‘kill Switch’ తో ఉబర్ దొంగాట.. Uber Files బహిర్గతం

ABN , First Publish Date - 2022-07-11T20:26:39+05:30 IST

ట్యాక్సీ సర్వీసుల దిగ్గజం ఉబర్ (Uber) అనైతిక, చట్టవిరుద్ధ చర్యలకు పాల్పడింది. పన్ను సోదాలు (Tax Raids) వంటి కఠిన నియంత్రణ చర్యల నుంచి తప్పించుకునేందుకు VPN(వర్చువల్ ప్రైవేటు నెట్‌వర్క్) ఫీచర్ ‘కిల్ స్విచ్’ (Kill Switch)ని వాడింది.

‘kill Switch’ తో ఉబర్ దొంగాట.. Uber Files బహిర్గతం

న్యూఢిల్లీ :  రైడ్ షేరింగ్ సర్వీసుల దిగ్గజం ఉబర్ (Uber) అనైతిక, అక్రమ చర్యలకు పాల్పడింది. పన్ను సోదాలు (Tax Raids), సమాచార సేకరణ వంటి కఠిన నియంత్రణ చర్యల నుంచి తప్పించుకునేందుకు వర్చువల్ ప్రైవేటు నెట్‌వర్క్ ఫీచర్ అయిన ‘కిల్ స్విచ్’ (Kill Switch)ని వాడినట్టు బహిర్గతమైంది. కిల్ స్విచ్ వినియోగిస్తే తనిఖీలు లేదా ఇతర నియంత్రణ చర్యలు, అత్యవసర సమయాల్లో కంప్యూటర్లు వాటంతటవే షట్‌డౌన్ అవుతాయి. తద్వారా అధికారులకు సమాచారం లభించదు. ఇందుకోసం తొలుత ‘కాస్పర్’ (Casper).. ఆ తర్వాత ‘రిప్లే’(Ripley) సాఫ్ట్‌వేర్‌లను ఉబర్ ఉపయోగించినట్టు లీకైన ఈ-మెయిల్స్ ‘ఉబర్ ఫైల్స్’(Uber Files) బయటపడ్డాయి. 2013-17 మధ్యకాలంలో ఉబర్‌కు  సంబంధించిన 124,000 డాక్యుమెంట్లను బ్రిటన్ డైలీ ‘ది గార్డియన్’ (The Gardian) సేకరించింది. ఈ సమాచారాన్ని ఇంటర్నేషనల్ కన్సార్టియం ఆఫ్ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్స్‌(ICIJ)తో పంచుకోవడంతో వివరాలు వెల్లడయ్యాయి.


లీకైన డేటా ప్రకారం.. 2014 -16 మధ్యకాలంలో ప్రపంచవ్యాప్తంగా వేర్వేరు నగరాల్లో 13 సార్లు ‘కిల్ స్విచ్‌ని ఉబర్ వాడింది. భారత్‌లోని న్యూఢిల్లీతోపాటు ఆమ్‌స్టర్‌డామ్, మోంట్రియల్, హాంగ్‌కాంగ్, బుడాపెస్ట్, లియోన్, పారీస్ నగరాల్లో ఉపయోగించారు. సెప్టెంబర్ 2015లో ఆమ్‌స్టర్‌డామ్‌లో ఉపయోగించినప్పుడు స్వయానా ఉబర్ సహవ్యవస్థాపకుడు ట్రావీస్ కలనిక్ ఆదేశాలు ఇచ్చారని తేలింది. మార్చి 2015లో బ్రస్సెల్స్‌లో ఉబర్ ఆఫీస్‌పై ట్యాక్స్ సోదాల సమయంలో కిల్ స్విచ్ ఉపయోగించాలని భావించారు. కానీ అంతకంటే ముందే అధికారులు కంప్యూటర్లను సీజ్ చేసినట్టు మెయిల్స్ ద్వారా బయటపడింది. ఇక ఉబర్-బెల్జియం వ్యాట్- రిటర్న్ నిబంధనలను అతిక్రమించిందని స్పెషల్ ట్యాక్స్ ఆఫీసర్లు పేర్కొన్నారు.


భారత్‌లో 2015 ఫిబ్రవరిలో వినియోగం..

భారత్‌లో 10 ఫిబ్రవరి 2015న కిల్ స్విచ్‌ని ఉబర్ వాడినట్టు లికైన ఈ-మెయిల్స్ ద్వారా తెలిసింది. 2014 చివరిలో న్యూఢిల్లీలో ఉబర్ క్యాబ్‌లో అత్యాచారం జరిగింది. అనంతరం ఉబర్‌కు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళనలు జరిగాయి. దీంతో ఢిల్లీ నగరంలో ఉబర్ సర్వీసులపై కొంతకాలం నిషేధం కూడా విధించారు. ఈ పరిణామం జరిగిన 2 నెలల తర్వాత భారత్‌లో కిల్ స్విచ్‌ని ఉబర్ ఉపయోగించినట్టు తేలింది. భారతీయ అధికారులకు ఉబర్ డేటా లభించకుండా ఏవిధంగా వ్యవహరించాలో ఉబర్ మేనేజర్ రొబ్ వాండెర్ వూండే ఇండియన్ ఉబర్ ఎగ్జిక్యూటివ్‌లకు సూచించారు. ‘ భారత్‌లో జరిగిన ఘటన విషయంలో ఢిల్లీ ఉబర్ టీం సాధ్యమైనంత సహకారం అందించాలి. విషయాన్ని బీవీ(నెదర్లాండ్‌లోని ఓ కంపెనీ)కి మళ్లించండి. సమాచారం కావాలంటూ అధికారులు కోరినప్పుడు మనం కంప్యూటర్లను షట్‌డౌన్ చేస్తాం. ఇలా చేస్తే అధికారులు సమాచారం సేకరించడం సాధ్యపడదు. నెదర్లాండ్‌లోని బీబీ రిప్రజెంటేటివ్‌తో మాట్లాడాలని అధికారులకు సూచిస్తాం’ అని ఈ-మెయిల్‌లో పేర్కొన్నారు.

Updated Date - 2022-07-11T20:26:39+05:30 IST