Priyanka Gandhi: బారికేడ్ ఎక్కిన ప్రియాంకగాంధీ.. నిర్బంధించిన పోలీసులు

ABN , First Publish Date - 2022-08-05T22:09:55+05:30 IST

నిరుద్యోగం, ధరల పెరుగుదలను నిరసిస్తూ దేశ రాజధాని ఢిల్లీలో కాంగ్రెస్ చేపట్టిన ఆందోళన తీవ్ర ఉద్రిక్తతకు

Priyanka Gandhi:  బారికేడ్ ఎక్కిన ప్రియాంకగాంధీ.. నిర్బంధించిన పోలీసులు

న్యూఢిల్లీ: నిరుద్యోగం, ధరల పెరుగుదలను నిరసిస్తూ దేశ రాజధాని ఢిల్లీలో కాంగ్రెస్ చేపట్టిన ఆందోళన తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. పార్టీ ప్రధాన కార్యాలయం బయట ఆందోళనకు దిగిన కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంకగాంధీ వాద్రా(Priyanka Gandhi Vadra) సహా ఇతర నేతలను పోలీసులు బలవంతంగా బస్సులోకి ఎక్కించి నిర్బంధించారు. ఇతర కాంగ్రెస్ నేతల్లాగే నల్లటి దుస్తులు ధరించిన ప్రియాంక గాంధీ.. తాను కూర్చుని నిరసన తెలపాలనుకున్న ప్రదేశానికి వెళ్లేందుకు బారికేడ్లు ఎక్కారు. అయితే, శాంతిభద్రతల దృష్ట్యా ఆమె ఆందోళనకు అనుమతి ఇవ్వని పోలీసులు ప్రియాంకను నిర్బంధంలోకి తీసుకున్నారు. 


అంతకుముందు ఆందోళన విరమించాల్సిందిగా పోలీసులు ఆమెను బతిమాలారు. అయితే, నిరసన తెలిపే హక్కు తనకు ఉందన్న ప్రియాంక ఆందోళనను విరమించేందుకు నిరాకరించారు. ఈ సందర్భంగా ప్రియాంక మాట్లాడుతూ.. వందేళ్లుగా ఇటుకఇటుక పేర్చుకుంటూ భారత్ నిర్మించిన దానిని ఇప్పుడు మన కళ్ల ముందే నాశనం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దీనికి వ్యతిరేకంగా ఎవరైనా నిలబడినా, మాట్లాడినా దారుణంగా దాడి చేస్తున్నారని, జైలుపాలు చేస్తున్నారని, అరెస్టులు చేస్తున్నారని, కొడుతున్నారని ఆరోపించారు.


ప్రియాంక వ్యాఖ్యలను బీజేపీ తిప్పికొట్టింది. అసలు కాంగ్రెస్ పార్టీలోనైనా ప్రజాస్వామ్యం ఉందా? అని ప్రశ్నించింది. కాంగ్రెస్ పార్టీని వారసత్వం పార్టీగా అభివర్ణించింది. ఆందోళనకు ముందు సోనియాగాంధీ (sonia gandhi), రాహుల్ గాంధీ(rahul gandhi) నేతృత్వంలోని ఎంపీలు నల్లని దుస్తుల్లో పార్లమెంటుకు చేరుకున్నారు. ప్రజా సమస్యలను విస్మరిస్తున్నారని, దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపిస్తూ సభా కార్యకలాపాలకు అంతరాయం కలిగించారు. 





Updated Date - 2022-08-05T22:09:55+05:30 IST