ప్రైవేటు పంతుళ్ల పస్తులు

ABN , First Publish Date - 2020-09-16T06:41:39+05:30 IST

అన్నదానం.. వస్త్రదానం అప్పటి వరకే తృప్తిని, ఆనందాన్ని ఇస్తాయి. కానీ ప్రతీ ఒక్కరి జీవితంలో వెలుగులు నింపి, చిరకాలం

ప్రైవేటు పంతుళ్ల పస్తులు

కరోనాతో ప్రైవేటు పంతుళ్ల బతుకులు ఆగమాగం 

తెరుచుకోని స్కూళ్లు.. 6 నెలలుగా వేతనాలు కరువు

ఉమ్మడి జిల్లాలో 15 వేల మంది ప్రైవేటు ఉపాధ్యాయులు

ఆదుకునే వారి కోసం ఎదురుచూపులు


బాన్సువాడ టౌన్‌, సెప్టెంబరు 15: అన్నదానం.. వస్త్రదానం అప్పటి వరకే తృప్తిని, ఆనందాన్ని ఇస్తాయి. కానీ ప్రతీ ఒక్కరి జీవితంలో వెలుగులు నింపి, చిరకాలం ఆనందంగా ఉండేలా విద్యాదానం చేసేది కేవలం ఉపాధ్యాయుడు మాత్రమే. విద్యార్థి భవిష్యత్తు పాఠశాల తరగతి గదిలోనే నిర్మితమవుతుంది అన్న పెద్దల మాటప్రకారం విద్యార్థి జీవితానికి బంగారు బాటలు వేయగల సమర్థుడు ఎవరైనా ఉన్నారంటే అది కేవలం ఉపాధ్యాయుడే. అలాంటి ఉపాధ్యాయుడు కరోనా కాటుకు చతికిలబడ్డాడుడు. ప్రభుత్వ బడి పంతుళ్ల పరిస్థితులు మెరుగ్గా ఉండగా.. కరోనా కాటుతో ప్రైవేటు బడి పంతుళ్లు మాత్రం ఆగమాగమవుతున్నారు. తమ బతుకు జట్కా బండిని లాగేందుకు పడరాని పాట్లు పడుతున్నారు. ఒకటి కాదు, రెండు కాదు .ఏకంగా ఆరు నెలలుగా ప్రైవేటు పాఠశాలలు మూతబడి ఉండడంతో దిక్కుతోచని స్థితిలో ఉండిపోతున్నారు. ఉన్నత చదువులు చదివి ప్రభుత్వ కొలువు దక్కకపోవడంతో చాలా మంది విద్యావంతులు ప్రైవేటు విద్యాసంస్థలపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. ఉన్నట్టుండి కరోనా మహమ్మారి సాఫీగా సాగే వారి జీవితాల్లో పిడుగు వేసింది. ఏ పని చేయాలో తెలియక అగమ్యగోచరంగా మారింది ప్రైవేటు పంతుళ్ల పరిస్థితి. 


మూతపడిన ప్రైవేటు పాఠశాలలు

కరోనా మహమ్మారి కారణంగా బడులు మూతబడ్డాయి. మార్చి నుంచి నేటి వరకు తెరుచుకోలేవు. ప్రభుత్వ బడుల విద్యార్థులకు ఆన్‌లైన్‌ పాఠాలు కొనసాగుతున్నప్పటికీ, ప్రైవేటు బడుల్లో మాత్రం నిశ్శబ్దం కాపలా కాస్తోంది. విద్యార్థులు లేక పాఠశాల మూగబోయింది. తరగతి గదుల్లో బ్లాక్‌బోర్డు తెల్లబోయింది. పాఠశాలల్లో పనిచేసిన ఉపాధ్యాయుల మోముపై చిరునవ్వు కరువైంది. 


ఆరు నెలలుగా వేతనాలు కరువు

ప్రైవేటు పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు ఆరు నెలలుగా వేతన కరువు ఏర్పడింది. సమాజంలో అందరిచేత గౌరవింపబడి కరోనా కారణంగా ఎం చేయాలో తెలియని అగమ్యగోచర స్థితిలో ఉండిపోతున్నారు. కొంతమంది ఉపాధ్యాయులు కుటుంబపోషణ కోసం కూలీ పనులు చేస్తున్నారు. మరికొంతమంది తమకున్న కొద్దిపాటు పంట పొలాల్లో పనులు చేసుకుంటున్నారు. 


ఉమ్మడి జిల్లాలో సుమారు 15వేల మంది ప్రైవేటు ఉపాధ్యాయులు

ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లా వ్యాప్తంగా సుమా రు 673 ప్రైవేలు పాఠశాలలున్నాయి. అందులో సుమారు 15వేల మంది వరకు ప్రైవేటు ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు. ప్రస్తుతం కరోనా మహమ్మారి కారణంగా వీరి పరిస్థితి దయనీయంగా మారింది. కష్టాలకడలిలో కొట్టుమిట్టాడుతూ యాజమాన్యాలు ఎప్పుడు పిలుస్తాయా.. అని పాఠశాల గేటు వైపు ఎదురుచూపులు చూస్తున్నారు.  


ఆదుకునేవారి కోసం ఎదురుచూపులు

కరోనా కారణంగా ప్రైవేటు ఉపాధ్యాయులు దిక్కుతోచని స్థితిలో మగ్గిపోతున్నారు. చేతిలో చిల్లిగవ్వలేక, కుటుంబ పోషణ భారంగా మారింది. గళమెత్తి తమను ఆదుకోవాలని ఇటీవల ర్యాలీలు, నిరసనలు, అధికారులకు వినతి పత్రాలు కూడా అందజేశారు. అందరినీ ఆదుకుని అక్కున చేర్చుకునే ముఖ్యమంత్రి కేసీఆర్‌ తమను సైతం ఆదుకోవాలని, కుటుంబాలకు భరోసా ఇవ్వాలని వేడుకుంటున్నారు. 


ఇబ్బందులు తప్పడం లేదు- వర్ష, ప్రైవేటు టీచర్‌

బడులు మూతబడడంతో జీతాలు లేక ఆర్థిక ఇబ్బందులు  తప్పడం లేదు. గత ఆరు నెలలుగా ప్రైవేటు ఉపాధ్యాయుల పరిస్థితి అంతంతమాత్రంగానే ఉంది. పనిచేస్తేనే జీతాలు వచ్చే ఈ రోజుల్లో కరోనా మా జీవితాలపై         తీవ్ర ప్రభావం చూపుతోంది. ప్రభుత్వం ఆర్థిక సహాయం చేసి ఆదుకోవాలని కోరుతున్నాం.


వేరే పనులు చేయలేకపోతున్నాం- రమేష్‌, ప్రైవేటు ఉపాధ్యాయుడు

ప్రైవేటు పాఠశాలలో విద్యాబోధన చేస్తూ జీవనం గడిపిన మేము గత ఆరునెలలుగా పాఠశాలలు మూతపడడంతో దిక్కుతోచని స్థితిలో ఉండిపోతున్నాం. వేరే పనులు చేద్దామనుకున్నా దొరకని పరిస్థితి. అన్ని రంగాల కంటే ప్రైవేటు విద్యా సంస్థలపై క రోనా తీవ్ర ప్రభావం చూపుతో ంది. రాష్ట్ర ప్రభుత్వమే పెద్ద మనసు చేసుకుని ప్రైవేటు ఉపాధ్యాయులను ప్రత్యేక ప్యాకే జీతో ఆదుకోవాలి.

Updated Date - 2020-09-16T06:41:39+05:30 IST