సమస్యల పరిష్కారంపై ఇంత నిర్లక్ష్యమా!

ABN , First Publish Date - 2022-07-01T06:37:30+05:30 IST

వార్డుల్లో నెలకొన్న సమస్యలపై పరిష్కారంపై అధికారులు నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారని సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

సమస్యల పరిష్కారంపై ఇంత నిర్లక్ష్యమా!

పిఠాపురం కౌన్సిల్‌ సమావేశంలో   సభ్యుల ఆగ్రహం

పిఠాపురం, జూన్‌ 30: వార్డుల్లో నెలకొన్న సమస్యలపై పరిష్కారంపై అధికారులు నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారని సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సమస్యలను వారు ఏకరవు పెట్టారు. పిఠాపురం మునిసిపల్‌ కౌన్సిల్‌ సాధారణ సమావేశం చైర్‌పర్సన్‌ గండేపల్లి సూర్యావతి అధ్యక్షతన పురపాలక సంఘ కార్యాలయంలో గురువారం జరిగింది. పట్టణంలోని వన్‌వే ట్రాఫిక్‌ రోడ్డులో కల్వర్టు మరమ్మతుల నిమిత్తం రూ93వేలు మంజూరు చేసి ఏడాది గడిచిందని, ఇప్పటి వరకూ పనులు చేపట్టలేదని టీడీపీ ఫ్లోర్‌లీడర్‌ అల్లవరపు నగేష్‌ తెలిపారు. అసలు పనులు ఎందుకు జరగడం లేదని ప్రశ్నించారు. పనులు చేయని కాంట్రాక్టర్లను బ్లాక్‌లిస్ట్‌లో పెట్టాలని కోఆప్షన్‌ సభ్యుడు గండేపల్లి బాబీ సహా పలువురు కౌన్పిలర్లు డిమాండ్‌ చేశారు. 14వ ఆర్థిక సంఘం నిధులను వెనక్కి తీసుకురావడం అభినందనీయమని నగేష్‌ తెలిపారు. అయితే పనులు సకాలంలో చేపట్టాలని సూచించారు. రూ.3.67కోట్లు నిధులు అందుబాటులో ఉన్నాయని కమిషనరు రామ్మోహన్‌ చెప్పారు.   కౌన్సిలర్లు  బొజ్జా జగదీశ్వరీ, ముమ్మిడి రత్నసుజిత, అల్లవరపు నగేష్‌లు మాట్లాడుతూ బైపాస్‌రోడ్డులో ప్రమాదాలు అధికంగా జరుగుతున్నాయని, దీని నివారణ చర్యలు తీసుకునేలా పోలీసు, ఎన్‌హెచ్‌ అధికారులకు లేఖలు రాయాలని సూచించారు. అంబేద్కర్‌ సెంటర్‌లో చేపల దుకాణాల వలన దుర్గంధపూరిత వాతావరణం నెలకొందని నగేష్‌ తెలిపారు. కౌన్సిలర్లు పెదపాటి రాజేష్‌, రాయుడు శ్రీను, ముమ్మిడి రత్నసుజితలు మాట్లాడుతూ గోర్స రైల్వేగేటు మూసివేసి 14నెలలు అయిందని, ఇప్పటివరకూ వాటర్‌ పైప్‌లైను, కరెంటు లైన్లు మార్పు పనులు ఎందుకు పూర్తిచేయలేదని ప్రశ్నించారు. డ్రైవర్స్‌కాలనీలో అవుట్‌లెట్‌ డ్రెయినేజీలు లేక ఇబ్బందులు పడుతున్నామని, పారిశుధ్యం అద్వానంగా ఉందని కౌన్సిలరు బోనాసుల శివ తెలిపారు. పార్కుల్లో పందుల బెడద అధికంగా ఉందని, పిచ్చి మొక్కలు పెరిగిపోయాయని రత్నసుజిత చెప్పారు.

ఒంటరి మహిళకు నా గౌరవ వేతనం ఇచ్చేయండి

అన్ని అర్హతలు ఉన్నప్పటికీ తన వార్డు పరిధిలోని చల్లపల్లి రంగనాయకులకు  11నెలల క్రితం ఒంటరి పింఛన్‌ నిలిచిపోయిందని కౌన్సిలరు బోనాసుల శివ తెలిపారు. అతని సోదరుడు పేరు ఆధార్‌ కార్డులో భర్తగా నమోదు కావడంతో ఈ పరిస్థితి ఏర్పడిందని చెప్పారు. పింఛన్‌ పునుర్థరించమని జిల్లా కలెక్టరు, ఇతర అధికారులకు విన్నవించిన ఫలితం లేకపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆమెకు పింఛన్‌ వచ్చేవరకూ తన గౌరవ వేతనం ఇచ్చేయాలని అధికారులకు సూచించారు.

నాలుగురోజులకు ఒకసారి తాగునీటి సరఫరా

 గొల్లప్రోలు నగరపంచాయతీ సమావేశంలో కౌన్సిలర్ల ఆగ్రహం

గొల్లప్రోలు, జూన్‌ 30: పట్టణంలో నాలుగురోజులకు ఒకసారి తాగునీటి సరఫరా చేస్తుండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని కౌన్సిలర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. గొల్లప్రోలు నగరపంచాయతీ కార్యాలయంలో చైర్‌పర్సన్‌ గండ్రేటి మంగతాయారు అధ్యక్షతన గురువారం జరిగిన సాధారణ సమావేశఽంలో 12, 3వ వార్డుల కౌన్సిలర్లు గుళ్ల సుబ్బారావు, మైనం భవానీ రాజాలు మాట్లాడుతూ కనీసం రెండు రోజులకు ఒకసారైనా కుళాయిల ద్వారా నీరు రాకుంటే ప్రజలు అవసరాలు ఎలా తీరతాయని ప్రశ్నించారు. కుళాయిల ద్వారా కలుషితమైన నీరు వస్తున్నదని తెలిపారు. ఫిల్టర్‌బెడ్‌ను ఎందుకు వినియోగంలోకి తీసుకురాలేదన్నారు. రూ5లక్షలతో పిల్టర్‌బెడ్‌ మరమ్మతులు నిర్వహిస్తున్నామని ఏఈ ప్రభాకర్‌ తెలిపారు. తన వార్డులోకి కొంతమంది కౌన్సిలర్లు వచ్చి పనులు చేసిపెడతామంటూ చెబుతున్నట్లు తన దృష్టికి వచ్చిందని 16వ వార్డు కౌన్సిలరు బావిశెట్టి జ్ఞానేశ్వరి తెలిపారు. మా వార్డుల్లోకి ఇతర వార్డుల ప్రతినిధులు రావడం ఎంతవరకూ సమంజసమని ప్రశ్నించారు.  పట్టణంలోని సూరుడు చెరువు గట్టు అధ్వానంగా మారిందని, గోతులు ఉండటంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని వైస్‌చైర్మన్‌ తెడ్లపు అలేఖ్యరాణి తెలిపారు. తక్షణం మరమ్మతులు చేపట్టాలని కోరారు.  కమిషనరు లక్ష్మీపతిరావు మాట్లాడుతూ 14వ ఆర్థిక సంఘానికి సంబంధించి రూ.4కోట్లు వరకూ నిధులు అందుబాటులోకి వచ్చాయని, పనుల నిర్వహణకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.

ప్రజల్లోకి వెళ్లలేకపోతున్నాం

 మున్సిపల్‌ అధికారులపై కౌన్సిల్‌ సభ్యుల గరంగరం

పెద్దాపురం, జూన్‌ 30 : ప్రజా సమస్యలను పరిష్కరించడంలో మున్సిపల్‌ అధికారులు తీరు చాలా దారుణంగా ఉంటోంది, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌, వైస్‌ చైర్మన్లతో పని లేదా, కౌన్సిలర్లుగా మేము చెబుతున్న పనులను సైతం పెడచెవిన పెట్టడంతోపాటు విధుల్లో చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారంటూ మున్సిపల్‌ చైర్‌పర్సన్‌, వైస్‌ చైర్మన్‌, కౌన్సిలర్లు మున్సిపల్‌ కమిషనర్‌, డీఈల పనితీరుపై అసంతృప్తిని వెళ్లగక్కారు. స్థానిక మున్సిపల్‌ కౌన్సిల్‌ సమావేశ మందిరంలో చైర్‌పర్సన్‌ బొడ్డు తులసీ మంగతాయారు అధ్యక్షతన సాధారణ కౌన్సిల్‌ సమావేశం గురువారం వాడీవేడిగా జరిగింది. కౌన్సిలర్‌ అరెళ్ల వీర్రాఘవరావు మాట్లాడుతూ పట్టణంలో పలు రహదారులు గోతులమయంగా ఉంటున్నాయని, దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. అధికార పార్టీలో ఉండికూడా పనులు చేయించుకోలేకపోతున్నామని అసహనం వ్యక్తం చేశారు. అలాగే మున్సిపల్‌ క్వార్టర్స్‌లో బయటి వ్యక్తులు ఉంటున్నారని దీనిపై ఏ చర్యలు తీసుకున్నారని కమిషనర్‌ సురేంద్రను నిలదీశారు. కౌన్సిలర్‌ విజ్జపు రాజశేఖర్‌ మాట్లాడుతూ స్థానిక మెయిన్‌ రోడ్డు వినాయకుడి గుడి దగ్గర గతంలో తొలగించిన మున్సిపల్‌ వ్యాపార సముదాయాలను ఎప్పుడు నిర్మిస్తారని ప్రశ్నించారు. గ్రాంటు లేకపోతే గుడ్‌విల్‌ ఆక్షన్‌ పద్దతిలో నిర్మించే ఏర్పాటుచేయాలన్నారు. అలాగే మరిడమ్మ దేవస్థానం సమీపంలో ఉన్న మున్సిపల్‌ గెస్ట్‌హౌస్‌లో సచివాలయాన్ని కొనసాగించడంపై ఆయన అసహనాన్ని వ్యక్తం చేశారు. గెస్ట్‌ హౌస్‌ను అద్దెకు ఇవ్వడం ద్వారా రోజుకు రూ. రెండు వేలు పైబడి వచ్చే ఆదాయాన్ని పాడుచేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సచివాలయాన్ని తక్షణమే వేరే ప్రదేశానికి మార్చాలని డిమాండ్‌ చేశారు. వీటిపై కమిషనర్‌ సమాధానం సంతృప్తికరంగా లేకపోవడంతో కమిషనర్‌ను ఉద్దేశించి మీపద్దతి మార్చుకోవాలంటే హితవు పలికారు. కౌన్సిలర్‌ త్సలికి సత్యభాస్కరరావు మాట్లాడుతూ తాగునీటి సరఫరా విషయంలో ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తారా అంటూ డీఈ ఆదినారాయణపై ఆగ్రహం వ్యక్తం చేశారు.  ఈకార్యక్రమంలో మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ నెక్కంటి సాయప్రసాద్‌, టీఈవో ఉమామహేశ్వరరావు, శానిటరీ ఇనస్పెక్టర్‌ దీవీదురాజు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-07-01T06:37:30+05:30 IST