ప్రధాని పర్యటన

ABN , First Publish Date - 2022-05-27T06:14:28+05:30 IST

భారత ప్రధాని నరేంద్రమోదీ గురువారం నాడు హైదరాబాద్‌లో జరిపిన పర్యటన సుమారు మూడు గంటలపాటే అయినా, అనేక విశేషాలకు కారణమైంది. ఉన్న కొద్ది సమయంలోనే కొంత రాజకీయ కార్యక్రమానికి, మరికొంత వ్యాపారరంగ నైపుణ్యరంగానికి...

ప్రధాని పర్యటన

భారత ప్రధాని నరేంద్రమోదీ గురువారం నాడు హైదరాబాద్‌లో జరిపిన పర్యటన సుమారు మూడు గంటలపాటే అయినా, అనేక విశేషాలకు కారణమైంది. ఉన్న కొద్ది సమయంలోనే కొంత రాజకీయ కార్యక్రమానికి, మరికొంత వ్యాపారరంగ నైపుణ్యరంగానికి కేటాయించి, రెండు బాధ్యతలను సమర్థంగా నిర్వహించారు. బేగంపేట విమానాశ్రయానికి తరలివచ్చిన బిజెపి నేతల, కార్యకర్తల శ్రేణిని ఉద్దేశించి చేసిన ప్రసంగంలో, రాష్ట్రప్రభుత్వం మీద, అధికారపార్టీ మీద తీవ్రమైన విమర్శలు చేశారు. రెండు దశాబ్దాల పండుగ జరుపుకుంటున్న ‘ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్’లో జరిగిన స్నాతకోత్సవ కార్యక్రమంలో సంస్థ సాధించిన విజయాలను, అక్కడ శిక్షితులైన నిపుణుల సామర్థ్యాలను ప్రశంసించి, మార్గనిర్దేశనం చేశారు.


జపాన్‌లో జరిగిన ‘క్వాడ్’ భేటీలో అంతర్జాతీయ రాజకీయ, భద్రత, వాణిజ్య చర్చలు జరిపి నేరుగా హైదరాబాద్ వచ్చిన ప్రధానికి మరొకసారి ప్రత్యేకమైన పరిస్థితి ఎదురయింది. తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు దాదాపుగా ప్రధాని పర్యటన సమయంలోనే పొరుగు రాష్ట్రానికి రాజకీయ కార్యం మీద వెళ్లారు. ఈ మధ్య ఢిల్లీకి వెళ్లినప్పుడే, గురువారం దాకా అక్కడే ఉండిపోతారన్న ఊహాగానాలు వచ్చాయి కానీ, వెనుకకు వచ్చి, ప్రధాని వచ్చే రోజున మరో పని పెట్టుకున్నారు. ఐఎస్‌బి కార్యక్రమంలో ముఖ్యమంత్రి ఎందుకు భాగం కాలేదో, వారు వద్దన్నారో, వీరు వద్దన్నారో తెలియదు. ప్రతిష్ఠాత్మకమైన  బిజినెస్ స్కూల్‌కు ఇరవయ్యేళ్లు నిండిన సందర్భంలో జరిగే వేడుకలో రాష్ట్ర ప్రాతినిధ్యం ఉండడం సముచితంగా ఉండేది. ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా ఉండగా, ఆయన ప్రత్యేకమైన చొరవ కారణంగా హైదరాబాద్‌లో ఐఎస్‌బి స్థాపన సాధ్యమైంది. దాని ప్రారంభోత్సవానికి అప్పటి ప్రధాని అటల్ బిహారీ వాజపేయి హాజరయ్యారు. ఇప్పుడు జరిగిన ద్విదశాబ్ది కార్యక్రమంలో సంస్థ స్థాపనలో కీలకపాత్ర వహించిన చంద్రబాబునాయుడు, ప్రస్తుతం ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రశేఖరరావు ఇద్దరూ పాల్గొని ఉంటే సముచితంగా ఉండేది.


తెలంగాణ ముఖ్యమంత్రికి, భారత ప్రధానికి మధ్య పరస్పరం ఎదురుపడకూడనంత పరిస్థితి నెలకొని ఉండడం వాంఛనీయం కాదు. ఇద్దరూ వేరువేరు రాజకీయాలకు చెందినప్పుడు, రాజకీయ పొరపొచ్చాలు వచ్చినప్పుడు కొంత ఇబ్బంది ఉండవచ్చును కానీ, అది వ్యక్తిగత స్థాయికి చేరకూడదు. వారి వారి అధికార స్థాయికి యోగ్యమైనది కాదు కాబట్టి, ఉభయులలో ఎవరైనా సరే దీనికి ముగింపు పలికి ఉండవలసింది. రాష్ట్ర గవర్నర్‌తో వ్యవహరించిన పద్ధతి అయినా, ప్రధానితో ఆడుతున్న దాగుడుమూతలైనా హుందాతనానికి దూరమైన ప్రవర్తన అని తెలంగాణ ముఖ్యమంత్రి గ్రహించాలి. రాజకీయంగా ఎంత నిక్కచ్చిగా అయినా ఉండవచ్చు. కానీ, అధికారిక కర్తవ్య నిర్వహణలో అది ప్రతిఫలించకూడదు. హైదరాబాద్ నుంచి చెన్నై వెళ్లి అనేక ప్రభుత్వ కార్యక్రమాలలో ప్రధాని పాల్గొన్నారు. విమానాశ్రయంలో స్వాగతం ఇవ్వకపోయినా, తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్, ఆ తరువాత జరిగిన సభలో ప్రధాని సమక్షంలోనే ద్రవిడ అభివృద్ధి విధానం గురించి, కేంద్రం రాష్ట్రానికి నిధులు ఇవ్వకపోవడం గురించి, నీట్ రద్దు డిమాండ్ గురించి మొహమాటం లేకుండా మాట్లాడారు.


ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ అయినా, అంతర్జాతీయ స్థాయిలో ప్రతిష్ఠ గడించిన సంస్థలో ఉదాత్తమైన విషయాలు మాట్లాడబోతూ, మార్గమధ్యంలో రాష్ట్రరాజకీయాలను, ముఖ్యమంత్రిపై విమర్శలను గుప్పించడం ప్రత్యేకమైన సందర్భమే. కుటుంబ పాలన సరే, ఎప్పుడూ చేస్తున్న విమర్శే. ముఖ్యమంత్రి మూఢనమ్మకాలు, అదీ మునుపు తప్పు పట్టిన విషయమే. తన ప్రసంగం వినడానికి ఉత్సాహంతో వచ్చిన భారతీయ జనతాపార్టీ శ్రేణులను రంజింపజేయగల రాజకీయ ఉపన్యాసం ఇవ్వడమే కాకుండా, వచ్చే ఎన్నికలలో మనదే విజయమనే ఆశ్వాసన కూడా ఇచ్చారు. కేంద్ర–రాష్ట్ర ప్రభుత్వాల మధ్య, బిజెపి–టిఆర్ఎస్ మధ్య మరింతగా కమ్ముకుంటున్న వైమనస్యాలను ప్రధాని బేగంపేట ప్రసంగం ప్రతిఫలించింది.


ఐఎస్‌బి విద్యార్థులలో స్ఫూర్తి నింపడానికి గ్లోబల్ నాయకత్వం గురించి, స్వావలంబన గురించి ప్రధాని మాట్లాడారు. ఐఎస్‌బి పట్టభద్రులు సాధించిన విజయాలు చిన్నవి కావు. ప్రపంచవ్యాప్తంగా వారు నిర్వహిస్తున్న వృత్తి బాధ్యతలు కూడా సామాన్యమైనవి కావు. కానీ, మొత్తంగా ఆర్థిక, పారిశ్రామిక, సేవా, సాంకేతిక రంగాలలో దేశపురోగతికి కీర్తిని పూర్తిగా తన ఖాతాలో వేసుకోవడం ఏమంత వినయశీలంగా కనిపించలేదు. ఆర్థికసంస్కరణలు ప్రారంభమై మూడు దశాబ్దాలు అయినప్పటికీ, అప్పట్లో రాజకీయ సంకల్పం బలంగా లేదని, 2014 నుంచి మాత్రమే తాము గట్టిగా అమలుచేస్తున్నామని నరేంద్రమోదీ చెప్పుకున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వాలు సరే కానీ, వాజపేయి ప్రభుత్వాన్ని కూడా రాజకీయ చిత్తశుద్ధి లేని కోవలోకి పరిగణించడం విచారకరం. ఇంటర్నెట్ వినియోగంలో, డేటా వాడకంలో, స్టార్టప్‌లకు సానుకూల వాతావరణం కల్పించడంలో అన్నిటా మన దేశం ముందున్నదని, జి–20 దేశాలలో మనం చాలా వేగంగా దూసుకుపోతున్నామని మోదీ చెప్పడం సంతోషపెట్టే విషయమే అయినప్పటికీ, మన దేశ స్థితిగతులను మదింపు వేయడానికి ఉన్న అనేక ఇతర కొలమానాలు ఏమంత గర్వకారణంగా లేవని కూడా గుర్తించవలసి ఉన్నది.

Updated Date - 2022-05-27T06:14:28+05:30 IST