వివాదానికి తెర

ABN , First Publish Date - 2022-09-24T06:05:46+05:30 IST

నూజివీడు మండలం రావిచర్ల, పాత రావిచర్ల సరిహద్దుల విభజన సమస్య ఎట్టకేలకు పరిష్కారమైంది.

వివాదానికి తెర
గ్రామాల సరిహద్దు విభజనపై చర్చిస్తున్న ఇరు గ్రామాల ప్రజలు

 కలెక్టర్‌ ఆదేశాలతో గ్రామాల సరిహద్దు సమస్య పరిష్కారం

 ఉమ్మడిగా పెద్దచెరువు

ఆదాయం ఇరు గ్రామాలకు పంచేలా తీర్మానం


నూజివీడు టౌన్‌, సెప్టెంబరు 23: నూజివీడు మండలం రావిచర్ల, పాత రావిచర్ల సరిహద్దుల విభజన సమస్య ఎట్టకేలకు పరిష్కారమైంది. జిల్లాస్థాయి స్పందన కార్యక్రమంలో గ్రామాల సరిహద్దు విభజన అంశమై నెలకొన్న ప్రతిష్ఠంభన విషయాన్ని పరిష్కరించాలని కోరుతూ పాతరావిచర్ల సర్పంచ్‌ బసవరాజు అన్నపూర్ణ, జనసేన ఉమ్మడి కృష్ణాజిల్లా అధికార ప్రతినిధి మరీదు శివరామకృష్ణ వేర్వేరుగా ఏలూరు జిల్లా కలెక్టర్‌ ప్రసన్న వెంకటేశ్‌కు వినతి పత్రాలు అందించారు. దీంతో కలెక్టర్‌ సమస్య పరిష్కరించాలని ఈవోపీఆర్డీ సరస్వతికి సమస్య పరిష్కారానికి హామీ ఇవ్వడంతో శుక్రవారం నూజివీడు తహసీల్దార్‌ కార్యాలయంలో ఇరు గ్రామాల పెద్దలు సమావేశమై సరిహద్దుల వివాదానికి  తెరదించారు. మొత్తం భూములు రావిచర్లకు సుమారు 1900 ఎకరాలు, పాత రావిచర్లకు  1950 ఎకరాలు ఉండగా, పెద్దచెరువు విభజన విషయంలో ప్రతిష్ఠంభన ఏర్పడింది. అయితే పెద్దచెరువును ఇరు గ్రామాలకు ఉమ్మడిగా ఉంచి, దాని ఆదాయాన్ని చెరి సమానంగా పంచుకునేలా తీర్మానం చేశారు. పెద్దచెరువు ఆయకట్టు రావిచర్ల గ్రామస్థులకు ఉండటంతో చెరువు  కట్టలు, తూముల నిర్వహణ రావిచర్ల గ్రామస్థులే చూసుకునే విధంగా తీర్మానం జరగడంతో ఎట్టకేలకు సమస్య పరిష్కారమైంది.  రావిచర్ల సర్పంచ్‌ కాపా శ్రీనివాసరావు, పాతరావిచర్ల మాజీ సర్పంచ్‌ బసవరాజు నగేష్‌, రావిచర్ల గ్రామ పెద్దలు నూజివీడు డీసీ మాజీ చైర్మన్‌ లావు నాగవరప్రసాద్‌, జనసేన ఉమ్మడి కృష్ణాజిల్లా అధికార ప్రతినిధి మరీదు శివరామకృష్ణ, పాత రావిచర్ల ఉప సర్పంచ్‌ బెజవాడ సత్తిబాబు, ఈవోపీఆర్డీ సరస్వతి, మండల సర్వేయర్‌ రవీంద్ర తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-09-24T06:05:46+05:30 IST