సడలని, చెదరని సత్యాగ్రహం : ప్రియాంక గాంధీ వాద్రా

ABN , First Publish Date - 2021-11-26T20:25:08+05:30 IST

భారత దేశ రైతులు ఎల్లప్పుడూ విజేతలేనని కాంగ్రెస్

సడలని, చెదరని సత్యాగ్రహం : ప్రియాంక గాంధీ వాద్రా

న్యూఢిల్లీ : భారత దేశ రైతులు ఎల్లప్పుడూ విజేతలేనని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా అన్నారు. భవిష్యత్తులో కూడా రైతుల విజయాలు కొనసాగుతాయన్నారు. సాగు చట్టాలకు వ్యతిరేకంగా రైతులు నిర్వహిస్తున్న నిరసన కార్యక్రమాలకు నవంబరు 26తో ఏడాది పూర్తయిన సందర్భంగా ఆమె ట్విటర్ వేదికగా రైతులను ప్రశంసించారు. 


రైతులు నిర్వహిస్తున్న ఉద్యమం సడలని, చెదరని సత్యాగ్రహంగా చరిత్రలో నిలిచిపోతుందని ప్రియాంక పేర్కొన్నారు. 700 మంది రైతులు ఆత్మబలిదానం చేసుకున్నారని, దయాదాక్షిణ్యాలు లేని బీజేపీ ప్రభుత్వ దురహంకారం, రైతులపై ఆ ప్రభుత్వ దురాగతాలు ఎన్నటికీ గుర్తుండిపోతాయని తెలిపారు. భారత దేశంలో రైతులు గతంలో, వర్తమానంలో, భవిష్యత్తులో విజేతలేనన్నారు. రైతుల పోరాటానికి విజయం దక్కడమే దీనికి రుజువు అని చెప్పారు. సాగు చట్టాలను రద్దు చేస్తున్నట్లు ప్రధాని మోదీ ప్రకటించడంతోపాటు దీనికి సంబంధించిన బిల్లుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలపడాన్ని ఆమె పరోక్షంగా ప్రస్తావించారు. 


కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు సాగు చట్టాలకు వ్యతిరేకంగా గత ఏడాది నవంబరు 26 నుంచి రైతులు నిరసన తెలుపుతున్న సంగతి తెలిసిందే. పంజాబ్, హర్యానా రాష్ట్రాల రైతులు ఢిల్లీ సరిహద్దుల్లో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. 


Updated Date - 2021-11-26T20:25:08+05:30 IST