ప్రధాని సమీక్ష

ABN , First Publish Date - 2020-09-24T06:44:17+05:30 IST

పార్లమెంటు సమావేశాలు ముగిసిన వెంటనే ప్రధానమంత్రి నరేంద్రమోదీ దేశంలో కొవిడ్‌–19 పరిస్థితిపై దృష్టి పెట్టారు. కరోనా వైరస్‌, లాక్‌డౌన్‌, వాటి పర్యవసానాలపై,...

ప్రధాని సమీక్ష

పార్లమెంటు సమావేశాలు ముగిసిన వెంటనే ప్రధానమంత్రి నరేంద్రమోదీ దేశంలో కొవిడ్‌–19 పరిస్థితిపై దృష్టి పెట్టారు. కరోనా వైరస్‌, లాక్‌డౌన్‌, వాటి పర్యవసానాలపై, దేశంలోని ప్రాథమిక ఆరోగ్య, వైద్య సదుపాయాల గురించి చట్టసభలలో కూడా వివరంగా చర్చించి ఉంటే బాగుండేది. సుదీర్ఘకాలంగా ప్రజారోగ్యరంగానికి తగినంత ప్రాధాన్యం ఇవ్వకపోవడం వల్ల, ఇప్పుడు పెను ఉపద్రవం ఎదురయినప్పుడు, తగినంత సామర్థ్యంతో స్పందించలేకపోయాము. ఎన్ని వైఫల్యాలు ఉన్నప్పటికీ, ఉన్న వనరులతోనే, అంకిత భావం, త్యాగశీలత కలిగిన వైద్య ఆరోగ్య సిబ్బంది సహాయంతో ఉపద్రవాన్ని సాధ్యమైనంత కట్టడి చేయగలిగాము. కరోనా ప్రమాదసూచిక ఎగిరి, ఆరునెలలు గడచిన తరువాత పరిస్థితిని ఇప్పుడు సమీక్షిస్తే, దేశంలో మరణాలు లక్ష సంఖ్యకు చేరువలో ఉన్నాయి. రోజుకు సుమారు వెయ్యి మందికి పైగా చనిపోతున్నారు. ప్రతి రోజూ 90వేల కొత్త కేసులు వస్తున్నాయి. అయినా సరే, మనం పెనుప్రమాద దశను దాటినట్టేనని ప్రభుత్వాలు సూచనలు చేస్తున్నాయి. 7 రాష్ట్రాలలోని 60 జిల్లాల్లో మాత్రమే పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నదని, తక్కినచోట్ల పెద్దగా ఆందోళన చెందవలసింది లేదని ప్రధానమంత్రి బుధవారం నాడు ముఖ్యమంత్రులతో నిర్వహించిన వీడియో సమావేశంలో అభిప్రాయపడ్డారు. 


కొవిడ్‌–19 సమీక్షా సమావేశం జరిగిన రోజే, కేంద్ర రైల్వే శాఖ సహాయమంత్రి సురేశ్‌ అంగడి కరోనా బారిన పడి కన్నుమూశారు. అనేక మంది కేంద్రమంత్రులకు వైరస్‌ సోకింది కానీ, మరణం అన్నది కరోనా పరిస్థితిలోని తీవ్రతను తెలియజేస్తుంది. మరణాల సంఖ్య 2 శాతానికి లోపుగానే ఉన్నప్పటికీ, సోకినవారిని, వారి కుటుంబ సభ్యులను, వారి చుట్టూ ఉన్నవారినీ కూడా భయభ్రాంతులకు లోనుచేస్తున్నదీ వ్యాధి. భారతదేశంలో పట్టణాలలో కొవిడ్‌ గణాంకాలే లోపభూయిష్ఠమని భావిస్తుండగా, గ్రామీణ ప్రాంతాలలో విస్తరించిన సమయంలో అన్ని లెక్కలూ సరిగ్గా ఉంటాయని ఆశించలేము. ఏది ఏమయినా, ఉపద్రవం తీవ్రతను దాచిపెట్టలేము. లేని భయాలను రేకెత్తించలేము కూడా.


వైపరీత్యాల నిధుల నుంచి కరోనా అవసరాల కోసం ఇప్పటి దాకా అనుమతించిన 35 శాతం వ్యయాన్ని, 50 శాతానికి పెంచుతున్నట్టు ప్రధానమంత్రి ప్రకటించారు. రాష్ట్రాలకు ఇది ఎంతో ఉపకరించే నిర్ణయం. కరోనా ఉత్పాతంలో రాష్ట్రాల పరిస్థితి దయనీయంగా ఉన్నది. పరిస్థితిని తామే ఎదుర్కొనాలి. అందుకు కావలసిన సహాయాలు అందడంలేదు. ఇవ్వవలసి ఉన్న పన్ను పరిహారాల కోసం కూడా కేంద్రం అనేక కొర్రీలు పెడుతున్నది. ఆదాయం తగ్గిపోయి, ఆరోగ్య రంగానికి అధిక వ్యయం చేయవలసి వస్తున్న సమయంలో ఏ కొద్దిపాటి వెసులుబాటు అయినా ఊరటను ఇస్తుంది. 


ప్రధానమంత్రి చెప్పిన ఏడు రాష్ట్రాలలో తెలంగాణ లేదు కానీ, ఆంధ్రప్రదేశ్‌ రెండోస్థానంలో ప్రముఖంగా ఉన్నది. మహారాష్ట్ర తరువాత స్థానం ఆంధ్రప్రదేశ్‌దే. పరీక్షలు నిర్వహించడం, వ్యాధి సోకే అవకాశం ఉన్నవారిని గుర్తించడం, చికిత్స చేయడం– ఈ మూడు అంశాలను ప్రధాని తన సందేశంలో ప్రధానంగా గుర్తు చేశారు. అధిక పరీక్షలు నిర్వహించడంలో తెలంగాణ ప్రభుత్వం మొదటలో ఏమంత చొరవ చూపలేదు కానీ, ఆంధ్రప్రదేశ్‌ క్రియాశీలంగానే ఉన్నదన్న పేరు తెచ్చుకున్నది. చిన్నచిన్న పట్టణాలు అనేకం ఉన్న రాష్ట్రంలో వైరస్‌ చాలా విస్తృతంగా వ్యాపించింది. వైద్యసదుపాయాలు కొన్ని ప్రాంతాలకే పరిమితం కావడంతో, మరణాల సంఖ్య పెరుగుతూ వచ్చింది. ఇప్పుడు కూడా ఆ రాష్ట్రంలో రోజుకు సుమారు 50 మంది మరణిస్తున్నారు. 


ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం తక్షణం తన ప్రాధాన్యాలను రాజకీయాలనుంచి ఆరోగ్యరంగం మీదకు మళ్లించాలి. మొదట్లో ఒకటి రెండు సార్లు తప్ప, ముఖ్యమంత్రి కరోనా పరిస్థితిని ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తున్నట్టు కనిపించలేదు. అధికారయంత్రాంగం మాత్రమే వారికి తోచిన తీరులో నిర్వహిస్తూ వస్తున్నారు. రోజుకు ఇన్ని మరణాలు కొనసాగడమన్నది ప్రత్యేకంగా పట్టించుకోవలసిన అంశం. ప్రైవేటు ఆస్పత్రులను నియంత్రించడానికి, రోగులకు నాణ్యమైన చికిత్స అందించడానికి జరిగిన ప్రయత్నాలు అరకొరగానే కొనసాగుతున్నాయి. దేశంలోనే రెండోస్థానంలో ఉండడం ఏమంత గౌరవప్రదం కాదు. 


తాము గుర్తించిన 60 జిల్లాల మీదనే ప్రధానంగా దృష్టి కేంద్రీకరించినప్పటికీ, తక్కిన ప్రాంతాల విషయంలో అలక్ష్యం పనికిరాదు. రెండో విడత, మూడో విడత వైరస్‌ వ్యాప్తి జరుగుతున్న దేశాలు ఉన్నాయి. ఒకరోజులో సోకినవారి సంఖ్య కంటే, కోలుకున్న వారి సంఖ్య అధికంగా ఉంటున్నదని, సంతోషదాయకమని ప్రభుత్వం అంటున్నది. మేలుకు సంతోషించవలసిందే కానీ, కీడును ఊహించకుండా ఉండకూడదు. ప్రభుత్వాలు శాయశక్తులా కృషి చేసినమాట నిజమే కానీ, ఏదో సృజనాత్మకమైన పద్ధతులతో, ఒక ఉద్యమస్థాయిలో కరోనాపై పోరాడామని మన దేశం గురించి చెప్పలేము. దానంతట అదే క్షీణదశకు చేరుకుంటున్నట్టయితే అది ఆనందించదగ్గదే. కానీ, దేశంలో మొత్తంగా వ్యాధి సోకినవారి సంఖ్య ఇంకా 60 లక్షల దరిదాపే ఉన్నది. ఆదమరచి ఉండడం మంచిది కాదు. 


సమస్త జీవనరంగాలను పూర్వస్థాయికి తీసుకురావడం గురించి ఇక పూర్తిస్థాయిలో ఆలోచించాలి. అదే సమయంలో కొవిడ్‌ నియమావళి జీవనసరళిలో భాగం కావాలి. అందుకు సమాచార వినిమయం ఎంతో ముఖ్యమైనదని, దానిని విస్మరించరాదని ప్రధాని అన్నారు. ప్రజలకు విశ్వాసం కల్గించడానికి, ఆరోగ్యంపై అవగాహన పెంచడానికి సమాచారమే కీలకం. పారదర్శకతతో కూడిన, వాస్తవమైన సమాచారం కావాలి.

Updated Date - 2020-09-24T06:44:17+05:30 IST