ఆలయంలో ప్రైవేటు వ్యక్తుల రాజ్యం

ABN , First Publish Date - 2021-01-10T05:40:44+05:30 IST

పట్టణంలోని కాళికాంబ చంద్రశేఖర స్వామి దేవస్థానంలో రాజకీయ అండతో కొందరు పేట్రేగిపోతున్నారు.

ఆలయంలో ప్రైవేటు వ్యక్తుల రాజ్యం
ప్రైవేటు వ్యక్తులు తాళం వేసిన దేవస్థానం గది

  1. వారి ఆధీనంలోనే ఆభరణాలు 
  2. ఆలయంలో గదిని ఆక్రమించి తిష్ట
  3. ఈవో, ట్రస్టు బోర్డు ఉన్నా.. బేఖాతరు
  4. కనుసైగతో.. భక్తుల చేతికే హారతి పళ్లెం
  5. అధికార పార్టీ నాయకుల పేరిట అనాచారం


నంద్యాల, జనవరి 9: పట్టణంలోని కాళికాంబ చంద్రశేఖర స్వామి దేవస్థానంలో రాజకీయ అండతో కొందరు పేట్రేగిపోతున్నారు. రూ.లక్షల విలువైన స్వామి, అమ్మవార్ల ఆభరణాలను శాస్త్ర విరుద్ధంగా తమ ఇళ్ళల్లో పెట్టుకున్నారు. దేవదాయ శాఖ అధికారులు జారీ చేసిన నోటీసులను సైతం బేఖాతరు చేస్తున్నారు. వారి తీరు చూసి భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దేవస్థానాలకు వచ్చే భక్తులు, స్వామివార్లకు కానుకలు సమర్పించడం పరిపాటి. మొక్కులు తీర్చుకునేవారు వజ్ర, బంగారు, వెండితో తయారైన విలువైన ఆభరణాలను సమర్పించుకుంటారు. ఇలాంటి ఆభరణాలకు పూజారులు సంప్రోక్షణ చేసి దేవతా మూర్తులకు అలంకరిస్తారు. పూజలు, వేడుకలు ముగిసిన అనంతరం దేవదాయ శాఖ అధికారులు భద్రపరుస్తారు. ఆలయాల స్థాయిని బట్టి బ్యాంకు లాకర్లు కూడా తీసుకుంటారు. ఎలాంటి పరిస్థితుల్లోనూ ఇళ్లకు తీసుకువెళ్లరు. నివాస గృహాలలో అంటు ఉంటుందని, అక్కడ భద్రపరచడం శాస్త్ర విరుద్ధమని పండితులు చెబుతున్నారు. కానీ నంద్యాల కాళికాంబ చంద్రశేఖర స్వామి దేవస్థానంలో మాత్రం ఈ పద్ధతులేవీ పాటించడం లేదు. బృందంగా ఏర్పడిన ప్రైవేటు వ్యక్తులు ఆలయం వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటున్నారు. అధికారుల ఆదేశాలను లెక్క చేయడం లేదు. 


దర్జాగా తాళం

కాళికాంబ ఆలయంలో ఓ గదికి ప్రైవేటు వ్యక్తులు తాళం వేసుకున్నారు. దేవదాయ శాఖ అధికారులు, దేవస్థానం పాలకవర్గం ప్రశ్నించినా వారు పట్టించుకోవడం లేదు. అధికార పార్టీ నాయకుల పేరు చెప్పి దర్జాగా తిరుగుతున్నారు. తాము చెప్పినట్లే అన్నీ జరగాలి అన్నట్లు హల్‌చల్‌ చేస్తున్నారు. 


అభివృద్ధికి అడ్డు తగులుతూ..

కాళికాంబ ఆలయంలో గర్భాలయం గడప పక్కనే విద్యుత్‌ మీటర్లు, విద్యుత్‌ సరఫరా ఫీజుల బాక్స్‌లు ఉన్నాయి. గతంలో వీటిని ఏర్పాటు చేశారు. చేతికి అందే ఎత్తులో ఉన్న వీటివల్ల భక్తుల రద్దీ సమయంలో ఏదైనా ప్రమాదం జరుగుతుందేమోనని దేవదాయశాఖ అధికారులు ఆందోళన చెందుతు న్నారు. వీటిని పక్కకు మార్చాల్సి ఉంది. దీంతోపాటు ప్రైవేటు వ్యక్తులు తాళం వేసుకున్న గదిని తొలగించి గర్భాలయ ప్రధాన ద్వారం వద్ద విస్తరణ పనులు చేపట్టాల్సి ఉంది. కానీ ప్రైవేటు వ్యక్తుల పెత్తనం కారణంగా ఈ పనులేవీ ముందుకు సాగడం లేదని అధికారులు వాపోతున్నారు. 


నోటీసులు ఇచ్చినా..

కాళికాంబ అమ్మవారి ఆభరణాలను దేవస్థానం ఈవోకు స్వాధీనం చేయాలని డిసెంబరు 18న ఈవో వేణునాథ్‌రెడ్డి నోటీసులు ఇచ్చారు. 2020 సెప్టెంబరు 9న దేవస్థానం పాలక మండలి చేసిన తీర్మానం మేరకు, కాళిమాత సేవా సమాజం దగ్గర ఉన్న ఆభరణాలను వారం రోజుల్లోగా స్వాధీనం చేయాలని ఆ నోటీసులో పేర్కొన్నారు. తాళం వేసుకున్న దేవస్థానం గదిని కూడా వెంటనే అప్పగించాలని నోటీసులో సూచించారు. ఈవో నోటీసు జారీ చేసిన తరువాత కూడా వారిలో మార్పు రాలేదు. ఆభరణాలను అప్పగించలేదు, గదిని ఖాళీ చేయలేదు.ల


వారి గుప్పిట్లో..

కాళికాంబ అమ్మవారి ఆభరణాలను ప్రైవేటు వ్యక్తులు తమ గుప్పిట్లో పెట్టుకున్నారు. రూ.లక్షల విలువ చేసే బంగారు కిరీటం, రెండు బంగారు పాదాలు, లక్ష్మీకాసుల హారం, రెండు జతల కమ్మలు, ముక్కు పుడుకలు, అమ్మవారి కళ్లు.. ఇలా అనేక ఆభరణాలను ఇళ్లకు తీసుకువెళుతున్నారు.


బీరువాలు బయటనే..

కాళికాంబ చంద్రశేఖర స్వామి దేవస్థానం నిర్వహణకు దేవదాయ శాఖ ఈవో, సిబ్బంది ఉన్నారు. నంద్యాల గ్రూపు దేవాలయాలు-2 పరిధిలో కాళికాంబ దేవస్థానం ఉంది. కార్యాలయంలో దేవస్థానానికి సంబంధించిన ఫైళ్లు, నిర్వహణకు సంబంధించిన వస్తువులను భద్రపరిచేందుకు బీరువాలు ఉన్నాయి. దేవస్థానంలో ఉన్న ఓ గదిని ప్రైవేటు వ్యక్తుల బృందం రాజకీయ అండతో తమ గుప్పిట్లో పెట్టుకుంది. దీంతో ఆలయంలోని బీరువాలు అన్నీ బయటే పెట్టేశారు. భద్రంగా గదిలో ఉండాల్సిన దేవస్థానం ఫైళ్ళన్నీ వీటిలోనే ఉన్నాయి. వివాహాది శుభకార్యాలయాలకు వందలాది మంది ఆలయానికి వస్తుంటారు. ఈ రద్దీలో అగంతకులు ప్రవేశిస్తే పరిస్థితి ఏమిటన్న భయం అధికారులను వెంటాడు తోంది. బీరువాల వద్ద కాపలా ఉంటున్నామని సిబ్బంది వాపోతున్నారు.


హారతి పళ్లెం భక్తుల చేతికి..

ఆలయాల్లో పూజారులే దేవతామూర్తులకు హారతి పడతారు. ఆ తరువాత హారతి పళ్లేన్ని భక్తుల వద్దకు తీసుకువస్తారు. భక్తులు హారతిని కళ్లకు అద్దుకుంటారు. కానీ కాళికాంబ ఆలయంలో మాత్రం ప్రైవేటు వ్యక్తుల బృందం జోక్యంతో భక్తుల చేతికే హారతి పళ్లెం ఇస్తున్నారు. భక్తుల స్థాయిని బట్టి కనుసైగతో శాస్త్ర విరుద్ధంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. పూజారికి బదులుగా భక్తులే స్వామి, అమ్మవార్లకు హారతి పడుతున్నారు. అమ్మవారికి ఒడి బియ్యం సమర్పించే భక్తులను సైతం నేరుగా ప్రైవేటు వ్యక్తులు తమ వెంట తీసుకువెళ్లి కార్యక్రమాలను ముగిస్తున్నారు. వీరి తీరు సర్వత్రా విమర్శలకు తావిస్తోంది. 


నోటీసులు జారీ చేశాం 

అమ్మవారి ఆభరణాలను స్వాధీనం చేయాలని, గదిని ఖాళీ చేయాలని ఇప్పటికే నోటీసులు జారీ చేశాం. దేవస్థానంలో ప్రైవేటు వ్యక్తులు వ్యవహరిస్తున్న తీరును ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లాం. పాలక మండలి తీర్మానం మేరకు నోటీసులు ఇచ్చినా వారు స్పందించడం లేదు. - జి.వేణునాథరెడ్డి, దేవస్థానం ఈవో


అభివృద్ధికి అడ్డు పడుతున్నారు 

మూడు దశాబ్దాల క్రితం నాటి నిర్మాణాలను విస్తరించాల్సి ఉంది. ప్రమాదకరంగా ఉన్న వాటిని సురక్షిత ప్రాంతంలో ఏర్పాటు చేయాల్సి ఉంది. ఈ ప్రయత్నాలకు కొందరు అడ్డంకులు సృష్టిస్తున్నారు. దేవదాయ శాఖ, ట్రస్టు బోర్డు అనుమతి లేకుండా ఓ గదికి తాళం వేసుకున్నారు. రూ.లక్షలు విలువ చేసే అమ్మవారి ఆభరణాలు వారి అధీనంలో పెట్టుకున్నారు. దేవస్థానానికి అప్పగించాలన్న తీర్మానంలో సంతకాలు చేసిన వారిని బెదిరిస్తున్నారు. - బింగుమళ్ళ సుబ్బలక్ష్మయ్య, ఆలయ కమిటీ చైర్మన్‌

Updated Date - 2021-01-10T05:40:44+05:30 IST