బోధన సాగక..వేతనాలు అందక..

ABN , First Publish Date - 2021-05-07T03:32:58+05:30 IST

కరోనా సెకండ్‌ వేవ్‌ విజృంభణతో ప్రైవేటు విద్యాసంస్థల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయుల జీవనం అగమ్య గోచరంగా మారింది. గత ఏడాదిలాఆగే ఈ ఏడాదీ

బోధన సాగక..వేతనాలు అందక..

 అగమ్య గోచరంగా ప్రైవేటు ఉపాధ్యాయులు

 రెండో ఏడాదీ పాఠశాలల మూత

 కరోనా సెకండ్‌వేవ్‌తో కోలుకోలేని దెబ్బ

 ప్రభుత్వం ఆదుకోవాలని వినతులు

సంగం, మే 6: కరోనా సెకండ్‌ వేవ్‌ విజృంభణతో ప్రైవేటు విద్యాసంస్థల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయుల జీవనం అగమ్య గోచరంగా మారింది. గత ఏడాదిలాఆగే ఈ ఏడాదీ పాఠశా లలు మూతపడడంతో అరకొర జీతంతో పనిచేసే బోధన, బోధనేతర సిబ్బందిపై కోలుకోలేని దెబ్బ తగిలింది. జిల్లా వ్యాప్తంగా వేల మంది జీవనోపాధి కోల్పోయారు. జిల్లావ్యాప్తంగా ప్రభుత్వ గుర్తింపు పొందిన ప్రైవేటు పాఠశాలలు వెయ్యి వరకు ఉన్నాయి. వీటిలో సుమారు 50 వేల మందికి పైగా బోధన, బోధనేతర సిబ్బంది పనిచేస్తున్నారు. వీరితోపాటు పాఠశాలల వాహన డ్రైవర్లు, ఆయాలు, వాచ్‌మెన్‌లు కూడా ఉన్నారు. ఈ ఏడాది ఆలస్యంగా ప్రారంభమైన విద్యా సంవత్సరం మూడు నెలలు ముగియకుండానే ముగిసింది. గత నెల 20వ తేదీన 1 నుంచి 9 తరగతుల వరకు విద్యా సంవత్సరం ముగిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఇక మే 1 నుంచి 30 వరకు పదవ తరగతికి కూడా సెలవులు ప్రకటించింది. దీంతో పాఠశాలలు పూర్తిగా మూతపడ్డాయి. ప్రభుత్వం అమ్మఒడి కింద నగదు జమచేసినా తల్లిదండ్రులు మాత్రం కరోనా సాకుగా చూపి ఫీజులు చెల్లించట్లేదు. దాంతో గ్రామీణ ప్రాంతాల్లోని ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు జీతాలు చెల్లించిన దాఖలాలు లేవు. పెద్దపెద్ద కార్పొరేట్‌ విద్యాసంస్థల్లో ఫీజులను ముక్కు పిండి వసూలు చేస్తూనే సిబ్బంది జీతాల్లో భారీగా కోత విధించారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పాఠశాలలు మూతపడడం తో వేతనాలు లేక కుటుంబపోషణ కష్టంగా మారింది. ప్రభుత్వం స్పందించి ప్రైవేటు బోధన, బోధనేతర సిబ్బందికి ఒక్కొక్కరికీ నెలకు రూ.5 వేల ఆర్థిక సాయం అందించాలని వేడుకుంటున్నారు.

Updated Date - 2021-05-07T03:32:58+05:30 IST