గ్రామపంచాయతీలకు ప్రాధాన్యమివ్వాలి

ABN , First Publish Date - 2022-04-23T06:10:56+05:30 IST

గ్రామసచివాలయాలు గ్రామపంచాయతీలకు సమాంతర వ్యవస్థగా రూపాంతరం చెందడం బాధాకరం. గ్రామసభల్లో గానీ, గ్రామ లబ్ధిదారుల ఎంపికలో కానీ గ్రామపంచాయతీకి సరైన ప్రాధాన్యత లేకుండా పోతోంది. వాలంటీర్లు, వెల్ఫేర్‌ అసిస్టెంట్‌ ద్వారానే గ్రామంలో లబ్ధిదారుల ఎంపిక జరుగుతోంది....

గ్రామపంచాయతీలకు ప్రాధాన్యమివ్వాలి

గ్రామసచివాలయాలు గ్రామపంచాయతీలకు సమాంతర వ్యవస్థగా రూపాంతరం చెందడం బాధాకరం. గ్రామసభల్లో గానీ, గ్రామ లబ్ధిదారుల ఎంపికలో కానీ గ్రామపంచాయతీకి సరైన ప్రాధాన్యత లేకుండా పోతోంది. వాలంటీర్లు, వెల్ఫేర్‌ అసిస్టెంట్‌ ద్వారానే గ్రామంలో లబ్ధిదారుల ఎంపిక జరుగుతోంది. దీంతో వార్డ్ మెంబర్లు, సర్పంచ్‌కు ప్రాధాన్యత లేకుండా పోతోంది. జిల్లా, మండల పరిషత్‌ కార్యాలయం సర్వసభ్య సమావేశంలో అన్ని శాఖల అధికారులు పాల్గొని ప్రజాప్రతినిధులకు పలు సంక్షేమ పథకాల గురించి వివరించి, సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెబుతారు. మండల, జిల్లా పరిషత్‌ కార్యాలయ పరిధిలో ఎవరైనా అధికారి గైర్హాజర్‌ అయితే వారిని వివరణ కోరే అవకాశం ఉంది. కానీ గ్రామపంచాయతీ పరిధిలో వివిధ శాఖల సహకారం లేక అభివృద్ధి ప్రణాళిక సమర్థంగా అమలు కావడం లేదు.


గ్రామాభివృద్ధికి సంబంధించి చేపట్టే కార్యక్రమాల వివరాలు గ్రామపంచాయతీకి తెలియకుండా వ్యవహరించడం సరైన విధానం కాదు. మండల, జిల్లా పరిషత్‌ పరిధిలో అధికారులు సంయుక్త సమావేశం నిర్వహిస్తారు. అదే విధానం గ్రామ పంచాయతీలో జరగడానికి ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వాల్సిన అవసరం ఉంది. తద్వారా గ్రామపంచాయతీ పరిధిలో అన్ని శాఖల సమన్వయం గ్రామపంచాయతీకి అంది గ్రామీణ సంక్షేమం జరుగుతుంది.పంచాయతీలు కూడా బలోపేతమవుతాయి.ప్రజలకు కూడా గ్రామపంచాయతీల పాలనపై విశ్వాసం పెరుగుతుంది. సుమారుగా పంచాయతీ పరిధిలో రూ.2,300 కోట్లు, మండల పరిషత్‌ పరిధిలో రూ.1500 కోట్లు, జిల్లా పరిషత్‌ పరిధిలో రూ.750 కోట్లు నిధులు వినియోగం జరుగుతున్నందున కచ్చితంగా గ్రామ ప్రజలకు కావాల్సిన సేవల గురించి, వారి అవసరాలకు సంబంధించి పంచాయతీరాజ్‌ సంస్థల ప్రజాప్రతినిధుల అభిప్రాయం తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.


కాబట్టి గ్రామ సచివాలయాలు అన్ని గ్రామ పంచాయతీలకు జవాబుదారీతనం ఉండేవిధంగా, ప్రతి పంచాయతీలో కనీసం ఒక సచివాలయం ఉండేట్లుగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. అలాగే పంచాయతీరాజ్‌ సంస్థల సొంత నిధులపై ప్రభుత్వ నియంత్రణ ఎట్టి పరిస్థితిలోనూ కొనసాగకూడదు. అంతేకాకుండా పంచాయతీ నిధులు సక్రమంగా వినియోగమయ్యేలా సకాలంలో ఆడిట్‌ చేపట్టాలి. 73వ రాజ్యాంగ సవరణ ప్రకారం పంచాయతీరాజ్‌ సంస్థలకు 29 అంశాలకు సంబంధించి నిధులు, విధులు, సిబ్బంది బదలాయింపు మండల, జిల్లా పరిషత్‌ స్థాయిలో కూడా జరపాలి.


ఈ సందర్భంలో ప్రభుత్వం గ్రామ సచివాలయ పరిపాలన ముఖ్యంగా జిల్లా పరిషత్‌ ఆధీనంలోకి తేవాలి. తదుపరి జిల్లా ముఖ్య కార్యనిర్వహణ అధికారిగా ఐఏఎస్‌ అధికారిని నియమించాలి. అలాగే డివిజనల్‌ స్థాయి కార్యాలయాన్ని ఆర్డీవో స్థాయికి పెంచాలి. రెండుదశాబ్దాలకు పైబడి అపరిష్కృతంగా ఉన్న మండల పరిషత్‌ అభివృద్ధి అధికారుల సీనియారిటీని పరిష్కరించి 256 మందికి డిప్యూటీ సీఈఓ హోదా కల్పించి డివిజన్లు, జిల్లా స్థాయిలో నియామకం చేయడం ముదావహం.


దీనివల్ల పంచాయతీరాజ్‌ సంస్థల పనితీరు సూక్ష్మంగా సమీక్ష చేసే అవకాశం ఉంటుంది. అలాగే ఇప్పుడున్న పంచాయతీ కార్యదర్శి గ్రేడ్లను ఆరు నుంచి మూడుకు కుదించాలి. ఉద్యోగులకు పదోన్నతుల్లో మెరుగైన అవకాశాలు కల్పించాలి. పంచాయతీరాజ్‌ సంస్థలలో పది సంవత్సరాలు పైబడి పనిచేస్తున్న వారందరి సేవలు క్రమబద్ధీకరించాలి. నిధులు, విధులు, సిబ్బందిని జిల్లా, మండల, గ్రామ స్థాయిలో సంపూర్ణంగా బదలాయింపు చేసి మహాత్మాగాంధీ ఆకాంక్షించినట్లుగా గ్రామీణ భారతం ఉండేలా ప్రభుత్వం తగు చర్యలు తీసుకోవాలి.


టిఎంబి బుచ్చిరాజు

చైర్మన్‌, ఆంధ్రప్రదేశ్‌ పంచాయతీరాజ్‌ వెల్పేర్‌ ట్రస్ట్

(రేపు పంచాయతీరాజ్‌ దినోత్సవం)

Updated Date - 2022-04-23T06:10:56+05:30 IST