ltrScrptTheme3

ప్రాణాలపై ప్రైవేటు

Nov 24 2021 @ 23:53PM

దనార్జనే ధ్యేయంగా ఆస్పత్రులు 

చనిపోతే ప్రాణానికి వెల కడుతున్న డాక్టర్లు

మామూళ్ల మత్తులో చోద్యం చూస్తున్న అధికారులు


 ప్రాణం పోసే డాక్టర్లను కనిపించే దైవాలుగా భావిస్తారు. ఆస్పత్రికి వచ్చిన రోగుల బంధువులు మీరే దిక్కని చేతులెత్తి మొక్కుతారు. కానీ, కొందరు ప్రైవేట్‌ డాక్టర్లు ఆ స్థానాన్ని నిలుపుకోలేకపోతున్నారు. పైగా ధనార్జనే ధ్యేయంగా అధిక డబ్బులు వసూలు చేస్తున్నారు. రోగులు చనిపోతే తమ తప్పిదం లేదని కొన్ని డబ్బులు ఇచ్చేలా సెటిల్‌మెంట్‌ చేసుకుంటున్నారు. ఈ విషయంలో వారికి వైద్యాధికారుల అండదండలున్నాయనే ఆరోపణలొస్తున్నాయి.

- గద్వాల క్రైం


జోగుళాంబ గద్వాల జిల్లాలో 40 ప్రవేట్‌ ఆస్పత్రులు, 11 క్లీనిక్‌లు ఉన్నాయి. అందులో కేవలం గద్వాల పట్టణంలోనే 18 ప్రైవేట్‌ ఆస్పత్రులు ఉన్నట్లు అంచనా. వాటిలో ఎక్కువగా ప్రభుత్వ డాక్టర్లే నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో ప్రభుత్వ డాక్టర్లు ప్రభుత్వ ఆస్పత్రికి వచ్చిన రోగులను తమ ప్రైవేట్‌ ఆస్పత్రులకు రావాలని సూచిస్తున్నట్లు తెలిసింది. ప్రభుత్వ ఆస్పత్రుల్లో పనిచేసే సిబ్బంది కూడా రోగులను ప్రైవేట్‌ ఆస్పత్రులకు పంపిస్తూ, ప్రైవేట్‌ ఆస్పత్రుల నుంచి కమీషన్లు తీసుకుంటున్నారని సమాచారం.


ఇవీ ఘటనలు..

జిల్లాలోని ప్రైవేట్‌ ఆస్పత్రుల యాజమాన్యాలు ధనార్జనే ధ్యేయంగా రోగుల నుంచి అధిక డబ్బులు వసూలు చేస్తున్నారు. ఒక వేళ రోగులు మరణిస్తే రూ.లక్షో.. రూ.రెండు లక్షలో ఇచ్చి సెటిల్‌మెంట్‌ చేసుకుంటున్నారు. ఈ విషయంలలో  వారికి వైద్యాధి కారుల అండదండలు ఉన్నాయన్న ఆరోపణలొ స్తున్నాయి. గతంలో కాన్పు కోసం, ఇతర చికిత్సల కోసం వచ్చిన మహిళలు ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో మరణించారు.

పట్టణంలోని నవరంగ్‌ థియేటర్‌ సమీపంలోని ఓ ఆస్పత్రిలో ఇటీవల ఓ మహిళ మృతి చెందగా, సెటిల్‌మెంట్‌ చేసుకున్నట్లు సమాచారం. 

పట్టణంలోని ఇంకో చిన్నపిల్లల ఆస్పత్రిలో ఓ చిన్నారి చనిపోయింది. ఆస్పత్రి యాజమాన్యం అఽధికారుల అండతో తల్లిదండ్రులను భయాందోళనకు గురిచేసి, ఎంతో కొంత ముట్టజెప్పినట్లు తెలిసింది.

తాజాగా సోమవారం పట్టణంలోని మరో ఆస్పత్రిలో జ్వరంతో వచ్చిన మహిళ మృతి చెందడంతో అధికారుల అండతో సెటిల్‌మెంట్‌ చేసి, గుట్టుచప్పుడు కాకుండా పంపించారని సమాచారం. ఇలా ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో గద్వాల పట్టణంలోనే పదుల సంఖ్యలో రోగులు మృత్యువాత పడగా, ఇక జిల్లా మొత్తంగా ఆ సంఖ్య ఎక్కువగా ఉంటుందని చర్చించుకుంటున్నారు.


మామూళ్ల మత్తులో అధికారులు

జిల్లాలో ప్రవేట్‌ ఆస్పత్రుల యజమానులు ఇటు ప్రజాప్రతినిధులు, అటు అధికారుల అండదండలతో చెలరేగి పోతున్నారు. ప్రాణాపాయం సంభవిస్తే అధికారులకు మామూళ్లు ముట్టజెప్పి, తమది ఎలాంటి తప్పులేదని, పే షెంట్‌ కండీషన్‌ సీరియస్‌గా ఉండి చనిపో యారని చెప్పుకుంటున్నారు. ఇలా చేసేందుకు అధికారులకు భారీగా ముడుపులు ముట్టజెప్పుతున్నారని ఆరోపణలొస్తున్నాయి. చనిపోయిన వారి బంధువులను భయ పెట్టి, కొన్ని డబ్బులు ఇస్తున్నారని సమాచారం.


విచారణ చేపట్టాం

గద్వాల పట్టణంలో సోమవారం ఆదిత్య ప్రైవేట్‌ ఆస్పత్రిలో మహిళ మృతి చెందిన విషమై కారణాలను తెలుసుకునేందుకు విచారణ చేపట్టాం. ప్రత్యేక టీంను ఏర్పాటు చేసి, విచారణ చేస్తున్నాం. ప్రజలకు ఇబ్బందులు కలిగించే వారిని ఊపేక్షించం. డాక్టర్ల తప్పిదం అని తెలిస్తే చర్యలు తీసుకుంటాం.

-చందూనాయక్‌, డీఎంహెచ్‌వో, గద్వాల

Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.