NRI: ఎన్నారై నిధుల్లో అధికభాగం ప్రైవేటు బ్యాంకుల్లోకే..

ABN , First Publish Date - 2022-08-30T02:20:43+05:30 IST

ఎన్నారైలు స్వదేశానికి పంపిస్తున్న నిధుల్లో అధికశాతం ప్రైవేటు బ్యాంకుల ద్వారానే భారత్‌కు చేరుతున్నట్టు తాజాగా వెల్లడైంది.

NRI: ఎన్నారై నిధుల్లో అధికభాగం ప్రైవేటు బ్యాంకుల్లోకే..

ఎన్నారై డెస్క్: ఎన్నారైలు స్వదేశానికి పంపిస్తున్న నిధుల్లో(NRI remittances) అధికశాతం ప్రైవేటు బ్యాంకుల ద్వారానే భారత్‌కు చేరుతున్నట్టు తాజాగా వెల్లడైంది. ఉత్తర అమెరికాలోని ఎన్నారైలు భారత్‌కు అధికమొత్తంలో నిధులు పంపిస్తుండటమే దీనికి కారణమని తెలుస్తోంది. ఒకప్పుడు గల్ఫ్ ఎన్నారైల నుంచి భారత్‌కు నిధులు ఎక్కువగా వచ్చేవి. ప్రస్తుతం అమెరికా ఎన్నారైలు ఈ విషయంలో తొలిస్థానంలో నిలిచారు. 2021 ఆర్థిక సంవత్సరంలో భారత్‌కు చేరిన ఎన్నారై నిధుల్లో అమెరికా వాటా 23.4 శాతం కాగా.. యూఏఈ ఎన్నారైల వాటా 18 శాతం. అమెరికా(America), యూరోప్ దేశాల్లోని(European countries) భారత సంతతి వారు ఎక్కవగా సేవల రంగంలో ఉంటారు. కాబట్టి.. భారత్‌కు వారి నిధుల రాకడ ఆయా దేశాల ఆర్థిక స్థితిగతులపై ఆధారపడి ఉంటుందని యాక్సిస్ మ్యూచువల్ ఫండ్ తన అధ్యయనంలో తేల్చింది.


ఈ నివేదిక ప్రకారం.. అమెరికా, కెనడాలోని ఎన్నారైలు ప్రైవేటు బ్యాంకుల(Private banks) ద్వారానే స్వదేశానికి నిధులు పంపించేందుకు ఇష్టపడతారు. ఫలితంగా.. 53 శాతం ఎన్నారై నిధులు ప్రైవేటు బ్యాంకుల ద్వారానే భారత్‌కు చేరుతున్నాయి. 2017 ఆర్థిక సంవత్సరం భారత్‌లోకి వచ్చిన ఎన్నారై నిధుల్లో మధ్యప్రాచ్యం, ఉత్తర ఆఫ్రికా దేశాల వాటా 53 శాతంగా ఉండేది. కానీ.. 2021లో వాటి వాటా 28.6 శాతానికి పడిపోయింది. అదేసమయంలో ఉత్తరఅమెరికా ఎన్నారైల వాటా పెరిగింది. 


ఇక రాష్ట్రాల వారీగా చూస్తే.. కేరళ(Kerala), కర్ణాటక(Karnataka) రాష్ట్రాల జీడీపీల్లో ఎన్నారై నిధుల వాటా క్రమంగా తగ్గుతూ వస్తోంది. అదేసమయంలో..ఉత్తరాది రాష్ట్రాల ఎన్నారైలు తమ సొంతరాష్ట్రాలకు పెద్ద మొత్తాల్లో నిధులు పంపిస్తున్నారు. కరోనా సమయంలో ఎన్నారైలు మహారాష్ట్ర, ఢిల్లీకి పెద్ద మొత్తంలో నిధులు పంపారు. కుటుంబసభ్యులు, బంధువులను ఆదుకునేందుకు ఎన్నారైలు పెద్ద మొత్తంలో ఆ రాష్ట్రాలకు నిధులు పంపించారు. 



Updated Date - 2022-08-30T02:20:43+05:30 IST