పార్టీ విధేయులకే ప్రాధాన్యం

ABN , First Publish Date - 2021-06-24T06:51:03+05:30 IST

కష్టకాలంలోనూ పార్టీని అంటిపెట్టుకుని ఉన్న నాయకులు, కార్యకర్తలకు ప్రాధాన్యమిచ్చే పరంపరను తెలుగుదేశం పార్టీ కొనసాగిస్తోంది.

పార్టీ విధేయులకే ప్రాధాన్యం
ఎరిక్షన్‌బాబు

వైపాలెం టీడీపీ ఇన్‌చార్జ్‌గా ఎరిక్షన్‌బాబు 

అభినందించిన పలువురు ప్రముఖులు 

వైపాలెం టీడీపీలో నూతనోత్తేజం 

పార్టీ ముఖ్యం, బాబు మాటే  వేదం: ఎరిక్షన్‌బాబు  

(ఆంధ్రజ్యోతి, ఒంగోలు) 

కష్టకాలంలోనూ పార్టీని అంటిపెట్టుకుని ఉన్న నాయకులు, కార్యకర్తలకు ప్రాధాన్యమిచ్చే పరంపరను తెలుగుదేశం పార్టీ కొనసాగిస్తోంది. తాజాగా ఎర్రగొండపాలెం నియోజకవర్గ ఇన్‌చార్జ్‌గా కనిగిరి నియోజకవర్గానికి చెందిన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి గూడూరి ఎరిక్షన్‌బాబుని నియమించటం అందుకు దర్పణం పడుతోంది. గత అసెంబ్లీ ఎన్నికల తర్వాత నుంచి వైపాలెంలో టీడీపీకి ఇన్‌చార్జి లేరు. ఎమ్మెల్యేగా ఉంటూ తిరిగి పార్టీలోకి వచ్చిన డేవిడ్‌రాజు కూడా ఎన్నికలకు ముందు మళ్లీ వైసీపీలో చేరారు. తిరిగి ఆయన టీడీపీలో చేరేందుకు సిద్ధమయ్యారు. ఇంకోవైపు వైపాలెం ఇన్‌చార్జ్‌ బాధ్యతల కోసం పార్టీతో సంబంధం లేని కొత్త వ్యక్తులు కూడా పోటీపడ్డారు. 


ఎరిక్షన్‌ని ఒప్పించిన బాబు  

ఈనేపథ్యంలో చంద్రబాబునాయుడు, లోకేష్‌లు ఈ విషయంపై ప్రత్యేక దృష్టిసారించారు. పార్టీ విధానానికి అనుగుణంగా అంకితభావంతో పనిచేసే ఎరిక్షన్‌బాబుకి ప్రాధాన్యమిచ్చి ఎంపిక చేశారు. విద్యార్థి జీవితం అనంతరం రాజకీయాల్లోకి వచ్చిన ఎరిక్షన్‌ ఆరంభం నుంచి ఇప్పటివరకు టీడీపీతోనే ఉన్నారు. పదవులు, అధికారానికి అతీతంగా స్థానిక ముఖ్య నాయకుల పార్టీ ఫిరాయింపులను పట్టించుకోకుండా పార్టీతో నడిచిన దళిత నేతగా గుర్తింపుపొందారు. వెలిగండ్ల మండలం మొగళ్లూరుకి చెందిన ఎరిక్షన్‌బాబు విద్యాభ్యాసం అనంతరం 1993 ప్రాంతంలో టీడీపీలో చేరారు. తొలిసారిగా 1995లో స్వగ్రామంలో అన్‌ రిజర్వ్‌డ్‌ ఎంపీటీసీ స్థానంలో పోటీచేసి గెలుపొంది టీడీపీ తరపున ఎంపీపీ అయ్యారు. 2002లో జడ్పీటీసీగా కూడా గెలుపొందారు. ఒక పర్యాయం సర్పంచ్‌గా కూడా పనిచేశారు. ఇదే సమయంలో పార్టీ కార్యక్రమాల్లో చురుకైన పాత్ర పోషించారు. జిల్లా కమిటీలో స్థానం పొందారు. అనంతరం రాష్ట్రస్థాయిలో పదవులు నిర్వర్తించారు. రాష్ట్ర విభజన అనంతరం టీడీపీ ప్రభుత్వం లిడ్‌క్యాప్‌ చైర్మన్‌గా నియమించింది. పార్టీ అధికారాన్ని కోల్పోయిన తర్వాత రాష్ట్ర అధికార ప్రతినిధిగా నియమితులయ్యారు. గత రెండు పర్యాయాలుగా ఎస్‌ఎన్‌పాడు టిక్కెట్‌ని ఆశించి విఫలం చెందిన ఎరిక్షన్‌ ప్రస్తుతం కూడా అటు వైపే మొగ్గుచూపారు. అయితే పార్టీ నాయకత్వం ముఖ్యంగా చంద్రబాబు, లోకేష్‌లు వ్యక్తిగతంగా ఇచ్చిన సూచనలతో వైపాలెం  ఇన్‌చార్జ్‌గా వెళ్లేందుకు సిద్ధమయ్యారు.


వైపాలెం నేతల్లో ఉత్సాహం

నియోజకవర్గంలోని టీడీపీ నేతల్లో గ్రూపు రాజకీయాలు అధికం. అయితే అందరికీ జడ్పీ మాజీ వైస్‌ ఛైర్మన్‌ మన్నె రవీంద్ర అంటే గౌరవం. ప్రస్తుతం వివాదరహిత నేతగా గుర్తింపుపొందిన ఎరిక్షన్‌బాబుని నియోజకవర్గ ఇన్‌చార్జ్‌గా నియమించటంతో స్థానిక అభిప్రాయాలను పక్కనబెట్టి పార్టీ నిర్ణయాన్ని నేతలంతా స్వాగతిస్తున్నారు. మండల, నియోజకవర్గ స్థాయి నాయకులంతా ఎరిక్షన్‌బాబుకి ఫోన్‌ చేసి స్వాగతించారు. డాక్టరు రవీంద్రతో పాటు మరికొందరు ముఖ్యులకు ఎరిక్షన్‌బాబు ఫోన్‌ చేసి ఆశీస్సులు తీసుకున్నారు. జిల్లాలోని పార్టీ ప్రముఖులంతా ఎరిక్షన్‌బాబుకి శుభాకాంక్షలు తెలిపారు. ఎమ్మెల్యేలు గొట్టిపాటి రవికుమార్‌, ఏలూరి సాంబశివరావు, స్వామితో పాటు మాజీ ఎమ్మెల్యేలు దామచర్ల జనార్దన్‌, డాక్టరు ముక్కు ఉగ్రనరసింహారెడ్డి, కందుల నారాయణ రెడ్డి, అశోక్‌రెడ్డి, విజయకుమార్‌లు ఎరిక్షన్‌కి శుభాకాంక్షలు తెలిపారు. 


నమ్మకాన్ని నిలబెడతా : ఎరిక్షన్‌బాబు 

‘పార్టీ నిర్ణయం, అధినేత చంద్రబాబు మాటే నాకు వేదం. పార్టీ ఏమి ఆదేశించినా, బాబు ఏ మాట చెప్పినా వాటిననుసరించి నిఖార్సైన కార్యకర్తగా పనిచేయటమే నాకు తెలుసు. వై.పాలెం ఇన్‌చార్జ్‌గా కూడా అలానే పనిచేసి వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా వచ్చే ఎన్నికల్లో పార్టీ గెలుపుకోసం ఇప్పటినుంచే కృషిచేస్తా’ అని ఎరిక్షన్‌బాబు అన్నారు. వైపాలెం ఇన్‌చార్జ్‌గా నియామకం అనంతరం ఆంధ్రజ్యోతి ప్రతినిధితో మాట్లాడుతూ తన పరిధిలో తాను కార్యకర్తలను కాపాడుకుంటూ పార్టీ కోసం పనిచేశా నన్నారు. ప్రస్తుతం అంతకన్నా అధికంగా పనిచేసి వై.పాలెం నియోజకవర్గంలో పార్టీకి పూర్వవైభవాన్ని తీసుకొస్తానని స్పష్టం చేశారు. నియోజకవర్గంలోనే ఉంటూ ఇటు పార్టీ నిర్మా ణం, అటు ప్రభుత్వ వైఫల్యాలకు వ్యతిరేకంగా ప్రజలను చైతన్యవంతం చేస్తానన్నారు. ప్రస్తుతానికి సోమవారం నుంచి శుక్రవారం వరకు అక్కడే ఉంటానని, శని ఆదివారా ల్లో పార్టీ ఇచ్చిన ఇతర బాధ్యతలను చూసుకుంటూ ముందుకు సాగుతానని చెప్పారు. 


Updated Date - 2021-06-24T06:51:03+05:30 IST