అడవి బిడ్డల ఆత్మఘోష

ABN , First Publish Date - 2022-08-09T06:26:09+05:30 IST

అడవినే నమ్ముకుని జీవనం సాగిస్తున్న ఆదివాసీ బిడ్డలు నేటికీ అభివృద్ధికి ఆమడదూరంలో ఉన్నారు.

అడవి బిడ్డల ఆత్మఘోష
విద్యుత్‌ సౌకర్యం లేని మోదేలు గ్రామం

అభివృద్ధికి ఆమడదూరంలో ఆదివాసీలు

తరాలు మారినా తలరాతలు మారడం లేదు

హామీలు తప్ప అమలుకాని వాగ్దానాలు

రహదారి,విద్యుత్‌ సౌకర్యం లేని గ్రామాలెన్నో..

బుట్టాయగూడెం, ఆగస్టు 8 : అడవినే నమ్ముకుని జీవనం సాగిస్తున్న ఆదివాసీ బిడ్డలు నేటికీ అభివృద్ధికి ఆమడదూరంలో ఉన్నారు. తరాలు మారుతున్నా వారి తలరాతలు మారడం లేదు. పాలకులు, ప్రభుత్వాలు, అధికారులు మారుతున్నారు గిరిజనుల బాగోగులు పట్టించు కున్నవారు లేరు. ఏజెన్సీ ఐదు మండలాల్లో 411 గ్రామాలు ఉండగా 125 గ్రామాల్లో కొండరెడ్లు మిగిలిన గ్రామాల్లో గిరిజనులు నివాసముంటున్నారు. కొండరెడ్లు పూర్తిగా అడవిపైన, పోడు వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తుంటారు. అటవీ ఉత్పత్తుల సేకరణ, వెదురు పనులు ప్రధానం. నేటికి అనేక కొండరెడ్డి గ్రామాలకు బయట ప్రపంచంతో సంబంధాలు తక్కువే. అత్యవసరమైతే తప్పా కొండలు దిగి కిందికిరారు. బయటకు రావాలంటే పెద్ద సాహసాలే చేయాలి. కాలినడకన తప్ప ద్విచక్ర వాహనం కూడా వెళ్లని గ్రామాలున్నాయి. కనీసం మందుబిళ్ళ కావాలంటే కొండలు దాటాలి. మెరుగైన వైద్యం అందని ద్రాక్షే. తమ సమస్యలు పరిష్కరించాలని ఇప్పటికీ ఆది వాసీలు ఐటీడీఏను ముట్టడి స్తూనే ఉన్నారు. ఐటీడీఏ పరిధిలో 29 శాఖలకు పైగా పనిచేస్తున్నా ఆదివాసీలను సమస్యలు వెంటాడుతూనే ఉన్నాయి.   


పరిష్కారం లేని సమస్యలెన్నో

నేటికి పశ్చిమ ఏజెన్సీలో రహదారులు, విద్యుత్‌ సౌకర్యంలేని గ్రామాలున్నాయి.  పుంతదారులే కొండరెడ్డి గిరిజనులకు రహదారులు. ఏజెన్సీ ఐదు మండలాల్లో పదుల సంఖ్యలో గ్రామాలకు రోడ్లు లేవు.అటవీ ప్రాంతంలోని పలు కొండరెడ్డి గ్రామాలకు ఈనాటికి విద్యుత్‌ సదుపాయం లేదు.విద్యుత్‌ చూడాలంటే  మైళ్ల కొలదీ నడిచి ఇతర గ్రామాలకు రావాలి.  

ఏజెన్సీలోని గిరిజనులకు మెరుగైన వైద్యం అందని ద్రాక్షగానే మారింది.  పీహెచ్‌సీలు, సీహెచ్‌సీల్లో పూర్తి స్థాయిలో సిబ్బంది లేరు.మలేరియా వచ్చిందంటే ఇల్లు గుల్ల కావలసిందే. కొద్దిపాటి రక్తపరీక్షలు తప్ప మరిన్ని వైద్య పరీక్షలు కావాలంటే ప్రవేటు వైద్యాన్ని ఆశ్రయించక తప్పదు.  

విద్యార్థుల సంఖ్యకు సరిపడ గదులు లేవు. పలుచోట్ల పాఠశాలలు విలీనంతో గిరిజనులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.బెస్ట్‌ అవైలబుల్‌ స్కూళ్లను రద్దు చేసి గిరిజనులకు కార్పొరేట్‌ విద్యను దూరం చేశారు. గిరిజన విద్యార్థులకు విదేశీ విద్య అవకాశాన్నీ మూడేళ్లపాటు నిలిపేశారు. 

గిరిజనులకు అందించే పథకాలు పూర్తిగా కుదించుకు పోయాయి. చంద్రబాబు ప్రభుత్వంలో గిరిజనులకు అమలైన 18 రకాల అభివృద్ధి, సంక్షేమ పథకాలు రద్దు చేశారని గిరిజన సంఘాలు మండిపడుతున్నాయి.మూడేళ్లుగా ఎస్టీ కార్పొరేషన్‌ ద్వారా ఒక్కరికీ ఒక్క రుణం అందలేదు. కేంద్రం నిధులతో ఎస్టీ నిరుద్యోగుల అభివృద్ధి కోసం ఇచ్చే రవాణా వాహనాలు, ఆటోలు, కార్లు, వారి కోసం భూమి కొనుగోలు పథకం కూడా మూడేళ్లుగా అమలుకు నోచుకోవడం లేదు.

కొండవాగులు ఆదివాసీల పాలిట శాపంగా మారుతున్నాయి. వర్షాకాలంలో అనేక ప్రాంతాల్లో కొండవాగులు ప్రమాదకర స్థాయిని మించి ప్రవహిస్తుంటాయి. ఆది వాసీలతో పాటు అనేక మంది అమాయకుల ప్రాణాలు కొండవాగులు మింగేశాయి. కోట్ల రూపాయలతో ఐటీడీఏ లోలెవల్‌ కల్వర్టులను నిర్మించినా కొట్టుకు పోయాయి. వంతెనలు నిర్మించాలని ఆదివాసీలు కోరుతున్నారు. 

పోలవరం ప్రాజెక్టు నిర్మాణంతో ఏజెన్సీలోని మూడు మండ లాల్లో ఊళ్ళకు ఊళ్ళే ఖాళీ అయ్యాయి. గోదావరి నదిపై ఆధార పడి జీవించే ఆదివాసీలకు బయట ప్రాంతాలకు రావడంతో ఉపాధి లేకుండా పోయింది. వ్యవసాయం చేసుకుందామంటే భూములు లేవు. కాలనీలకు తరలివచ్చిన నిర్వాసిత గిరిజనుల పరిస్థితి జీవన్మరణ సమస్యగా మారింది. నేటికీ పరిహారం అందక నిర్వాసితులు గగ్గోలు పెడుతున్నారు.  

మూడు దశాబ్దాలుగా గిరిజనులు–గిరిజనేతరుల మధ్య పోడుభూముల సమస్య రావణకాష్టంగా రగులుతూనే ఉంది.బాణాలతో దాడులు చేసుకుని ప్రాణాలు తీసుకునే వరకు వచ్చినా అతీగతిలేదు. వేలల్లో భూములు సాగు చేస్తుంటే వందల్లో పట్టాలు ఇచ్చి సరిపెట్టారు.ఆదివాసీలు పట్టాల కోసం ఐటీడీఏ మెట్లు ఎక్కుతూనే ఉన్నారు. 



Updated Date - 2022-08-09T06:26:09+05:30 IST