ఉత్తర ప్రదేశ్‌లో కాంగ్రెస్ పునరుజ్జీవానికి ప్రియాంక గాంధీ నివేదిక!

ABN , First Publish Date - 2022-04-30T22:28:06+05:30 IST

రాజకీయంగా అత్యంత కీలకమైన Uttar Pradeshలో కాంగ్రెస్‌కు పునర్వైభవం

ఉత్తర ప్రదేశ్‌లో కాంగ్రెస్ పునరుజ్జీవానికి ప్రియాంక గాంధీ నివేదిక!

లక్నో : రాజకీయంగా అత్యంత కీలకమైన Uttar Pradeshలో కాంగ్రెస్‌కు పునర్వైభవం తేవడం కోసం ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా ఓ నివేదికను రూపొందించారు. ఆమె రాష్ట్ర కాంగ్రెస్ నాయకత్వంతో చర్చలు జరుపుతున్నారు. ఈ నివేదికలో మూడు ఆప్షన్లను పొందుపరచి, పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ అనుమతి కోసం పంపించినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. 


ఇటీవల జరిగిన శాసన సభ ఎన్నికల్లో 403 నియోజకవర్గాల్లో కేవలం రెండు స్థానాలు, 2.33 శాతం ఓట్లు కాంగ్రెస్‌కు లభించాయి. 2012లో జరిగిన శాసన సభ ఎన్నికల నుంచి ఆ పార్టీ క్షీణత ప్రారంభమైంది. అప్పట్లో 28 స్థానాలను గెలుచుకుని, 11.63 శాతం ఓట్లను పొందగలిగింది. 2017లో జరిగిన ఎన్నికల్లో సమాజ్‌వాదీ పార్టీతో కలిసి పోటీ చేసిన కాంగ్రెస్ ఏడు స్థానాలను, 6.56 శాతం ఓట్లను పొందగలిగింది. 


విశ్వసనీయ వర్గాలు జాతీయ మీడియాకు తెలిపిన వివరాల ప్రకారం, Priyanka Gandhi Vadra రూపొందించిన నివేదికలోని మొదటి ఆప్షన్ ఏమిటంటే, పార్టీలోని కొందరు సీనియర్ నేతల పర్యవేక్షణలో ఉత్తర ప్రదేశ్ కాంగ్రెస్ విభాగాన్ని పునర్వ్యవస్థీకరించడం. రెండో ఆప్షన్ ఏమిటంటే, పార్టీ వ్యవస్థను క్షేత్ర స్థాయి నుంచి పునరుజ్జీవింపజేయడం కోసం రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడి నేతృత్వంలో నలుగురు లేదా ఐదుగురు వర్కింగ్ ప్రెసిడెంట్లను నియమించడం. మూడో Option ఏమిటంటే, ఉత్తర ప్రదేశ్‌ను పశ్చిమ యూపీ, తూర్పు యూపీ, అవధ్, బుందేల్‌ఖండ్‌ అనే నాలుగు ప్రధాన ప్రాంతాలుగా విభజించడం. 


ఈ ఆప్షన్ల గురించి ప్రియాంక గాంధీ ఉత్తర ప్రదేశ్ కాంగ్రెస్ నేతలతో చర్చించారని ఆ పార్టీ సీనియర్ నేత ఒకరు జాతీయ మీడియాకు తెలిపారు. ఈ ఆప్షన్లను సోనియా గాంధీ పరిశీలనకు పంపినట్లు తెలిపారు. 2024 లోక్‌సభ ఎన్నికలనాటికి వీటిలో ఏ ఆప్షన్‌కు అధిష్ఠాన వర్గం ఆమోదం లభిస్తుందో చూడాలన్నారు. 


Updated Date - 2022-04-30T22:28:06+05:30 IST