ప్రధాన మంత్రుల మ్యూజియం పాత, కొత్తల మేలు కలయిక

ABN , First Publish Date - 2022-04-09T20:43:02+05:30 IST

రాజధాని నగరంలోని తీన్ మూర్తి భవన్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన

ప్రధాన మంత్రుల మ్యూజియం పాత, కొత్తల మేలు కలయిక

న్యూఢిల్లీ : దేశ రాజధాని నగరంలోని తీన్ మూర్తి భవన్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ప్రధాన మంత్రుల సంగ్రహాలయాన్ని ఈ నెల 14న ప్రారంభిస్తారు. దీనిని రూ.271 కోట్లతో నిర్మించారు. దీనిలో మన దేశ మాజీ ప్రధాన మంత్రులకు సంబంధించిన అరుదైన ఫొటోలు, ప్రసంగాలు, వీడియోలు, వార్తా పత్రికల కథనాలు, రాత ప్రతులు వంటివాటిని ప్రదర్శనకు ఉంచుతారు. 


నెహ్రూ స్మారక సంగ్రహాలయం, గ్రంథాలయం పక్కనగల 10,491 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఈ సంగ్రహాలయాన్ని నిర్మించారు. 2018లో దీని నిర్మాణానికి ఆమోదం లభించింది. 14 మంది మాజీ ప్రధాన మంత్రులకు వేర్వేరు గ్యాలరీలను దీనిలో కేటాయించారు. వారు పీఎం పదవిలో ఉన్న కాలానికి అనుగుణంగా ఈ గ్యాలరీలను కేటాయించారు. 


సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ సీనియర్ సలహాదారు కాంచన్ గుప్తా ఇచ్చిన ట్వీట్లలో, ప్రధాన మంత్రి సంగ్రహాలయాన్ని ఈ నెల 14న ప్రారంభించనున్నట్లు తెలిపారు. మన దేశ ప్రధాన మంత్రుల గురించి ఈ మ్యూజియం అవగాహన కల్పిస్తుందన్నారు. ప్రధాన మంత్రులందరి  కృషిని వారి సైద్ధాంతిక భావజాలాలతో సంబంధం లేకుండా ఈ సంగ్రహాలయంలో వివరిస్తున్నట్లు చెప్పారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ దార్శనికతకు అనుగుణంగా దీనిని తీర్చిదిద్దినట్లు తెలిపారు. 


ఈ సంగ్రహాలయాన్ని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో సమ్మిళిత కృషితో నిర్మించినట్లు తెలిపారు. మన ప్రధాన మంత్రులందరి నాయకత్వం, దార్శనికత, విజయాల గురించి భారత దేశ యువ తరానికి తెలియజేయడం, ప్రేరేపించడం దీని లక్ష్యమని చెప్పారు. 


ఎదుగుతున్న భారత దేశం స్ఫూర్తితో ఈ సంగ్రహాలయాన్ని డిజైన్ చేశారు. నేతలు తీర్చిదిద్దిన భారత దేశం గురించి వివరించారు. ఈ భవనం లోగోలో భారతీయులు తమ చేతులతో చక్రాన్ని ఎత్తి పట్టుకున్నట్లు కనిపిస్తుంది. ఇది దేశం, ప్రజాస్వామ్యాలకు చిహ్నం. మాజీ ప్రధాన మంత్రుల కుటుంబ సభ్యులను కూడా సంప్రదించి, విలువైన సమాచారాన్ని సేకరించారు. చాలా సందర్భాల్లో శాశ్వత లైసెన్సుపై ఆ సమాచారాన్ని సేకరించి, దీనిలో ఉంచుతున్నారు. 


ఈ భవన నిర్మాణానికి చెట్లను నరకడం కానీ, చెట్లను ఒక చోటు నుంచి మరొక చోటుకు తరలించడం కానీ జరగలేదని అధికార వర్గాలు తెలిపాయి. తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూకు ప్రపంచం నలుమూలల నుంచి వచ్చిన బహుమతుల్లో ఇప్పటి వరకు ప్రదర్శించనివాటిని ఆధునికీకరించిన బ్లాక్-1లో ఉంచుతున్నారు. 


యువతను ఆకర్షించే విధంగా కటింగ్ ఎడ్జ్ టెక్నాలజీ ఆధారిత ఇంటర్‌ఫేసెస్‌ను ఏర్పాటు చేశారు. దూరదర్శన్, ఫిలిం డివిజన్, సంసద్ టీవీ, రక్షణ మంత్రిత్వ శాఖ వంటి వ్యవస్థల నుంచి సమాచారాన్ని సేకరించి, దీనిలో ఉంచారు. ఎటువంటి పక్షపాతం లేకుండా అందరు ప్రధాన మంత్రులు చేసిన సేవలకు గుర్తింపునివ్వాలనే లక్ష్యంతో దీనిని నిర్మించారు. ప్రధాన మంత్రిగా ఎంత కాలం పని చేశారనే అంశంతో సంబంధం లేకుండా ప్రతి మాజీ ప్రధాన మంత్రికి గుర్తింపు ఇవ్వాలని నిర్ణయించారు. 


Updated Date - 2022-04-09T20:43:02+05:30 IST