నేడు Chennai నగరానికి ప్రధాని మోదీ

ABN , First Publish Date - 2022-05-26T13:19:10+05:30 IST

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురువారం నగరానికి రానున్నారు. నెహ్రూ ఇండోర్‌ స్టేడియంలో ఏర్పాటు చేసిన సభా ప్రాంగణం నుంచి రూ. 2900 కోట్లతో పూర్తయిన రాష్ట్రానికి

నేడు Chennai నగరానికి ప్రధాని మోదీ

- రూ.2900 కోట్ల ప్రాజెక్టులు జాతికి అంకితం

- రూ.28,500 కోట్ల ప్రాజెక్టులకు శంకుస్థాపన

- 1,152 గృహాల ప్రారంభోత్సవం


చెన్నై: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురువారం నగరానికి రానున్నారు. నెహ్రూ ఇండోర్‌ స్టేడియంలో ఏర్పాటు చేసిన సభా ప్రాంగణం నుంచి రూ. 2900 కోట్లతో పూర్తయిన రాష్ట్రానికి చెందిన ఐదు ప్రాజెక్టులను జాతికి అంకితం చేయనున్నారు. అంతేగాక ఇప్పటికే పూర్తయిన 1,152 గృహాలను మోదీ ప్రారంభించనున్నారు. అదే సమయంలో రూ.28,500 కోట్లతో చేపట్టనున్న ఆరు ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయనున్నారు. ఈ కార్యక్రమంలో ప్రధానితో పాటు రాష్ట్ర గవర్నర్‌ ఆర్‌ఎన్‌ రవి, ముఖ్యమంత్రి స్టాలిన్‌, కేంద్రమంత్రులు అశ్వనీ వైష్ణవ్‌, నితిన్‌ గడ్కరీ ఎల్‌.మురుగన్‌ తదితరులు హాజరుకానున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఆయన హైదరాబాద్‌ నుంచి విమానంలో బయలుదేరి సాయంత్రం 5.10 గంటలకు చెన్నై చేరుకుంటారు. విమానాశ్రయంలో గవర్నర్‌ ఆర్‌ఎన్‌ రవి, ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌, మంత్రులు ఘనస్వాగతం పలకనున్నారు. తర్వాత ప్రధాని పాత విమానాశ్రయం హెలిపాడ్‌ నుంచి హెలికాప్టర్‌లో బయలుదేరి మెరీనాబీచ్‌ నేపియర్‌ వంతెన ప్రాంతానికి చేరువగా ఉన్న ఐఎన్‌ఎస్‌ అడయార్‌ హెలిపాడ్‌కు చేరుకుంటారు. అక్కడి నుండి ఆయన కారులో నెహ్రూ ఇండోర్‌ స్టేడియానికి వెళతారు. ప్రధాని మోదీ కారులో వెళ్లే దారి పొడవునా 25 చోట్ల రాష్ట్ర బీజేపీ ఆధ్వర్యంలో ఆయనకు స్వాగతం పలుకనున్నారు. దీనికోసం చెన్నై, తిరువళ్లూరు, చెంగల్పట్టు, కాంచీపురం, వేలూరు, తిరువణ్ణామలై సహా 11 జిల్లాల నుండి సుమారు 50 వేల మంది కార్యకర్తలు తరలిరానున్నారని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై తెలిపారు. బీజేపీ వ్యవసాయ, మహిళా, న్యాయవాదుల, చేనేత, యువజన విభాగాలన్నీ కలిసి మోదీకి 25 చోట్ల పార్టీ జెండాలతో ఘనస్వాగతం పలుకనున్నాయి. నెహ్రూ ఇండోర్‌స్టేడియంలో ప్రధాని మోదీ పాల్గొనే సభా వేదిక వద్ద భారీ ఏర్పాట్లు చేపడుతున్నారు. ఈ సభకు డీఎంకే తరఫున రెండు వేలమంది, బీజేపీ తరఫున రెండు వేలమంది కార్యకర్తలు హాజరవు తున్నట్లు సమాచారం. వీరితోపాటు కేంద్రమంత్రులు, రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, పారిశ్రామిక వేత్తలు సహా సుమారు 400 మంది వీఐపీలు హాజరుకానున్నారు. బుధవారం సాయంత్రం ఢిల్లీ నుండి వచ్చిన భద్రతా విభాగం అధికారులు, రాష్ట్ర పోలీసు ఉన్నతాధికారులు నెహ్రూ ఇండోర్‌ స్టేడియంలో తనిఖీలు చేపట్టారు.స్టేడియంలో ప్రజల కోసం, వీఐపీల కోసం, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీల కోసం ఏర్పాటు చేసిన ప్రవేశ ద్వారాల వద్ద చేపడుతున్న భద్రతా ఏర్పాట్లను కూడా పరిశీలించారు.


స్టాలిన్‌, ఈపీఎస్‌ భేటీ..

చెన్నై విమానాశ్రయంలో ప్రధాని మోదీకి ప్రధాన ప్రతిపక్షం అన్నాడీఎంకే నేత, మాజీ ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి కూడా స్వాగతం పలుక నున్నారు. ఆ సందర్భంగా సీఎం స్టాలిన్‌, ప్రతిపక్షనేత ఎడప్పాడి పళని స్వామి ప్రధాని మోదీతో వేర్వేరుగా సమావేశం కానున్నారు. ఇక నెహ్రూ ఇండోర్‌ స్టేడియంలో సభ అనంతరం ప్రధానిని బీజేపీ తరఫున పదిమంది ప్రముఖులు కలుసుకోనున్నారు. ఆ పార్టీ శాసనసభ్యులు వానతి శ్రీనివాసన్‌, నయినార్‌ నాగేంద్రన్‌, ఎంఆర్‌ గాంధీ, డాక్టర్‌ సి. సరస్వతి, పార్టీ ప్రముఖులు మోదీతో భేటీ అవుతారు. ఆ తర్వాత మోదీ కారులో బయలుదేరి ఐఎన్‌ఎస్‌ అడయార్‌ హెలీపాడ్‌కు చేరుకుని అక్కడి నుంచి హెలికాప్టర్‌లో పాత విమానాశ్రయంలో దిగి అక్కడి నుంచి విమానంలో ఢిల్లీకి బయలు దేరుతారు.

Updated Date - 2022-05-26T13:19:10+05:30 IST