రైల్వే సమస్యలతో సతమతం

ABN , First Publish Date - 2021-03-01T05:43:45+05:30 IST

దశాబ్దాల కాలంగా ఉన్న రైల్వే సమస్యలతో 89, 91, 92 వార్డుల ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదు. ప్రభుత్వాలు మారుతున్నా చిరకాలంగా ఉన్న రైల్వే సమస్యలు మాత్రం అపరిష్కృతంగానే మిగిలిపోయాయి.

రైల్వే సమస్యలతో సతమతం
89వ వార్డు కొత్తపాలెం- వెంకటాపురం మార్గంలో నిర్మాణానికి నోచుకోని రహదారి

 89, 91, 92 వార్డుల ప్రజలకు తప్పని ఇబ్బందులు

 ఆ శాఖ నుంచి అనుమతులు రాక అభివృద్ధికి ఆటంకం


గోపాలపట్నం, ఫిబ్రవరి 28: దశాబ్దాల కాలంగా ఉన్న రైల్వే సమస్యలతో 89, 91, 92 వార్డుల ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదు. ప్రభుత్వాలు మారుతున్నా చిరకాలంగా ఉన్న రైల్వే సమస్యలు మాత్రం అపరిష్కృతంగానే మిగిలిపోయాయి. 

89వ వార్డులో.. 

ఈ వార్డు రైలు పట్టాల మధ్యలో ఉంటుంది. పరిసర ప్రాంతాలు శరవేగంతో అభివృద్ధి చెందుతున్నా రైల్వే సమస్యల కారణంగా ఈ వార్డు అభివృద్ధికి నోచుకోలేదు. వార్డులోని కొత్తపాలెం, యల్లపువానిపాలెం ప్రాంతాల్లో ఉన్న అండర్‌ పాస్‌వేల వల్ల స్థానికులకు ఇబ్బందులు తప్పడం లేదు. దీంతో పాటు అండర్‌ పాస్‌వేల్లో ఎటువంటి ఇబ్బంది వచ్చినా రైల్వే శాఖ తప్ప జీవీఎంసీ పనులు చేపట్టే అవకాశం లేకపోవడంతో స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు.   కొత్తపాలెం- వెంకటాపురం గ్రామాల మధ్య గల రహదారి రెండు గ్రామాల ప్రజలతో పాటు వేలాది మందికి ప్రత్యామ్నాయ రహదారిగా ఉంది. అయితే ఈ మార్గంలో గల ఐదు మదాల వద్ద రైల్వే సమస్య కారణంగా రహదారి నిర్మాణం చేపట్టలేదు. దీంతో ఈ మార్గం నుంచి రాకపోకలు సాగించాలంటే ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఐదుమదాల కింద రహదారి నిర్మాణం చేపట్టడానికి మూడేళ్ల క్రితం శంకుస్థాపన చేసినా రైల్వే శాఖ నుంచి అనుమతి లేకపోవడంతో ఈ పనులు కూడా నిలిచిపోయాయి. దీంతో ఈ మార్గం నుంచి రాకపోకలు సాగించడం కష్టంగా ఉంది. 


91వ వార్డులో..

ఈ వార్డులో కూడా రైల్వే సమస్య కారణంగా స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు. బీఆర్‌టీఎస్‌ రోడ్డుకు సమాంతరంగా ఉన్న గోపాలపట్నం శ్మశాన వాటిక నుంచి రవీంద్రనగర్‌ మీదుగా బాజీ జంక్షన్‌ను కలిపే రహదారిని గోపాలపట్నం దిగువ ప్రాంతాలకు చెందిన వందలాది మంది వినియోగిస్తున్నారు. బీఆర్‌టీఎస్‌ రోడ్డులో డివైడర్‌ల నిర్మాణం చేపట్టిన తరువాత రహదారిని దాటే వీలు లేకుండా ఉంది. దీంతో దిగువ ప్రాంతాల ప్రజలు పాతగోపాలపట్నం, బాజీ జంక్షన్‌లకు వెళ్లాలంటే ఇదే మార్గాన్ని వినియోగిస్తుంటారు. ఈ మార్గంలో బీటీ రోడ్డు నిర్మాణం చేపట్టడానికి నాలుగేళ్ల క్రితం పనులు ప్రారంభించారు. అయితే రైల్వే అధికారులు రహదారి నిర్మాణానికి అడ్డుచెప్పడంతో నిర్మాణ పనులు నిలిచిపోయాయి. అనుమతుల కోసం స్థానిక నాయకులు ప్రయత్నం చేయకపోవడంతో ఇప్పటికీ ఈ రోడ్డు అలాగే ఉంది.  


92వ వార్డులో..

ఈ వార్డులో కూడా కొంత మేర రైల్వే సమస్యలతో స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు. వార్డు పరిధిలోని శ్రీరామ్‌నగర్‌, ప్రశాంతినగర్‌ కాలనీలు రైల్వే స్థలాలకు ఆనుకుని ఉన్నాయి. దీంతో ఈ కాలనీలకు కూడా పలు సమస్యలు ఉన్నాయి. కాలనీలకు ఆనుకుని సింహాచలం రైల్వే స్టేషన్‌ నుంచి నార్త్‌ సింహాచలం రైల్వే స్టేషన్‌ వరకు గల ప్రధాన రహదారి పూర్తిగా రైల్వే శాఖ అధీనంలో ఉండడంతో ఈ రహదారి గోతులమయం గా ఉన్నా జీవీఎంసీ నుంచి అభివృద్ధి చేయడానికి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. సింహాచలం రైల్వే స్టేషన్‌ నుంచి నార్త్‌ సింహాచలం వెళ్లే ప్రధాన రహదారిని గోపాలపట్నానికి దిగువ ప్రాంతాలకు చెందిన సుమారు 20 గ్రామాలకు చెందిన లక్ష జనాభా వినియోగిస్తుంటారు. వీరితో పాటు గోపాలపట్నం నుంచి నరవ మీదుగా కూర్మన్నపాలెం, సబ్బవరం వెళ్లే ప్రజలు కూడా నిత్యం ఈ మార్గం నుంచి రాకపోకలు సాగిస్తుంటారు. అదే విధంగా నార్త్‌ సింహాచలం రైల్వే స్టేషన్‌ నుంచి గోపాలపట్నం వెళ్లే ప్రయాణికులు, నార్త్‌ సింహాచలం రైల్వే క్వార్టర్స్‌కు చెందిన రైల్వే ఉద్యోగులు, నార్త్‌ సింహాచలం రైల్వే విద్యుత్‌ బస్‌స్టేషన్‌కు వెళ్లేవారు, రైల్వే రన్నింగ్‌ రూమ్‌కు వెళ్లే రైలు డ్రైవర్లు ఈ మార్గం నుంచే నిత్యం రాకపోకలు సాగిస్తుంటారు. అయితే ఈ మార్గం రైల్వే శాఖకు చెందినది కావడంతో విద్యుత్‌ స్తంభాలు కూడా ఆ శాఖే ఏర్పాటు చేసింది. అయితే విద్యుత్‌ దీపాలు మరమ్మతులకు గురికావడంతో వీటికి రైల్వే శాఖ అధికారులు మరమ్మతులు చేపట్టడం లేదు. దీంతో నిత్యం రద్దీగా ఉండే ఈ మార్గంలో చీకటి పడితే గాఢాంధకారం అలుముకుంటోంది. రాత్రి వేళలో చీకటి కారణంగా నిత్యం ఈ మార్గంలో ప్రమాదాలు పరిపాటిగా మారాయి. ముఖ్యంగా ఈ మార్గంలో గల కొత్తపాలెం అండర్‌పాత్‌వే కూడలి వద్ద గల కల్వర్టు వద్ద రెయిలింగ్‌ లేకపోవడంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇప్పటికే పలు వాహనాలు గెడ్డలోకి దూసుకుపోయి ప్రమాదాలు జరిగాయి. కానీ రెయిలింగ్‌ నిర్మాణంపై అధికారులు దృష్టి పెట్టలేదు. కనీసం ఈ మార్గంలో జీవీంఎంసీ ఆధ్వర్యంలో విద్యుత్‌ స్తంభాలు ఏర్పాటు చేయడానికైనా  రైల్వే శాఖ అనుమతి ఇవ్వాలని స్థానికులు కోరుతున్నారు. దశాబ్దాల కాలంగా రైల్వే సమస్యలతో సతమతమవుతున్న ఈ మూడు వార్డుల ప్రజలకు ఈసారి జీవీఎంసీ ఎన్నికల తరువాతైనా పరిష్కారం దొరుకుతుందేమో వేచి చూడాలి.

Updated Date - 2021-03-01T05:43:45+05:30 IST