ప్రైవేట్ జెట్లకు భలే గిరాకీ

Published: Fri, 25 Mar 2022 00:07:46 ISTfb-iconwhatsapp-icontwitter-icon
ప్రైవేట్ జెట్లకు భలే గిరాకీ

కొవిడ్‌ తర్వాత ఐదింతలు పెరిగిన వినియోగం  

28 విమానాలతో సేవలందిస్తున్నాం

హైదరాబాద్‌లో శిక్షణ, ఎంఆర్‌ఓ కేంద్రాల ఏర్పాటు 

జెట్‌సెట్‌గో సీఈఓ కనికా టేక్రివాల్‌ రెడ్డి


భారత్‌లో ప్రైవేట్‌ జెట్స్‌ వినియోగం శరవేగంగా వృద్ధి చెందుతోందని జెట్‌సెట్‌గో ఏవియేషన్‌ సర్వీసెస్‌ ఫౌండర్‌, సీఈఓ కనికా టేక్రివాల్‌ రెడ్డి వెల్లడించారు. గతంలో కొద్ది మంది మాత్రమే వీటిని వినియోగించగా కొవిడ్‌ అనంతరం పరిస్థితులు పూర్తిగా మారిపోయాయన్నారు. భద్రత, రక్షణకు పెద్దపీట వేస్తూ.. కంపెనీ అధిపతులు, సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు విస్తృతంగా ప్రైవేట్‌ జెట్లను వినియోగిస్తున్నారని ఆమె తెలిపారు. ‘వింగ్స్‌ ఇండియా 2022’ సందర్భంగా భారత్‌లో ప్రైవేట్‌ జెట్స్‌ పరిశ్రమ, భవిష్యత్‌, ఇతరత్రా అంశాలపై ‘ఆంధ్రజ్యోతి’తో ఆమె ఇష్ఠాగోష్ఠిగా మాట్లాడారు. ఆ వివరాలు.. 


దేశీయంగా ప్రైవేట్‌ జెట్ల వినియోగం ఎలా ఉంది?

గతంలో చాలా కొద్దిమందే ప్రైవేట్‌ జెట్లను వినియోగించే వారు. ఇప్పుడు పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. భవిష్యత్తులో ప్రైవేట్‌ జెట్ల వినియోగం మరింత పెరగనుంది. ప్రస్తుతం దేశంలో 150 విమానాలు ప్రైవేట్‌ జెట్‌ సేవలందిస్తున్నాయి. ఈ పరిశ్రమ విలువ దాదాపు 200 కోట్ల డాలర్లు ఉంటుందని అంచనా. వచ్చే ఐదేళ్లలో విమానాల సంఖ్య 1000కు చేరే అవకాశం ఉంది. జెట్‌సెట్‌గో కూడా సొంత విమానాలు, హెలికాప్టర్లతో ప్రైవేట్‌ జెట్‌ సేవలను అందిస్తోంది. దీంతోపాటు ఇతరులకు, కంపెనీలకు ఉండే విమానాల నిర్వహణ, గ్రౌండ్‌ హ్యాండ్లింగ్‌ వంటి సేవలను కూడా చేపడుతోంది. కొవిడ్‌ తర్వాత ప్రైవేట్‌ జెట్ల పరిశ్రమ ఐదింతలు వృద్ధి చెందింది. 


ప్రైవేట్‌ జెట్లలో ఎవరు ఎక్కువగా ప్రయాణం చేస్తున్నారు?

సెలబ్రిటీలు, కంపెనీల అధిపతులు, రాజకీయ నాయకులు, ప్రభుత్వం ప్రైవేట్‌ జెట్లను వినియోగిస్తున్నాయి. ప్రైవేట్‌ జెట్ల గిరాకీలో 60 శాతం కార్పొరేట్‌ కంపెనీల నుంచే ఉంటుంది. భవిష్యత్తులో ఇది 80 శాతానికి చేరొచ్చు. కంపెనీలు సొంత విమానాలను సొంత అవసరాలకు వినియోగించి, ఇతరులకు లీజుకు ఇస్తున్నాయి. వీటిని పక్కన పెడితే.. దేశీయంగా ప్రైవేట్‌ జెట్ల మార్కెట్లో ఈ సేవలను అందిస్తున్న కంపెనీలు 8-9 మాత్రమే ఉన్నాయి. 


జెట్‌సెట్‌గో వద్ద ఎన్ని విమానాలు ఉన్నాయి?

మొత్తం 28 విమానాలతో సేవలందిస్తున్నాం. 6, 9, 13 సీట్ల సామర్థ్యం కలిగిన విమానాలివి.2023 మార్చి నాటికి మరో 10 విమానాలు వచ్చి చేరుతాయి. హైదరాబాద్‌, ఢిల్లీ, దుబాయ్‌, న్యూయార్క్‌ తదితర ప్రాంతాల్లో సేవలు అందిస్తున్నాం. ఆఫ్రికాకు సేవలను విస్తరించనున్నాం. ఏడాదికి రూ.600 కోట్ల ఆదాయాన్ని ఆర్జిస్తున్నాం.


హైదరాబాద్‌లో ఎంత మంది ఖాతాదారులు ఉన్నారు?

మొత్తం 30 మంది ఖాతాదారులు ఉన్నారు. ఇక్కడి నుంచి 6 విమానాలతో ప్రైవేట్‌ జెట్‌ సేవలను అందిస్తున్నాం. ప్రైవేట్‌ జెట్‌ కోసం గంటకు రూ.3.25 లక్షలు వసూలు చేస్తాం. దేశవ్యాప్తంగా 500 ఖాతాదారులకు సేవలందిస్తున్నాం.


విస్తరణ ప్రణాళికలు ఏమైనా ఉన్నాయా?

పైలట్లు, గ్రౌండ్‌ స్టాఫ్‌, క్యాబిన్‌ సిబ్బంది మొదలైన రంగాల్లో శిక్షణ ఇచ్చేందుకు హైదరాబాద్‌లో శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలనుకుంటున్నాం. ఇందుకు రూ.30 కోట్లను వెచ్చించనున్నాం. 2023 మార్చి నాటికి రూ.50 కోట్లతో హైదరాబాద్‌లో విమానాల నిర్వహణ, మరమ్మతు కేంద్రాన్ని (ఎంఆర్‌ఓ) ఏర్పాటు చేస్తున్నాం. వీటిని అంతర్గతంగా సమకూర్చుకోనున్నాం. 2025 నాటికి 100 విమానాలతో ప్రైవేట్‌ జెట్‌ సేవలందించాలని భావిస్తున్నాం. రూ.5,000 కోట్ల ఆదాయాన్ని లక్ష్యంగా పెట్టుకున్నాం. 


-హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌)

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.