త్‌ క్రీడలతో పోల్చితే నాలుగు కొత్త విభాగాల్లో మనం పతకాలు గెలిచాం. నూతన క్రీడాంశాల్లో మనం మరింతగా మెరుగుపడాలి’ అని ఆకాంక్షించారు. ఇక కామన్వెల్త్‌లో తొలిసారి ప్రవేశపెట్టిన టీ20 క్రికెట్‌లో మహిళలు రజత పతకంతో సత్తా చాటారు. ‘హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ కెప్టెన్సీలో జట్టు అద్భుతంగా రాణిస్తోంది. క్రికెటర్లందరూ బాగా ఆడారు’ అని మోదీ కొనియాడారు. 75వ స్వాతంత్య్ర దినోత్సవ శుభ తరుణంలో ఈ విజయాలు దక్కడం ముదావహమని ఆయన అన్నారు. కామన్వెల్త్‌ క్రీడల్లో పాల్గొన్న దాదాపు అందరు అథ్లెట్లు కార్యక్రమానికి హాజరయ్యారు. చెన్నైలో నిర్వహించిన చెస్‌ ఒలింపియాడ్‌లో పతకాలు నెగ్గిన చెస్‌ క్రీడాకారులను కూడా మోదీ ఈ సందర్భంగా అభినందించారు. 


ఐఓఏ నగదు అవార్డులు:

సాయంత్రం జరిగిన కార్యక్రమంలో పతక విజేతలను సన్మానించిన భారత ఒలింపిక్‌ సంఘం (ఐఓఏ) వారికి నగదు అవార్డులు అందజేసింది. స్వర్ణం నెగ్గిన వారికి రూ. 20 లక్షలు, రజతానికి రూ. 10 లక్షలు, కాంస్యం అందుకున్న వారికి రూ. 7.5 లక్షలు ప్రదానం చేసింది. 

Updated Date - 2022-08-14T08:54:35+05:30 IST