ఆరు అంశాలతో ముందుకెళ్లాలి

ABN , First Publish Date - 2022-05-22T05:05:47+05:30 IST

హౌసింగ్‌ పథకం ఇళ్ల నిర్మాణాల్లో ప్రధానంగా ఆరు అంశాలతో ఇచ్చిన లక్ష్యాలను చేరుకుంటేనే పురోగతి సాధించవచ్చని జిల్లా కలెక్టర్‌ పీఎస్‌ గిరీషా పేర్కొన్నారు.

ఆరు అంశాలతో ముందుకెళ్లాలి
హౌసింగ్‌ పథకంపై అధికారులతో సమీక్షిస్తున్న కలెక్టర్‌ గిరీషా

ఇళ్లస్థలాలు ఆయకం పెట్టి రుణాలు ఇప్పించండి

 హౌసింగ్‌ పథకంపై సమీక్షలో కలెక్టర్‌ గిరీషా

మదనపల్లె టౌన్‌, మే 21: హౌసింగ్‌ పథకం ఇళ్ల నిర్మాణాల్లో ప్రధానంగా ఆరు అంశాలతో ఇచ్చిన లక్ష్యాలను చేరుకుంటేనే పురోగతి సాధించవచ్చని జిల్లా కలెక్టర్‌ పీఎస్‌ గిరీషా పేర్కొన్నారు. శనివారం స్థానిక టౌన్‌హాల్లో మదనపల్లె నియోజకవర్గ స్థాయిలో పంచాయతీ సెక్రటరి, ఇంజినీరింగ్‌ అసిస్టెంట్లతో హౌసింగ్‌ పథకంపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ నెలన్నర రోజులుగా హౌసింగ్‌ పథకంపై తాను సమీక్షలు చేస్తున్నా అధికారులు ఆశించిన స్థాయిలో పురోగతి సాధించలేకపోతున్నారన్నారు. ఎంపీడీవోలు పూర్తి బాధ్యత తీసుకుంటేనే లక్ష్యాలను చేరుకోవచ్చన్నారు. నియోజకవర్గంలో 1636 ఇళ్ల నిర్మాణంలో రూఫ్‌లెవల్‌ దాటాయని, వాటికి ఎలివేషన్‌, పెయింట్లు కొట్టి లోగో ఏర్పాటు చేస్తే కాస్తైనా పురోగతి సాధించిన వారవుతారన్నారు. 1690 ఇళ్లు ఇంకా పునాదులు కూడా వేయలేదని జూన్‌ నెల రెండో వారంలో పునాదులు వేయకుంటే అలాంటి లబ్ధిదారుల ఇళ్ల కేటాయింపు రద్దు అవుతుందని దీనిపై కేంద్రప్రభుత్వం స్పష్టమైన ఉత్తర్వులు ఇచ్చిందని గుర్తుచేశారు. లబ్శిదారులకు బిల్లులు మంజూరు చేయడంలో పీఎ్‌ఫఎంఎస్‌ ఐడీ క్రియేట్‌ చేయడంలో 50 శాతమే పూర్తి చేశారని వారం లోపు వందశాతం పూర్తి చేయాలన్నారు. లబ్ధిదారులు పెట్టిన ఇండెంట్‌ ప్రకారం గోదాముల్లో సిమెంట్‌ స్టాకు వచ్చిందని వెం టనే సిమెంటు బస్తాలను నిర్మాణాల వద్దకు తీసుకెళ్లాలా అవగాహన కల్పించాలన్నారు. నెలకు ఒకసారి గోదాములకు సిమెంటు సరఫరా ఉంటుందన్నారు. డిజిటల్‌ సిగ్నేచర్‌ ఇవ్వడంతో సాంకేతిక సమస్య వస్తోందని సెక్రటరిలు కలెక్టర్‌కు చెప్పగా వెంటనే రాయచోటిలోని టెక్నికల్‌ సిబ్బందికి ఫోన్‌ చేసి మదనపల్లెకు వచ్చి సమస్య పరిష్కరించాలని ఆదేశించారు. ఇ-ముద్ర యాప్‌లో సాంకేతిక సమస్య రాకుండా చూడాలన్నారు. ఇంకా పలువురు లబ్ధిదారులు నుంచి ఓటీఎస్‌ డబ్బు కట్టించడం లో ఆలస్యమెందుకవుతోందని ప్రశ్నించారు.  నిమ్మనపల్లె మండలంలో హౌసింగ్‌ పురోగతి బాగుందని ఎంపీడీవో తాజ్‌మస్రూర్‌ను అభినందించారు. లబ్ధిదారులు ఇళ్ల నిర్మాణం చేసేందుకు ప్రభుత్వం రూ.2లక్షల దాకా నిధులు ఇస్తోందని, ఈ సొమ్ము చాలకపోవడంతో ఇళ్ల నిర్మాణాలు ఆలస్యమవుతోందని, దీనికి ప్రత్యామ్నయ మార్గం వుందన్నారు. కొంతమంది లబ్ధిదారులకు హౌసింగ్‌ బిల్లులు చెల్లించడంలో సప్తగిరిబ్యాంకుకు ఐఎ్‌ఫఎ్‌ససీ కోడ్‌ చూపడం లేదని సమస్య వస్తోందని సెక్రటరిలు కలెక్టర్‌ దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై కలెక్టర్‌ మాట్లాడుతూ హౌసింగ్‌ ఎండీతో చర్చిస్తామన్నారు. సమావేశంలో ఆర్డీవో ఎంఎస్‌ మురళి, హౌసింగ్‌ ఈఈ నాగరాజు, మున్సిపల్‌ కమిషనర్‌ రఘునాథరెడ్డి, తహసీల్దార్లు, ఎంపీడీవోలు, నోడల్‌ అధికారులు పాల్గొన్నారు.

Updated Date - 2022-05-22T05:05:47+05:30 IST