బతుకు భారం!

ABN , First Publish Date - 2021-05-16T05:11:17+05:30 IST

కరోనా ప్రభావంతో ప్రైవేటు ఉపాధ్యాయులకు, సిబ్బందికి కష్టాలు వెంటాడుతూనే ఉన్నాయి. గత ఏడాది లాక్‌డౌన్‌లో భాగంగా మార్చి నుంచి విద్యా సంస్థలన్నీ మూత పడ్డాయి. దీంతో ప్రైవేటు యాజమాన్యాలు ఉపాధ్యాయులు, సిబ్బందికి సక్రమంగా జీతాలు చెల్లించలేదు. చాలామంది ఆర్థికంగా ఇబ్బందులు పడ్డారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో విద్యాసంస్థలు కుదుటపడగా.. యాజమాన్యాలు పూర్తిస్థాయిలో వేతనాలు అందజేశాయి. ఇంతలో మళ్లీ కరోనా రెండో దశ వ్యాప్తి చెందడంతో గత నెల నుంచి విద్యాసంస్థలన్నీ మూతపడ్డాయి. మళ్లీ తామంతా రోడ్డున పడ్డామని ప్రైవేటు ఉపాధ్యాయులు, సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

బతుకు భారం!

- కరోనా ప్రభావంతో మూతపడిన విద్యాసంస్థలు

- ఉపాధి కోల్పోయిన ప్రైవేటు ఉపాధ్యాయులు, సిబ్బంది

- జీతాలు చెల్లించని యాజమాన్యాలు

- ఏడాదికిపైగా వెంటాడుతున్న ఆర్థిక ఇబ్బందులు

- ప్రభుత్వమే ఆదుకోవాలని విజ్ఞప్తి

(నరసన్నపేట)

కరోనా ప్రభావంతో ప్రైవేటు ఉపాధ్యాయులకు, సిబ్బందికి కష్టాలు వెంటాడుతూనే ఉన్నాయి. గత ఏడాది లాక్‌డౌన్‌లో భాగంగా మార్చి నుంచి విద్యా సంస్థలన్నీ మూత పడ్డాయి. దీంతో ప్రైవేటు యాజమాన్యాలు ఉపాధ్యాయులు, సిబ్బందికి సక్రమంగా జీతాలు చెల్లించలేదు.  చాలామంది ఆర్థికంగా ఇబ్బందులు పడ్డారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో విద్యాసంస్థలు కుదుటపడగా.. యాజమాన్యాలు పూర్తిస్థాయిలో వేతనాలు అందజేశాయి. ఇంతలో మళ్లీ కరోనా రెండో దశ వ్యాప్తి చెందడంతో గత నెల నుంచి విద్యాసంస్థలన్నీ మూతపడ్డాయి. మళ్లీ తామంతా రోడ్డున పడ్డామని ప్రైవేటు ఉపాధ్యాయులు, సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న తమను ప్రభుత్వమే ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. 


ఇదీ పరిస్థితి

జిల్లాలో 450కు పైగా ప్రైవేటు పాఠశాలలు ఉన్నాయి. 112కు పైగా డిగ్రీ, 120 వరకు జూనియర్‌ కళాశాలలు ఉన్నాయి. 30 వరకు వృత్తివిద్యా కళాశాలలు, ఐటీఐలు ఉన్నాయి. వీటిలో సుమారు 17 వేల మంది ఉపాధ్యాయులు, అధ్యాపకులు పని చేస్తున్నారు. కరోనా ప్రభావం విద్యాసంస్థలపై పడడంతో వీరంతా రోడ్డున పడ్డారు. గత ఏడాది లాక్‌డౌన్‌ కారణంగా మార్చి నుంచి ఉపాధి లేక ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటూనే ఉన్నారు. అప్పట్లో కొంతమంది ఉపాధి హామీ పనులకు వెళ్లారు. ఇంకొందరు చిన్నచిన్న వ్యాపారాలు, కూరగాయలు విక్రయించారు. మరికొందరు బంక్‌లు తదితర వాటిలో పనిచేశారు. పట్టణాల్లో ఇంటి అద్దెలు  చెల్లించలేక చాలామంది స్వగ్రామాలకు వెళ్లిపోయారు. గత నవంబర్‌ నుంచి విద్యాసంవత్సరం ప్రారంభమైనా.. ఆన్‌లైన్‌ తరగతుల పేరిట కొంతమంది సిబ్బందిని మాత్రమే ప్రైవేటు యాజమాన్యాలు విధుల్లోకి తీసుకున్నాయి. గతంలో ఇచ్చిన వేతనాల్లో సగం చొప్పున చెల్లించాయి. కరోనా కేసులు తగ్గి.. ఫిబ్రవరిలో విద్యాసంస్థలు కుదుటపడ్డాయి. దీంతో ప్రైవేటు యాజమాన్యాలు మార్చి నెలలో పూర్తిస్థాయిలో వేతనాలు అందించాయి. ఇక తమకు మంచిరోజులు వచ్చాయని ప్రైవేటు ఉపాధ్యాయులు, సిబ్బంది ఆనందించే లోపే.. మళ్లీ కరోనా పడగ విప్పింది. గత నెల నుంచి రికార్డు స్థాయిలో పాజిటివ్‌ కేసుల సంఖ్య పెరిగింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం గత నెల 20 నుంచి మళ్లీ విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించింది. ఒకటో తరగతి నుంచి తొమ్మిదో తరగతి  విద్యార్ధులకు పరీక్షలు లేకుండా పై తరగతులకు  ప్రమోట్‌ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. పదో తరగతి విద్యార్థులకు మాత్రం జూన్‌లో పరీక్షలు నిర్వహించేందుకు చర్యలు చేపడుతోంది. ఇంటర్‌, డిగ్రీ కళాశాలలు కూడా మూతపడడంతో ప్రైవేటు విద్యాసంస్థలు ఈ నెల ఉపాధ్యాయులు, సిబ్బందికి జీతాలు చెల్లించలేదు. దీంతో మళ్లీ తాము రోడ్డున పడ్డామని వారంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ఇటీవల డిగ్రీ, ఇంజినీరింగ్‌, పాలిటెక్నిక్‌ కళాశాలలకు తొలివిడత ఫీజు రీయింబర్స్‌మెంట్‌ విడుదల చేసింది. వాటి నుంచి కళాశాలల్లో పనిచేసేవారికి జీతాలు చెల్లించేలా ఏర్పాట్లు చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రభుత్వం పూర్తిస్థాయిలో ఫీజు రీయింబర్స్‌మెంట్‌ విడుదల చేస్తే.. తమ బతుకులు రోడ్డున పడకుండా ఉంటాయని  ప్రైవేటు కళాశాలలు అధ్యాపకులు పేర్కొంటున్నారు. ప్రైవేటు పాఠశాలల్లో పనిచేసేవారికి ప్రభుత్వం భరోసా కల్పించాలని కోరుతున్నారు.  


ఆర్థికసాయం అందజేయాలి   

కరోనా వ్యాప్తి నేపథ్యంలో.. ప్రైవేటు విద్యాసంస్థల్లో పనిచేసిన వారికి ప్రభుత్వం ఆర్థిక సాయంగా నెలకు రూ.10వేలు చొప్పున అందజేయాలి. నిత్యావసర సరుకులు పంపిణీ చేయాలి. గత ఏడాది లాక్‌డౌన్‌ కారణంగా ఎన్నో కుటుంబాలు చిన్నాభిన్నమయ్యాయి. తాజాగా అవే పరిస్థితులు నెలకొన్నాయి.  ప్రభుత్వమే మమ్మల్ని ఆదుకోవాలి. 

- బి.నగేష్‌,   ప్రైవేటు టీచర్స్‌, లెక్చరర్స్‌ యూనియన్‌ నాయకులు  


  ప్రభుత్వమే ఆదుకోవాలి

పాఠశాలలను మూసివేయడంతో  చాలామంది రోడ్డున పడ్డాం. ఏడాదికిపైగా పూర్తిస్థాయిలో వేతనాలు లేక ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నాం. ప్రభుత్వం స్పందించి ఆదుకోవాలి. తెలంగాణ రాష్ట్రం మాదిరి కనీసం ఒక్కో ఉపాధ్యాయుడికి రూ.2వేలు, 25 కిలోల చొప్పున బియ్యం అందజేయాలి. 

  - గడ్డెయ్య, కంప్యూటర్‌  టీచరు, ప్రైవేటు పాఠశాల  

Updated Date - 2021-05-16T05:11:17+05:30 IST