సమస్యలు పరిష్కరించాలి: ఫ్యాప్టో

ABN , First Publish Date - 2021-07-24T06:01:19+05:30 IST

దీర్ఘకాలికంగా ఉన్న ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించాలని ఫ్యాప్టో నాయకులు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.

సమస్యలు పరిష్కరించాలి: ఫ్యాప్టో
శ్రీకృష్ణ దేవరాయల విగ్రహం వద్ద ధర్నా చేస్తున్న ఫ్యాప్టో నాయకులు

  1. ఉద్యోగ, ఉపాధ్యాయుల ధర్నా 


కర్నూలు(ఎడ్యుకేషన్‌), జూలై 23: దీర్ఘకాలికంగా ఉన్న ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించాలని ఫ్యాప్టో నాయకులు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ఫ్యాప్టో ఆధ్వర్యంలో శుక్రవారం శ్రీకృష్ణదేవరాయల సర్కిల్‌ వద్ద ఉపాధ్యాయ సంఘాల నాయకులు ధర్నా చేశారు. ఈ సందర్భంగా ఫ్యాప్టో రాష్ట్ర కార్యదర్శి, కర్నూలు జిల్లా ఫ్యాప్టో ఇన్‌చార్జి కె.ప్రకాష్‌రావు మాట్లాడుతూ రాష్ట్రంలో ఉద్యోగులకు ఏడు కరువు భత్యం బకాయిలు పెండింగ్‌లో ఉన్నాయన్నారు. జూలై 2018 నుంచి అమలు కావాల్సిన పీఆర్సీ ఇంత వరకు ఇవ్వలేదన్నారు. సీపీఎస్‌ రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. ఉపాధ్యాయ సమస్యలు పరిష్కారం కాకపోవడంతోనే ఫ్యాప్టో ఉద్యమంలోకి దిగిందన్నారు. ఫ్యాప్టో రాష్ట్ర పరిశీలకుడు తిమ్మన్న మాట్లాడుతూ రాష్ట్రంలో 3, 4, 5 తరగతులను ఉన్నత పాఠశాలలకు తరలించి విద్యార్థులకు ప్రభుత్వం అన్యాయం చేస్తోందన్నారు. యూటీఎఫ్‌ రాష్ట్ర నాయకుడు సురేష్‌ మాట్లాడుతూ ప్రభుత్వ సంక్షేమ పథకాలతో పాటు ఉద్యోగులకు రావాల్సిన బకాయిలు వెంటనే మంజూరు చేయాలని డిమాండ్‌ చేశారు. ఆప్టా రాష్ట్ర నాయకుడు రాజు సాగర్‌ మాట్లాడుతూ ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమాన్ని విస్మరించడం మంచిది కాదన్నారు. ఈకార్యక్రమంలో బీటీఏ రాష్ట్ర సహాధ్యక్షుడు ఆనంద్‌, మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఉపాధ్యాయ సంఘాల నాయకులు రాముడు, ఎస్టీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి గోకారి, ఏపీటీఎఫ్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్‌. ఇస్మాయిల్‌, యూటీఎఫ్‌ నాయకులు జయరాజు, ఆప్టా మధుసూదన్‌ రెడ్డి, డీటీఎఫ్‌ నాయకుడు అల్లాబకాష్‌, ఫ్యాప్టో జిల్లా చైర్మన్‌ సుధాకర్‌, జనరల్‌ సెక్రటరీ రంగన్న, ఆర్థిక కార్యదర్శి సేవ్య నాయక్‌ తదితరులు పాల్గొన్నారు. అనంతరం కర్నూలు తహసీల్దార్‌ వెంకటేష్‌ నాయక్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు.


ఏపీ ఎన్జీవో సంఘం సంఘీభావం


కర్నూలు, జూలై 23 (ఆంధ్రజ్యోతి): ఫ్యాప్టో జిల్లా శాఖ శుక్రవారం చేపట్టిన ధర్నాలో ఏపీ ఎన్జీవో జిల్లా అధ్యక్షుడు వీసీహెచ్‌ వెంగళరెడ్డి పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ ఉపాధ్యాయుల న్యాయమైన కోర్కెలను పరిష్కరించాలని, సీపీఎస్‌ విధానాన్ని వెంటనే రద్దు చేయాలని కోరారు. పదవీ విరమణ పొందిన ఉద్యోగులకు పింఛను వెంటనే విడుదల చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీ ఎన్జీవో జిల్లా కార్యదర్శి జవహర్‌లాల్‌, కర్నూలు నగర అధ్యక్షుడు ఎంసీ.కాశన్న పాల్గొన్నారు.

Updated Date - 2021-07-24T06:01:19+05:30 IST