వ్యవసాయరంగానికి ప్రాధాన్యత

ABN , First Publish Date - 2022-07-04T05:13:45+05:30 IST

జిల్లా వార్షిక రుణ ప్రణాళికను జిల్లా యంత్రాంగం ఖరారు చేసింది. 2022-23 సంవత్సరానికి గాను వార్షిక రుణ ప్రణాళిక లక్ష్యం రూ.4,700 కోట్లుగా ప్రకటించారు. ఇందులో వ్యవసాయ రంగానికే పెద్దపీట వేశారు. పంట రుణాలు, వ్యవసాయ అనుబంధ రంగాలకు కలిపి మొత్తం రూ.3,615 కోట్లు కేటాయించారు.

వ్యవసాయరంగానికి ప్రాధాన్యత

- వార్షిక రుణ లక్ష్యం రూ.4,700 కోట్లు

- వ్యవసాయరంగానికి రూ.3,615 కోట్లు

- పంట రుణాలకు రూ.2,000 కోట్లకు పైగా కేటాయింపు

- ఇతర రంగాలకు రూ.1,100 కోట్లు

- 2022-23 వార్షిక రుణ ప్రణాళిక ఖరారు

- మొదలైన పంట రుణాల పంపిణీ


కామారెడ్డి, జూలై 3(ఆంధ్రజ్యోతి): జిల్లా వార్షిక రుణ ప్రణాళికను జిల్లా యంత్రాంగం ఖరారు చేసింది. 2022-23 సంవత్సరానికి గాను వార్షిక రుణ ప్రణాళిక లక్ష్యం రూ.4,700 కోట్లుగా ప్రకటించారు. ఇందులో వ్యవసాయ రంగానికే పెద్దపీట వేశారు. పంట రుణాలు, వ్యవసాయ అనుబంధ రంగాలకు కలిపి మొత్తం రూ.3,615 కోట్లు కేటాయించారు. కేవలం పంట రుణాలకే రూ.2,000ల కోటకుపైగ్లా కేటాయించారు. దీంతో పాటు ఆయా బ్యాంకులకు సైతం పంట రుణాల లక్ష్యాలను నిర్ధేశించారు. ఈ ఏడాదైనా బ్యాంకర్లు రైతులకు ఎలాంటి ఇబ్బందులు పెట్టకుండా సకాలంలో రుణాలు ఇవ్వాలని జిల్లా అధికారులు సైతం ఆదేశించారు. ఇప్పటికే ఆయా బ్యాంకర్ల నుంచి రైతులు పంట రుణాల కోసం రెన్యువల్‌ చేయించుకుంటున్నారు. స్కేల్‌ ఆఫ్‌ ఫైనాన్స్‌ ప్రకారమే ఈ రుణాలు ఇవ్వనున్నారు.

ఖరారైన రుణ ప్రణాళిక

జిల్లాలో పంటలు సాగు చేసే రైతులకు బ్యాంకు రుణ పరిమితిని ఖారారు చేశారు. పంటల పెట్టుబడిని సమీక్షించిన జిల్లా అధికారులు సాంకేతిక బృందం అందుకు అనుగుణంగా పంటల వారీగా రుణాలందిచేందుకు ప్రతిపాదించారు. వానాకాలం, యాసంగి సీజన్‌లకు వేర్వేరుగా పంట రుణాలను నిర్ణయించారు. వానాకాలం రుణ పంపిణీ ఇప్పటికే మొదలైంది. ప్రధాన పంటలకు ఈ సారి రుణ పరిమితిని పెంచారు. పప్పు దినుసు పంటలైనా కంది, పెసర, మినముతో పాటు వరి, సోయాబీన్‌, మొక్కజొన్న, పత్తి, చెరుకు ఇతరేత్ర పంటలకు సంబంధించి గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది రుణ పరిమితిని పెంచుతూ జిల్లా సాంకేతిక కమిటీ సూచించింది. జిల్లా అధికారులు ప్రతిపాదించిన పంటల పరిమితిని రాష్ట్రస్థాయి అధికారులకు కూడా పంపించారు.

పంట రుణాల లక్ష్యం రూ.2000 కోట్లకుపైగా

జిల్లా అధికారులు 2022-23 వార్షిక రుణ ప్రణాళికను ఖరారు చేశారు. ఈ రుణ ప్రణాళికలో వ్యవసాయరంగానికి అధిక ప్రాధాన్యతను ఇస్తూ పంట రుణాలకే అత్యధిక నిధులను కేటాయించారు. వానాకాలం, యాసంగి పంట రుణాల లక్ష్యం రూ.2,616 కోట్లుకు పైగా కేటాయించారు. ఇందులో క్రాప్‌ లోన్‌లకు రూ.2,011 కోట్లు కేటాయించగా, వానాకాలంకు రూ.1,205 కోట్లు, యాసంగికి రూ.802 కోట్లు కేటాయించారు. టర్మ్‌లోన్స్‌ మొత్తం రూ.506 కోట్లు కేటాయించగా ఇందులో ఖరీఫ్‌కు రూ.303 కోట్లు, రబీకి రూ.203 కోట్లు ప్రకటించారు. వీటితో పాటు వ్యవసాయ అనుబంధానికి సంబంధించిన రుణాలకు రూ.126 కోట్లు కేటాయించారు. పంట రుణాలు బ్యాంకర్లు అందజేశారు.

ఇతర రంగాలకు రూ.1,100 కోట్ల కేటాయింపు

జిల్లా యంత్రాంగం ఖరారు చేసిన వార్షిక రుణ ప్రణాళికలు వ్యవసాయరంగంతో పాటు ఇతర రంగాలకు బ్యాంకు రుణాలను కేటాయించింది. వార్షిక రుణ ప్రణాళిక లక్ష్యం రూ.4,700 కోట్లు కాగా ఇందులో ప్రాధాన్యత రంగం కింద వ్యవసాయానికి రూ.3,615 కోట్లు కేటాయించారు. ఇతర రంగాలకు రూ.1,100 కోట్లకు పైగా కేటాయించారు. విద్య, హౌజింగ్‌, సోషల్‌ వెల్ఫేర్‌, ముద్ర లాంటి ఇతరేత్ర రంగాలకు రుణ లక్ష్యాన్ని సైతం ఖరారు చేశారు. రుణ లక్ష్యయంతో పాటు ఆయా బ్యాంకులకు లక్ష్యాలను నిర్ధేశించారు. చిన్న, సూక్ష్మ, మధ్య తరగతి పరిశ్రమలకు రూ.519 కోట్లు విద్యా రుణాలు రూ.36 కోట్లు, గృహ రుణాలు రూ.94కోట్లు, సంక్షేమ ఫథకాలు రూ.14కోట్లు, సౌర విద్యుత్‌కు రూ.2 కోట్లు ప్రాధాన్యత రంగాలకు రూ.400 కోట్లు, ఇతర రంగాలకు రూ.433 కోట్లు కేటాయించారు.

బ్యాంకులు స్పందిస్తే రైతులకు మేలే..

ప్రతీ యేడు జిల్లాల వారీగా వార్షిక రుణ ప్రణాళికలను ఖరారు చేసి ప్రభుత్వానికి నిర్ధేశిస్తుంటారు. జిల్లా యంత్రాంగం వ్యవసాయరంగానికి, ఇతర ప్రాధాన్యతరంగాలకు రుణాలు అందించేందుకు ప్రణాళికలను ఖరారు చేసి ఆయా బ్యాంకర్లకు లక్ష్యాలను నిర్ధేశిస్తూ వస్తోంది. కానీ ప్రతీయేడు బ్యాంకర్లు లక్ష్యాలను మాత్రం చేరుకోవడం లేదు. రుణాలు అందించడంలో బ్యాంకర్ల నుంచి స్పందన రాకపోవడంతో రుణాల కోసం వెళ్లిన బాధితులకు నిరాశే మిగులుతోంది. సవాలక్ష నియమ నింబధనలతో బ్యాంకర్లు రోజుల తరబడి తిప్పించుకుంటున్నారే తప్ప చేతికి రుణాలు ఇవ్వడం లేదనే వాదన బాధితుల నుంచి వినిపిస్తోంది. ప్రధానంగా పంట రుణాల కోసం రైతులు బ్యాంకులను ఆశ్రయిస్తుంటారు. రైతులకు రుణాలు ఇవ్వడంలో బ్యాంకర్లు స్పందించాలని ప్రభుత్వం ఆదేశిస్తున్నా బ్యాంకర్ల నుంచి మాత్రం స్పందన రావడం లేదు.  రైతుల పంట రుణాలే కాకుండా ముద్ర, హౌజింగ్‌, ఎడ్యుకేషన్‌ రుణాలను సైతం బ్యాంకర్లు లక్ష్యాలకు అనుగుణంగా ఇవ్వలేకపోతున్నారు. ఈ సంవత్సరం అయినా బ్యాంకర్లు, రైతులు రుణాల కోసం వచ్చే ఇతరవర్గాల ప్రజలకు సకాలంలో రుణాలు ఇస్తే వారి లక్ష్యాలను చేరుకునే అవకాశం ఉంటుందని అధికారవర్గాలు పేర్కొంటున్నారు. ఇప్పటికే పంట రుణాలను బ్యాంకర్లు అందజేస్తున్నందున రైతుల పట్ల కనికరించి వచ్చిన వారికి పంట రుణాలు ఇవ్వాలని రైతులు కోరుతున్నారు.

Updated Date - 2022-07-04T05:13:45+05:30 IST