కడప సబ్‌కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టిన పృధ్వీతేజ

ABN , First Publish Date - 2020-08-09T11:27:35+05:30 IST

బ్రిటీష్‌ పాలనానంతరం మొదటిసారిగా కడప రెవెన్యూ డివిజనల్‌ కార్యాలయం సబ్‌ కలెక్టర్‌గా 2018 ఐఏఎస్‌ బ్యాచ్‌కు చెందిన పృధ్వీతేజ శనివారం బాధ్యతలు చేపట్టారు.

కడప సబ్‌కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టిన పృధ్వీతేజ

కడప సబ్‌కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టిన పృధ్వీతేజ

కడప (కలెక్టరేట్‌), ఆగస్టు 8 :  బ్రిటీష్‌ పాలనానంతరం మొదటిసారిగా కడప రెవెన్యూ డివిజనల్‌ కార్యాలయం సబ్‌ కలెక్టర్‌గా 2018 ఐఏఎస్‌ బ్యాచ్‌కు చెందిన పృధ్వీతేజ శనివారం  బాధ్యతలు చేపట్టారు.  బాధ్యతలను కడప ఆర్డీవో మలోల నుంచి స్వీకరించారు. ఈయన తూర్పుగోదావరి జిల్లా ద్వారకాతిరుమలకు చెందినవారు. సాధారణ కుటుంబం నుంచి ఐఏఎస్‌ స్థాయికి ఎదిగారు.


ఐఐటీలో టాపర్‌ అయిన పృధ్వీతేజ  సౌత్‌కొరియాలో శ్యాంసంగ్‌ సంస్థలో ఉన్నతమైన హోదాలో పనిచేసి 2018లో ఐఏఎస్‌కు సెలెక్ట్‌ అయ్యారు. అప్పట్లో ఆల్‌ ఇండియా 24వ ర్యాంకు సాధించారు. ఐఏఎస్‌ అధికారిగా చిత్తూరులో అసిస్టెంట్‌ కలెక్టర్‌ హోదాలో పనిచేస్తూ వివిధ శాఖల పట్ల మంచి తర్ఫీదు పొందారు. శ్రీకాళహస్తిలో కరోనా విజృంభిస్తున్న సమయంలో ఆయనను ప్రత్యేకాధికారిగా నియమించారు.


రాష్ట్ర ప్రభుత్వం గత రెండు రోజులు కిందట రాష్ట్రవ్యాప్తంగా 13 మంది ఐఏఎస్‌ అధికారులను సబ్‌కలెక్టర్లుగా నియమించింది. అందులో భాగంగా తిరుమల తొలిగడప కడపకు సబ్‌ కలెక్టర్‌గా ద్వారకా తిరుమలకు చెందిన పృధ్వీతేజ రావడం గమనార్హం. సబ్‌కలెక్టర్‌కు కడప  మండల తహసీల్దార్‌ శివరామిరెడ్డి,  ఆర్డీవో మలోల, ఆర్డీవో కార్యాలయ సిబ్బంది స్వాగతం పలికారు.

Updated Date - 2020-08-09T11:27:35+05:30 IST