నిర్లక్ష్యమే ‘పెద్ద’ జబ్బు

ABN , First Publish Date - 2021-11-09T06:41:07+05:30 IST

జిల్లాలోని రోగులకే కాక, పొరుగు జిల్లాల నుంచి కూడా అత్యవసర వైద్యం కోసం వచ్చే పేదలకు విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రి ఒక్కటే పెద్దదిక్కు

నిర్లక్ష్యమే ‘పెద్ద’ జబ్బు

అన్నీ ఉన్నా.. అక్కరకు రావు

మూలనపడిఉన్న కొత్త మంచాలు 

రూ.లక్షల్లో ప్రజాధనం వృథా 

స్టోర్‌ రూమ్‌లుగా అంబులెన్స్‌ షెడ్లు 

వెయిటింగ్‌ షెడ్‌లో శానిటరీ పరికరాలు 

మరుగుదొడ్లకు తాళాలు 

ప్రభుత్వాసుపత్రిలో నిర్వహణ లోపాలెన్నో 


జిల్లాలోని రోగులకే కాక, పొరుగు జిల్లాల నుంచి కూడా అత్యవసర వైద్యం కోసం వచ్చే పేదలకు విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రి ఒక్కటే పెద్దదిక్కు. రోగులకు మెరుగైన వైద్యసేవలందిస్తూ ప్రాణాలను కాపాడాల్సిన ఈ ఆసుపత్రిని ఇప్పుడు ‘నిర్లక్ష్యం’ జబ్బు పీడిస్తోంది. కార్పొరేట్‌ ఆసుపత్రుల స్థాయిలో మౌలిక సదుపాయాలు, అత్యాధునిక వైద్య పరికరాలు ఉన్నా, వాటిని సద్వినియోగం చేసుకుంటూ రోగులకు మెరుగైన వైద్య సేవలందించాల్సిన ఆసుపత్రి అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ప్రభుత్వ సిద్ధార్థ మెడికల్‌ కాలేజీకి అనుబంధంగా దాదాపు 1500 పడకలతో అతి పెద్ద బోధనాసుపత్రిగా ఘనకీర్తి గడించిన జీజీహెచ్‌లో అడుగడుగునా నిర్వహణ లోపాలే కనిపిస్తున్నాయి. ఆ లోపాలు.. రోగులకు శాపాలుగా పరిణమిస్తున్నాయి. 


(ఆంధ్రజ్యోతి, విజయవాడ) : ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే రోగుల సంఖ్య గణనీయంగా పెరిగింది. ప్రతిరోజూ వెయ్యి నుంచి 1500 మంది వరకు ఔట్‌ పేషెంట్లు, అత్యవసర వైద్యసేవల కోసం వందల సంఖ్యలో రోగులు వస్తున్నారు. సాధారణ, అత్యవసర క్యాజువాలిటీలు నిత్యం రోగులతో కిటకిటలాడుతున్నాయి. అందుకు తగినంత మంది ఎంఎన్‌వోలు, ఎఫ్‌ఎన్‌వోలు లేరు. నడవలేని రోగులను క్యాజువాలిటీకి, వార్డులలోకి తీసుకువెళ్లడానికి కనీసం స్ట్రెచర్లు, వీల్‌ఛైర్లు కూడా అందుబాటులో లేవు. దీంతో నడవలేని రోగులను వారి బంధువులే భుజాలపైన, చేతులపైన మోసుకెళుతున్నారు.


నిరుపయోగంగా కొత్త మంచాలు 

విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో పడకల కొరత తీర్చేందుకు కొనుగోలు చేసిన కొత్త మంచాలివి.. స్ట్రెచర్లు, వీల్‌చైర్లు, సెలైన్‌ బాటిల్స్‌ స్టాండ్లు కూడా వాటితో పాటే పక్కన పడి ఉన్నాయి. దాదాపు ఏడాది క్రితం కొనుగోలు చేసిన వీటిని వినియోగించకుండా మూలనపడేశారు. కొన్ని పరికరాలు అప్పుడే తుప్పు పట్టిపోతున్నాయి. ఓపక్కన ఆసుపత్రికి అత్యవసర వైద్యం కోసం అంబులెన్స్‌లలో తీసుకువస్తున్న రోగులను క్యాజువాలిటీకి, వార్డుల్లోకి తీసుకువెళ్లడానికి స్ట్రెచర్లు, వీల్‌చైర్లు లేక ఇబ్బందులు పడుతుండగా, మరోపక్క రూ.లక్షలు వెచ్చించి కొనుగోలు చేసి కూడా, వీటిని నిరుపయోగంగా మూలన వదిలేయడంఅధికారుల నిర్లక్ష్యానికి నిలువెత్తు నిదర్శనం. 


ప్రైవేటు సంస్థకు రోగుల విశ్రాంతి షెడ్డు

ఆసుపత్రి ఓపీ విభాగంలోని రోగులు, వారి సహాయకుల కోసం ఎన్‌ఏబీహెచ్‌ కార్యక్రమంలో భాగంగా రూ.లక్షలు వెచ్చించి నిర్మించిన షెడ్డును ఆసుపత్రిలో శానిటేషన్‌ కాంట్రాక్టు నిర్వహిస్తున్న ప్రైవేటు సంస్థకు అప్పగించేశారు. దీంతో ప్రతిరోజూ ఓపీ విభాగం వద్ద పడిగాపులు పడుతున్న వందలాది మంది ఔట్‌పేషెంట్లు కూర్చునేందుకు చోటు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రోగుల కోసం నిర్మించిన షెడ్డులో ప్రైవేటు కాంట్రాక్టు సంస్థ పారిశుధ్య నిర్వహణ పరికరాలను దాచుకుంటోంది. రోగుల ప్రయోజనాలను పట్టించుకోని ఆసుపత్రి అధికారుల తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 


అంబులెన్స్‌ షెడ్లలో పాత సామగ్రి

ఎన్‌ఏబీహెచ్‌ పనుల్లో భాగంగానే ఆసుపత్రికి చెందిన అంబులెన్స్‌ల కోసం ఓపీ విభాగం ఎదురుగా రూ.లక్షలు వెచ్చించి నాలుగు షెడ్లను నిర్మించారు. వాటిలో అంబులెన్స్‌లను భద్రపరచకుండా మరమ్మతులకు వచ్చిన పాత సామగ్రిని భద్రపరుస్తున్నారు. దీంతో అంబులెన్స్‌లు ఎప్పటిలాగే ఎండకు ఎండుతూ.. వానకు తడుస్తూ తరచూ మరమ్మతులకు వస్తున్నాయని ఆసుపత్రి వర్గాలే చెబుతున్నాయి.  


మరుగుదొడ్లకు తాళాలు  

ప్రభుత్వాసుపత్రికి వచ్చే రోగుల కోసం ఓపి బ్లాక్‌ ఎదురుగా అంబులెన్స్‌ షెడ్ల పక్కన విజయవాడ మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఆధ్వర్యంలో పే అండ్‌ యూజ్‌ ప్రాతిపదికన ఆఽధునిక మరుగుదొడ్ల (మాడ్యూల్స్‌)ను నిర్మించారు. వాటిని రోగులు వినియోగించుకునే వీలు లేకుండా తాళాలు వేసేశారు. ఈ మరుగుదొడ్ల నిర్వహణ బాధ్యతలను మున్సిపల్‌ కార్పొరేషన్‌ అధికారులే చూస్తున్నారని ఆసుపత్రి అధికారులు చెబుతున్నారు. రోగులకు అక్కరకు రాని ఈ మరుగుదొడ్లు నిర్మించింది ఎందుకో అధికారులకే తెలియాలి.


లోపాలను సరిదిద్దుతాం 

చిన్నచిన్న లోపాలను సరిదిద్దుకుంటూ రోగులకు మెరుగైన వైద్యసేవలు అందించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నాం. ఆసుపత్రి సూపరింటెండెంట్‌గా కొత్తగా బాధ్యతలు స్వీకరించాను. ఆయా విభాగాల్లో సమస్యలను గుర్తిస్తున్నాం. బెడ్స్‌, స్ట్రెచర్స్‌, వీల్‌చైర్స్‌ తదితర పరికరాలను వినియోగించేలా చర్యలు తీసుకుంటాం. మరమ్మతులకు గురైన మంచాలు, స్ట్రెచర్లను బయటకు తీయించి.. రోగులకు ఉపయోగపడేలా బాగుచేయించాం. ఆసుపత్రిలోని క్యాజువాలిటీ బ్లాక్‌లో ఉన్న ఎక్యూట్‌ మెడికల్‌ కేర్‌ వార్డులో ప్రస్తుతం 20 పడకలు మాత్రమే ఉన్నాయి. ఈ విభాగాన్ని సోమవారం సూపర్‌ స్పెషాలిటీ బ్లాక్‌లోకి మార్చి.. వార్డు సామర్థ్యాన్ని 30 పడకలకు పెంచాం. ప్లాస్టిక్‌ సర్జరీ విభాగాన్ని కూడా సూపర్‌ స్పెషాలిటీ బ్లాక్‌లోకి తరలించాం. త్వరలోనే ఆసుపత్రి క్యాజువాలిటీ విస్తరణ పనులను ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. ఒక్కొక్కటిగా సమస్యలను పరిష్కరించుకుంటూ.. ఆసుపత్రి మొత్తాన్నీ చక్కదిద్దుతాం. - డాక్టర్‌ వై.కిరణ్‌కుమార్‌, జీజీహెచ్‌ సూపరింటెండెంట్‌



Updated Date - 2021-11-09T06:41:07+05:30 IST