బోరు కొట్టిందా..?

ABN , First Publish Date - 2022-05-23T05:40:36+05:30 IST

బోరు కొట్టిందా..?

బోరు కొట్టిందా..?

సత్ఫలితాలనివ్వని వైఎస్సార్‌ జలకళ

జిల్లాలో రైతుల నుంచి బోర్లకు వచ్చిన దరఖాస్తులు 4,381

బోరువెల్స్‌ డ్రిల్లింగ్‌ వేసినవి 1,297

విద్యుత్‌ కనెక్షన్‌కు సిఫారసు చేసినవి 33

విద్యుత్‌ కనెక్షన్లు ఇచ్చినవి 22

బోర్‌వెల్‌ రాక కొందరు.. వచ్చినా విద్యుత్‌ లేక ఇంకొందరు ఎదురుచూపులు


రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మక బోర్‌వెల్స్‌ పథకం అధికారులకు బోర్‌ కొట్టినట్టుంది. తమకు బోర్లు కావాలని ఎన్టీఆర్‌ జిల్లా మొత్తంగా రైతుల నుంచి 4,381 దరఖాస్తులు వస్తే, ఇప్పటి వరకు పూర్తయినవి 22. అధికారుల నిర్లక్ష్యం, క్షేత్రస్థాయిలో అలక్ష్యం వెరసి వైఎస్సార్‌ జల‘కళ’ తప్పుతోంది.


(ఆంధ్రజ్యోతి, విజయవాడ) : రైతులకు సాగునీటి అవసరాల కోసం వైఎస్సార్‌ జలకళ పేరుతో బోరువెల్స్‌కు శ్రీకారం చుట్టారు. అయితే, ఈ పథకం క్షేత్రస్థాయిలో విజయవంతం కాలేదు. ఎన్టీఆర్‌ జిల్లాలో ఇప్పటివరకు వీఆర్వో అనుమతిచ్చిన బోర్‌వెల్‌ దరఖాస్తులు 4,381. ఇందులో జగ్గయ్యపేట నియోజకవర్గంలో 711, మైలవరంలో 1,179, నందిగామలో 1,956, తిరువూరులో 535 దరఖాస్తులు వచ్చాయి. వీటన్నింటికీ వీఆర్వో అనుమతి పూర్తయింది. వీటిలో కాంట్రాక్టర్‌కు కేవలం 2,659 బోర్‌వెల్స్‌ దరఖాస్తులే పంపారు. దీనిపై ఆయన సర్వే చేస్తున్నారు. 1,297 మంది రైతుల దరఖాస్తులకు సంబంధించి మాత్రమే డ్రిల్లింగ్‌ చేశారు. ఈ లెక్కల ప్రకారం 33 శాతం మేర కూడా బోర్లను తవ్వలేని పరిస్థితి ఏర్పడింది. ఇప్పటివరకు వేసిన బోర్లలో జగ్గయ్యపేట నియోజకవర్గంలో 54, మైలవరంలో 550, నందిగామలో 615, తిరువూరులో 78 మాత్రమే ఉన్నాయి. గ్రామస్థాయిలో వీఆర్వోలు అనుమతులిచ్చాక ఉన్నతాధికారులు సకాలంలో వివరాలు కాంట్రాక్టరుకు పంపడం లేదని స్పష్టమవుతోంది. ఎందుకంటే ఇంకా ఉన్నతాధికారుల స్థాయిలోనే వెయ్యికిపైగా దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. 

రైతులకు ఇబ్బందులు

సాగునీటి అవసరాల కోసం రైతులు పెద్దఎత్తున దరఖాస్తులు చేసుకుంటుంటే, క్షేత్రస్థాయిలో ఆ లక్ష్యం నెరవేరట్లేదు. చెంతనే కృష్ణానది ఉన్నా ఎన్టీఆర్‌ జిల్లాలో సాగునీటి అవసరాల కోసం రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తిరువూరు, మైలవరం, జగ్గయ్యపేట, నందిగామ.. ఈ నాలుగు నియోజకవర్గాలు కూడా అప్‌ల్యాండ్స్‌గా ఉండటంతో సాగునీటి కొరతను ఎదుర్కొంటున్నాయి. అందుకే వేదాద్రిలో లిఫ్ట్‌ ఇరిగేషన్‌ స్కీమ్‌కు ప్రతిపాదించినా ఇప్పటి వరకు కొలిక్కి రాలేదు. ప్రభుత్వం ‘వైఎస్సార్‌ జలకళ’ పేరుతో బోర్‌వెల్స్‌కు శ్రీకారం చుట్టడంతో ఎన్టీఆర్‌ జిల్లా రైతులు పెద్దసంఖ్యలో బోర్ల డ్రిల్లింగ్‌ కోసం దరఖాస్తు చేసుకుంది. అయినప్పటికీ వారి ఆశలు అడియాసలే అయ్యాయి.

బోర్లు వేసినా కరెంట్‌ లేదు

వైఎస్సార్‌ జలకళ పథకంలో భాగంగా జిల్లాలో 1,297 బోర్‌వెల్స్‌కు డ్రిల్లింగ్‌ చేశారు. అయితే, వీటిలో విద్యుత్‌ సదుపాయం కోసం కేవలం 482 మాత్రమే మంజూరయ్యాయి. వీటిలో విద్యుత్‌ శాఖకు 33 మాత్రమే బదలాయించారు. విద్యుత్‌ శాఖ 22 బోర్‌వెల్స్‌కు కనెక్షన్‌ ఇచ్చింది. మిగతా ప్రతిపాదనలు కూడా పంపిస్తే, ఆ శాఖ వెంటనే పనులు చేపట్టే అవకాశం ఉంది. జిల్లా యంత్రాంగం నిర్లక్ష్యం కారణంగా దాదాపు 1,300 బోర్‌వెల్స్‌ వేసినప్పటికీ విద్యుత్‌ కనెక్షన్‌ ఇచ్చినవి 22 మాత్రమే ఉండటంతో అవి మాత్రమే రైతులకు అందుబాటులోకి వచ్చాయి. దరఖాస్తు చేసుకున్న వందలాది మంది రైతులు బోర్‌వెల్స్‌ కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు. బోర్‌వెల్స్‌ వేసిన కొంతమంది రైతులు తమకెప్పుడు విద్యుత్‌ కనెక్షన్‌ ఇస్తారోనని చూస్తున్నారు.

Updated Date - 2022-05-23T05:40:36+05:30 IST