‘ప్రైవేటు’ దందా!

ABN , First Publish Date - 2021-05-10T04:48:15+05:30 IST

నగరంలో ప్రైవేటు, కార్పొరేట్‌ ఆస్పత్రుల దోపిడీకి అంతు లేకుండా పోతోంది. కరోనా పాజిటివ్‌ అనగానే ముందు బెడ్‌ ఖాళీ లేదని చెబుతున్నారు.

‘ప్రైవేటు’ దందా!

ఆస్పత్రుల్లో అడ్డగోలు దోపిడీ

కనిపించని ఫీజుల బోర్డులు

కరోనా రోగుల నుంచి భారీ వసూళ్లు 

అధికారుల తనిఖీల్లో బయటపడుతున్న వాస్తవాలు

జిమ్స్‌లో రెమ్‌డెసీవర్‌పై పొంతన లేని లెక్కలు

కేసులు నమోదుచేస్తున్నా భయపడని యాజమాన్యాలు


(విశాఖపట్నం, ఆంధ్రజ్యోతి)

నగరంలో ప్రైవేటు, కార్పొరేట్‌ ఆస్పత్రుల దోపిడీకి అంతు లేకుండా పోతోంది. కరోనా పాజిటివ్‌ అనగానే ముందు బెడ్‌ ఖాళీ లేదని చెబుతున్నారు. తెలిసిన వారితో రికమెండ్‌ చేయిస్తే తొలుత రూ.2 లక్షలు చెల్లించాకే బెడ్‌ కేటాయిస్తున్నారు. ఆ తరువాత రెమ్‌డెసివర్‌ ఇంజక్షన్ల కోసమని మరో రూ.50 వేలు లాగేస్తున్నారు. అయినప్పటికీ రోగి కోలుకోకపోతే రూ.46 వేల ఖరీదైన ఇంజక్షన్‌ తెచ్చుకోవాలని సూచిస్తున్నారు. అది బ్లాక్‌మార్కెట్‌లో రూ.70 వేల నుంచి రూ.80 వేలకు అమ్ముతున్నారు. వాటిని కూడా ఆ ఆస్పత్రి సిబ్బందే సమకూర్చి కమీషన్లు కొట్టేస్తున్నారు.  ఇలా ఆస్పత్రిలో చేరినప్పటి నుంచి కనీసం రూ.3 లక్షలు బిల్లు లేనిదే బయటకు పంపడం లేదు. రోగిని కనీసం వారం రోజులు వుంచుకోవడానికే అధికశాతం ఆస్పత్రులు రెమ్‌డెసివర్‌ ఇంజక్షన్లు ఇస్తున్నాయని వైద్యవర్గాలే  చెబుతున్నాయి. 


ఫీజుల వివరాలేవీ?

ఆస్పత్రుల్లో అన్ని రకాల చికిత్సలకు ఒకే రకమైన ఫీజులు ఉండాలని, వాటిని ఆస్పత్రుల్లోని లాంజ్‌ బోర్డుల్లో ప్రదర్శించాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ నిబంధన ముందు నుంచీ ఉన్నప్పటికీ ప్రస్తుతం దీనిని కచ్చితంగా అమలుచేయాలని జిల్లా అధికారులు సూచించారు. ఆస్పత్రులను తనిఖీ చేసే సమయలో బోర్డులు లేకపోతే కఠిన చర్యలు చేపడతామని కూడా హెచ్చరించారు. అయితే వీటిని ఏ ప్రైవేటు ఆస్పత్రి యాజమాన్యమూ పట్టించుకోలేదు. నిబంధనలు ఉల్లంఘించిన ఆస్పత్రులపై కేసు నమోదు తప్ప, చర్యలు లేకపోవడంతో  వారిలో మార్పు రావడం లేదు.


విజిలెన్స్‌ తనిఖీల్లో వెలుగులోకి వాస్తవాలు

విజిలెన్స్‌ అధికారులు ఆస్పత్రులను తనిఖీ చేస్తున్న సందర్భంలో అనేక వాస్తవాలు వెలుగుచూస్తున్నాయి. ప్రభుత్వ అనుమతి లేకుండానే చాలా ఆస్పత్రుల్లో కొవిడ్‌ రోగులకు వైద్యం చేస్తున్నారు. ఇలాంటి ఆస్పత్రులకు రెమ్‌డెసీవర్‌ ఇంజక్షన్లను ప్రభుత్వం అందించడం లేదు. దాంతో వారు బయట కొనుగోలు చేసి తేవాలని రోగుల బంధువులకు సూచిస్తున్నారు.  దీంతో ఒక్కో ఇంజక్షన్‌ రూ.40వేలకు కొంటున్నారు. ఈ దందాలో అన్ని వర్గాలకు కమీషన్లు అందుతున్నాయి. అనిట్స్‌లో విజిలెన్స్‌ అధికారులు సోదా చేసినపుడు లెక్కలలో తేడా కనిపించాయి. నగరంలోని మరిన్ని ఆస్పత్రులు కూడా ఈ ఇంజక్షన్లను దుర్వినియోగం చేస్తున్నట్టు తేలింది. తాజాగా ఆరిలోవ హెల్త్‌సిటీ జిమ్స్‌ ఆస్పత్రి కూడా ఇలాంటి మోసాలే చేస్తున్నట్టు బయటపడింది. వారికి 178 రెమ్‌డెసీవర్‌ ఇంజక్షన్లను ప్రభుత్వం అందించగా, వాటిని ఎవరికి ఉపయోగించారో సరైన లెక్కలు కనిపించలేదు. పైగా ఈ ఆస్పత్రిలో తీసుకున్న మొత్తానికి సరిపడా బిల్లులు ఇవ్వడం లేదన్న రోగుల బంధువుల ఆరోపణలు నిజమేనని తేలింది. ఇలాంటి వ్యవహారాలపై అధికారులు కేసులతో పాటు ప్రతి ఆస్పత్రి ఏ పరీక్షకు ఎంత? ఏ చికిత్సకు ఎంత? వసూలు చేయాలనే బోర్డులను తప్పనిసరిగా ప్రదర్శించేలా చూడాల్సి ఉంది. 

Updated Date - 2021-05-10T04:48:15+05:30 IST