YSRCP MLC గన్‌తో పేల్చి చంపుతామని బెదిరించారా.. సీఎం జగన్ సొంత జిల్లాలో ఏంటిది..!?

ABN , First Publish Date - 2022-01-15T14:08:03+05:30 IST

YSRCP MLC గన్‌తో పేల్చి చంపుతామని బెదిరించారా.. సీఎం జగన్ సొంత జిల్లాలో ఏంటిది..!?

YSRCP MLC గన్‌తో పేల్చి చంపుతామని బెదిరించారా.. సీఎం జగన్ సొంత జిల్లాలో ఏంటిది..!?

  • వైసీపీలో ఫ్లెక్సీల రగడ
  • ప్రొద్దుటూరులో పరస్పర ఫిర్యాదులు

కడప జిల్లా/ప్రొద్దుటూరు : ప్రొద్దుటూరులో అధికార వైసీపీలో ఫ్లెక్సీల రగడ చోటు చేసుకుంది. ఈ నెల 16న ఎమ్మెల్సీ రమేశ్‌యాదవ్‌ జన్మదిన వేడుకలను పురస్కరించుకుని ఆయన అనుచరులు పట్టణంలో గురువారం అర్ధరాత్రి దాటాక ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం మొదలు పెట్టారు. స్థానిక శ్రీరాములపేట వద్ద ఎమ్మెల్సీ అనుచరుడు దుగ్గిరెడ్డి రఘునాథరెడ్డి ఆధ్వర్యంలో ఫ్లెక్సీ కడుతుండగా అక్కడకు చేరుకున్న కసిరెడ్డి మహేష్‌రెడ్డి అనే వ్యక్తి ఎమ్మెల్యే ఫొటో, పేరు ఫ్లెక్సీలో లేకుండా కట్టవద్దంటూ సూచించారు. దీంతో వీరిద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. ఇంతలో ఐదో వార్డు కౌన్సిలర్‌ మురళీధర్‌రెడ్డి అక్కడికి చేరుకున్నారు. మాటామాటా పెరిగి తోపులాట జరిగింది. విషయం తెలుసుకున్న ఎమ్మెల్సీ రమేశ్‌యాదవ్‌ అక్కడికి చేరుకున్నారు. ఇంతలో పదో వార్డు కౌన్సిలర్‌ గరిశపాటి లక్ష్మీదేవి, సంఘటన స్థలానికి తమ కుటుంబ సభ్యులతో రావడంతో గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి. పోలీసులు ఇరువర్గాల వారిని అక్కడి నుంచి పంపించేశారు. ఈ వ్యవహా రంపై ఇరువర్గాలు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశాయి.


ఉద్దేశ పూర్వకంగానే దాడి..

తనపై మహేష్‌ ఉద్దేశపూర్వకంగా దాడికి పాల్పడ్డాడని దుగ్గిరెడ్డి రఘునాథరెడ్డి ఆరోపించారు. ఈయన శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాలుగా గరిశపాటి లక్ష్మీదేవికి తమకు మధ్య గొడవలు ఉన్నాయని, కేసులు కూడా జరిగాయన్నారు. ఒకే పార్టీలో ఉన్నాం, గొడవలొద్దంటూ ఎమ్మెల్సీ రమేశ్‌ సూచించడంతో కేసు ఉపసంహరించుకున్నానన్నారు. అయినప్పటికి ఆమె పదేపదే బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆమె వల్ల తనకు, తన కుటుంబానికి ప్రాణహాని ఉందని అన్నారు. ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేశామని చెప్పారు. ఐదోవార్డు కౌన్సిలర్‌ మురళీధర్‌రెడ్డి మాట్లాడుతూ రమేశ్‌ తనను తుపాకితో బెదిరించారని గరిశపాటి లక్ష్మీదేవి చేస్తున్న ఆరోపణలు అవాస్తవమన్నారు. 


చంపుతానని బెదిరించారు..

ఎమ్మెల్సీ రమేశ్‌ గన్‌తో కాల్చి చంపుతానని బెదిరించారని కౌన్సిలర్‌ లక్ష్మీదేవి ఆరోపించారు. ఫ్లెక్సీ కట్టే స్థలం వద్ద గొడవ జరుగుతూ ఉందని తెలియడంతో తాను వెళ్లి గొడవ వద్దని సర్దిచెప్పే ప్రయత్నం చేశానన్నారు. రఘునాథరెడ్డి పదేపదే దుర్భాషలాడుతున్నప్పటికి సంయమనం పాటించామన్నారు. మహేష్‌ కొట్టింది వాస్తవమే కానీ, చేత్తో కొడితే కత్తులు, బ్లేడు గాయాలు ఎలా అయ్యాయని ఆమె ప్రశ్నించారు.


మా మధ్య ఎలాంటి గొడవలు లేవు..

ఎమ్మెల్సీ రమేశ్‌యాదవ్‌కు తనకు మధ్య ఎలాంటి గొడవలు లేవని ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి తెలిపారు. రమేశ్‌ తన సోదరుడని, అతడిని అన్నారు. ఏదో వార్డులో ఫ్లెక్సీల గురించి జరిగిన గొడవను ఫ్యాక్షన్‌ గొడవగా సృష్టించకూడదన్నారు. లక్ష్మీదేవిని రమేశ్‌ గన్‌పెట్టి బెదిరించాడని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారని తెలుసని, ఆ సమయంలో అక్కడ తాను లేనని ఆవిషయాలు తనకు తెలియవని అన్నారు.


గన్‌ పెట్టి బెదిరించాననడం వాస్తవం కాదు..

కౌన్సిలర్‌ గరిశపాటి లక్ష్మీదేవిని తాను గన్‌ పెట్టి బెదిరించాని చెప్పడంలో ఎంత మాత్రం వాస్తవం లేదని ఎమ్మెల్సీ రమేశ్‌యాదవ్‌ అన్నారు. గురువారం అర్ధరాత్రి గొడవ జరిగే స్థలానికి తాను వెళ్లేటప్పటికి అక్కడ పెద్దసంఖ్యలో పోలీసులు ఉన్నారన్నారు. తాను అక్కడ ఉన్నంత వరకు ఆమె ఆ స్థలం వద్దకు రాలేదని, పోలీసులే తనను ఇంటి వద్దకు వచ్చి వదిలివెళ్లారని చెప్పారు.


ఎస్పీకి ఎమ్మెల్సీ ఫిర్యాదు

ప్రొద్దుటూరులో గురువారం అర్ధరారత్రి చోటు చేసుకున్న ఫ్లెక్సీల గొడవపై ఎమ్మెల్సీ రమేశ్‌యాదవ్‌ శుక్ర వారం ఎస్పీ కేకేఎన్‌ అన్బురాజన్‌ను కలిసేందుకు కడపకు వచ్చారు. తన అనుచరవర్గంపై ఎమ్మెల్యే వర్గం వారు దాడికి పాల్పడ్డారని వారిపై చర్యలు తీసుకోవాలంటూ ఎస్పీని కోరినట్లు తెలుస్తోంది. అనంతరం ఆయన తన కారులో ఎవరితో మాట్లాడకుండా వెళ్లిపోయారు. ఎమ్మెల్సీ ఎస్పీని కలిసిన తరువాత ప్రొద్దుటూరుకు చెందిన ఎమ్మెల్యే రాచమల్లు అనుచరవర్గమైన పద్మశాలి కార్పొరేషన్‌ చైర్‌పర్సన్‌ విజయలక్ష్మి, మాజీ కౌన్సిలర్‌ లక్ష్మిదేవి కడపకు వచ్చి ఎస్పీని కలిసి ఫిర్యాదు చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ ఎమ్మెల్సీ రమేశ్‌యాదవ్‌ ఫ్లెక్సీలలో ఎమ్మెల్యే ఫోటో వేయకపోవడంతో అడిగినందుకే తమను బెదిరించాడని ఎస్పీకి వివరించామన్నారు. ఈ వ్యవహారంపై ఎస్పీ అన్బురాజన్‌ను వివరాలు అడుగగా ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే వర్గాలు తనను కలిశారని అయితే తనకు ఎలాంటి లిఖితపూర్వక ఫిర్యాదు ఇవ్వలేదని తెలిపారు.


యాదవులకు రాచమల్లు క్షమాపణ చెప్పాలి..

యాదవుల ఎదుగుదల చూసి ఓర్వలేకనే దాడికి పాల్పడుతున్నారని గురువారం రాత్రి జరిగిన ఘటనకు బాధ్యత వహిస్తూ ఎమ్మెల్యే రాచమల్లు యాదవులకు క్షమాపణలు చెప్పాలని ఆ సంఘం రాష్ట్ర కార్యదర్శి నేట్లపల్లి శివరామక్రిష్ణ యాదవ్‌ డిమాండ్‌ చేశారు. శుక్రవారం మైదుకూరులోని టీడీపీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ ప్రొద్దుటూరులో మొన్న నందం సుబ్బయ్య హత్య, నేడు ఎమ్మెల్సీ రమేశ్‌యాదవ్‌ అనుచరులపై దాడికి పాల్పడటం అన్యాయమన్నారు.

Updated Date - 2022-01-15T14:08:03+05:30 IST