‘ఉక్కు’ను ప్రైవేటీకరిస్తే సహించేది లేదు

ABN , First Publish Date - 2022-08-09T05:53:32+05:30 IST

ప్రాణ త్యాగాలు, పోరాటాల ఉద్భవించిన విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను ప్రైవేటు వ్యక్తులకు అప్పగిస్తే సహించేది లేదని కేంద్ర ప్రభుత్వాన్ని జాతీయ పౌర హక్కుల సంఘ నాయకుడు ప్రొఫెసర్‌ హరగోపాల్‌ హెచ్చరించారు.

‘ఉక్కు’ను ప్రైవేటీకరిస్తే సహించేది లేదు
రిలే నిరాహార దీక్షా శిబిరంలో హరగోపాల్‌, నాయకులు

జాతీయ పౌర హక్కుల సంఘ నాయకుడు ప్రొఫెసర్‌ హరగోపాల్‌

కూర్మన్నపాలెం, ఆగస్టు 8: ప్రాణ త్యాగాలు, పోరాటాల ఉద్భవించిన విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను ప్రైవేటు వ్యక్తులకు అప్పగిస్తే సహించేది లేదని కేంద్ర ప్రభుత్వాన్ని జాతీయ పౌర హక్కుల సంఘ నాయకుడు ప్రొఫెసర్‌ హరగోపాల్‌ హెచ్చరించారు. స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణను నిరసిస్తూ ఉక్కు కార్మికులు కూర్మన్నపాలెం గేటు వద్ద చేపట్టిన రిలే నిరాహార దీక్షల శిబిరాన్ని సోమవారం ఆయన సందర్శించారు. ఉక్కు కార్మికుల పోరాటానికి మద్దతు ప్రకటించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ రంగ సంస్థల వల్లే అన్ని వర్గాల వారికి సముచిత స్థానం లభిస్తోందన్నారు. దేశ సంపదను పెంచ డంలో ప్రభుత్వం రంగ సంస్థలు కీలక పాత్రలు పోషిస్తున్నాయన్నారు. ప్రపంచమంతా ఆర్థిక మాంద్యంతో అతలాకుతలమవుతుంటే భారతదేశంలోని ప్రభుత్వ రంగ సంస్థలు నిలబడగలిగాయన్నారు. దళిత, బలహీన వర్గాలవారి సంక్షేమాన్ని విస్మరించిన కేంద్ర ప్రభుత్వం బడా పారిశ్రామికవేత్తలకు దేశ సంపదను దోచిపెడుతుండడం దుర్మార్గమన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు డి.ఆదినారాయణ, రామారావు, వైటీ దాస్‌, పరంధామయ్య, బి.వెంకటరావు, మహాలక్ష్మినాయుడు, వై.మస్తానప్ప, రామ్మోహన్‌కుమార్‌, తదితరులు పాల్గొన్నారు.

543వ రోజుకు చేరిన దీక్షలు

సమస్యలు పరిష్కారం కావాలంటే ప్రజా ఉద్యమాలు మరింత బలోపేతం కావాలని ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ నాయకుడు మంత్రి రాజశేఖర్‌ పేర్కొన్నారు. కూర్మన్నపాలెంలో చేపట్టిన రిలే నిరాహార దీక్షలు సోమవారం నాటికి 543వ రోజుకు చేరాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘ఉక్కు’కు సొంత గనులు కేటాయిస్తే మరింత పురోభివృద్ధి సాధిస్తుందని, అలాంటి కల్పతరువైన ప్రభుత్వ రంగ సంస్థను ప్రైవేటీకరణ చేయాలన్న దుర్బుద్ధి కేంద్ర ప్రభుత్వానికి కలగడం అవివేకమన్నారు. 


Updated Date - 2022-08-09T05:53:32+05:30 IST