యూపీ ఎన్నికలు : రూపం – సారం

Published: Sat, 19 Mar 2022 00:58:23 ISTfb-iconwhatsapp-icontwitter-icon
యూపీ ఎన్నికలు : రూపం – సారం

ఎన్నికల రాజకీయాలే ప్రజాస్వామ్య సారం కాదు. ప్రజాస్వామ్య వ్యవస్థలో అవి ఒక భాగం మాత్రమే. ఇప్పుడున్న రాజకీయ వాతావరణంలో ఎన్నికల ద్వారా ప్రజాస్వామ్యం పరిపూర్ణంగా వికసించడం సాధ్యం కాదు. ఎన్నిక ప్రక్రియకి ప్రజల జీవన్మరణ సమస్యలకు ఉండవలసిన సజీవ సంబంధం తీవ్రమైన ఒత్తిడిలో ఉంది. ఈ అంతరం పూరించడానికి ప్రజలు ప్రత్యక్షంగా పాలకుల మీద నిరంతర ఒత్తిడి పెట్టవలసి ఉంటుంది.


ఐదురాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో, మీడియా ఊదరగొట్టినట్లు గెలిచిన పార్టీల మెజారిటీ ఒక్క పంజాబ్‌లో తప్ప అంత అద్భుతంగా ఏం లేదు. ఆరోగ్యకరమైన సంయమనంతో కూడిన సమాచారాన్ని, వాస్తవాలని ప్రజలకు అందించి ప్రజాస్వామ్య సంస్కృతిని సుసంపన్నం చేసే బాధ్యతని మీడియా ఎప్పుడో వదిలేసింది. ఎలక్ట్రానిక్‌ మీడియా, ముఖ్యంగా జాతీయ మీడియా ‘సత్యానంతర’ సమాజ సృష్టిలో అగ్రభాగాన ఉంది. రాజకీయాలలో బాధ్యతగల స్థానాల్లో ఉన్నవారు కూడ సత్యాలని దాచి అర్ధసత్యాలని అబద్ధాలని చాలా సునాయాసంగా లేదా చాలా సహజంగా మాట్లాడేస్తున్నారు. ఆలోచనాపరులు, కాస్త వాస్తవాలు తెలిసినవారు ఆశ్చర్యపోయేలా వార్తలు ఉంటున్నాయి. మీడియా విస్తరించిన కొద్దీ ప్రజలు సత్యానికి దూరమవుతున్నారు. ఉత్తరప్రదేశ్‌ ఎన్నికల ఫలితాలు ప్రసారం చేసిన పద్ధతి, దాని గురించి చర్చించిన పద్ధతి ఈ ‘సత్యానంతర’ వాతావరణానికి అద్దం పడుతున్నది.


ఉత్తరప్రదేశ్‌లో యోగి ఆదిత్యనాథ్‌ నాయకత్వంలో బిజెపి రెండవసారి గెలిచింది. ఇక దేశంలో ఎక్కడ ఏ పార్టీ కూడా రెండవసారి గెలవనట్లు, ఉత్తరప్రదేశ్‌లో మాత్రమే ఈ వింత జరిగినట్లు ప్రచార సాధనాలు ప్రచారం చేసాయి. అంతకుముందు గుజరాత్‌లో మోదీ మూడవసారి గెలిచినప్పుడు చేసిన ప్రచారం ఇదే పద్ధతిలో జరిగింది. నిజమే గత మూడు దశాబ్దాలలో ఉత్తరప్రదేశ్‌లో ఏ పార్టీ కూడా రెండవసారి గెలవలేదు. ఈ గెలుపునకు కల్పించిన ప్రచారం ఎంతదాకా పోయిందంటే ఇక భవిష్యత్‌ ప్రధానమంత్రి యోగి ఆదిత్యనాథేనని మీడియా నిర్ణయం చేసేసింది. ఎందుకు మీడియా ఇలా ప్రవర్తిస్తున్నది అన్న అంశాన్ని కొంత చర్చించవలసిందే.


ఆమెరికా మీడియాపై అరుదైన పరిశోధన చేసిన నాంచాంస్కీ (Noam Chomsky) మీడియా వెనక ఉండే రాజకీయ ఆర్థిక కారణాలను చాలా లోతుగా విశ్లేషించాడు. ప్రజాస్వామ్యంలో మీడియా స్వతంత్రమైన పాత్ర నిర్వహించాలి అనే భావన ఒక ఆదర్శమైనా, వాస్తవంలో ఆ పాత్ర నిర్వహించడానికి కావలసిన సామాజిక, ఆర్థిక పరిస్థితులు లేవు. ఒక చానెల్‌ పెట్టాలన్నా, నడపాలన్నా అది వందల కోట్లతో కూడుకున్న వ్యవహారం. సాంకేతిక పరిజ్ఞానం పెరిగినకొద్దీ బలవంతుల, ధనవంతుల శక్తి ఎన్నో రెట్లు పెరుగుతున్నది. పేదల, నోరులేని వాళ్ల తరఫున మాట్లాడడానికి మీడియాలో స్థానమే లేకుండా పోయింది.


జాతీయ చానళ్లలో నాకు తెలిసి దళితుల, ఆదీవాసీల వాళ్ల అస్తవ్యస్త జీవనాన్ని ఏ ఒక్కటి కూడా కవర్‌ చేసిన పాపాన పోలేదు. ఇంగ్లీష్‌ మీడియాకు ఢిల్లీయే దేశం, ఢిల్లీ దాటి ఒక విశాల సమాజమున్నదన్న స్ఫూర్తి కూడా మనకు కనిపించదు. ఒక్క ఎన్నికల సమయంలో మాత్రం ఎన్నికలు జరుగుతున్న రాష్ట్రాలలో ఎన్నికల తీరుతెన్నులను కొంత వరకు కవర్‌ చేస్తారు. మీడియా ధోరణికి ప్రధాన కారణం మీడియా స్వంతదారులు తమతమ ఆర్థిక ప్రయోజనాల వేటలో ఉన్నారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడం దీర్ఘకాలంలో తమ అవసరమనే దూరదృష్టి వీళ్లకు వీసమెత్తైనా లేదు. తమ ఆర్థిక ప్రయోజనాలను కాపాడి తమకు మరింత సంపద చేకూర్చే రాజకీయాలకి, రాజకీయ పార్టీలకి వీళ్ల పూర్తి మద్దతు ఉంటుంది. మీడియాని ఈ ప్రయోజనాలే మాట్లాడిస్తాయి.


ఉత్తరప్రదేశ్‌ ఎన్నికల ఫలితాల ప్రచారాన్ని ఈ నేపథ్యంలో అర్థం చేసుకోవలసి ఉంటుంది. నియోలిబరలిజం నమూనా అమలులోకి వచ్చిన తర్వాత పివి నరసింహారావుకి, డా. మన్మోహన్‌సింగ్‌కి మీడియాలో విపరీతమైన ప్రచారం కల్పించారు. దేశ ఆర్థిక వ్యవస్థను కాపాడిన రక్షకులుగా, వాళ్లే లేకపోతే దేశం ఏమైపొయ్యేది అనే ప్రచారాన్ని చేసారు. నిజానికి మన్మోహన్‌సింగ్‌ ఎన్నడూ ఎన్నికలలో ప్రత్యక్షంగా పాల్గొని గెలిచినవాడు కాదు. కాంగ్రెస్‌ పార్టీని నిట్టనిలువునా ముంచిన ‘అభివృద్ధి నమూనాకి’ మన్మోహన్‌, చిదంబరం సంధానకర్తలు. వీళ్లిద్దరూ సంక్షేమ భావనకు పూర్తి వ్యతిరేకులు.


ప్రభుత్వ పాత్రను కుదించి మార్కెటుకు రహదారి వేసే క్రమంలో లక్షల సంఖ్యలో ప్రభుత్వ ఉద్యోగాలు రద్దు చేసారు. క్లాస్‌–4 ఉద్యోగులను పూర్తిగా రద్దు చేసారు. వీళ్ల నాయకత్వంలో సంపద పెరిగిన మాట నిజమే ఐనా రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా విపరీత అసమానతలు పెరగడానికి వీళ్లు చాలా శ్రమపడ్డారు. ఈ కాలంలో సోనియాగాంధీ జాతీయ సలహా మండలిని ఏర్పరచి సంక్షేమాన్ని గురించి మధనపడుతున్న అరుణారాయ్‌, జీన్‌డ్రెజ్‌ (Jean Drez), హర్ష్‌మందర్‌, సక్సేనా లాంటి వాళ్ల సలహాల మేరకు కొన్ని సంక్షేమ కార్యక్రమాలను ప్రభుత్వ ఎజెండాలోకి నెట్టగలగడం వల్లే ఇప్పటికీ ఆమెకు కొంత రాజకీయ పలుకుబడి ఉంది. ఆ కారణం వల్లే కాంగ్రెస్‌ పార్టీ ఆమె నాయకత్వాన్ని కాదనలేకపోతున్నది. ఆ పార్టీలో దేశవ్యాప్తంగా ప్రజలు అభిమానించే నాయకులు లేకపోవడానికి ప్రధాన కారణం ఒక్కరు కూడా ప్రజా సంక్షేమ చిహ్నంగా మిగలలేదు. కాంగ్రెస్‌ పార్టీ సామాజిక పునాది పూర్తిగా దెబ్బతింది.


కాంగ్రెస్‌ ఈ సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న దశలో బిజెపి కొత్త నినాదాలతో దేశ రాజకీయాలలోకి ఒక సుడిగాలిలా ప్రవేశించింది. ఈ పార్టీ ఎక్కడ కూడా కాంగ్రెస్‌ ప్రవేశపెట్టిన అభివృద్ధి నమూనాని ప్రశ్నించడం కాని దానికి ప్రత్యామ్నాయాన్ని ప్రతిపాదించడం కాని చేయలేదు. ప్రజలలో పెరిగిన అసంతృప్తికి, ఆగ్రహానికి ప్రధాన కారణాలు దేశ సాంస్కృతిక (Cultural) వ్యవస్థలో ఉన్నవని, హిందువుల అస్తిత్వమే ప్రమాదంలో పడిందనే నినాదాన్ని చాలా నైపుణ్యంతో రాజకీయ ప్రక్రియలోకి తీసుకురావడంలో కృతకృత్యులయ్యారు. మత అస్తిత్వం ఇతర మతాల దాడికి గురౌతున్నదనే ప్రచారాన్ని చాలా బలంగా ముందుకు తెచ్చారు. తమ జీవితంలోని కష్టాలకు, పేదరికానికి, నిరుద్యోగానికి అసమానతలకు కార్యకారణ సంబంధాలు స్పష్టంగా తెలియని ప్రజలు, అలాగే మధ్యతరగతివారు ఈ రాజకీయాలకి మద్దతుగా నిలుస్తున్నారు.


ఉత్తరప్రదేశ్‌లో మీడియా నిర్వహించిన ఇంటర్వ్యూలలో తాము ఎదుర్కొంటున్న సమస్యలను ఏకరువుపెట్టి, తీరా ఎవ్వరికి ఓటు వేస్తారు అంటే అధికార పార్టీకి అని జవాబు ఇచ్చారు. ఉదాహరణకి ఒక ఓటరు తన పేదరికాన్ని, నిరుద్యోగాన్ని సమస్త కష్టాలను కరోనా కాలంలో చాలా దయనీయంగా చెపుతూ, ఎవరికి ఓటు వేస్తావు అంటే బిజెపికి అని అన్నప్పుడు, ఎందుకు ఆ పార్టీకి అంటే, అఫ్ఘానిస్తాన్‌లో తాలిబన్లు అధికారంలోకి వచ్చారు అని జవాబిచ్చాడు. కార్యకారణ సంబంధాల మధ్య లంకె ఎంత తెగిపోయిందో వింటే ఆశ్చర్యం కలగల మానదు. ప్రజలకు మీడియా ద్వారా కాని, ప్రచారకుల లేదా కార్యకర్తల ద్వారా చేరుతున్న సమాచారం ఎంత వక్రీకరణకు గురౌతున్నదో గమనించవచ్చు. పాలో ఫ్రయర్‌ (Paulo Freire) ఈ పరిణామ దశని అర్ధచైతన్య దశగా సూత్రీకరించాడు.


బిజెపి ఇప్పటికీ తన ప్రధాన ప్రత్యర్థి కాంగ్రెస్‌ పార్టీ అని భావిస్తున్నది. అలా భావించడానికి అదొక్కటే జాతీయ పార్టీ. మిగతా పార్టీలన్నీ వామపక్ష పార్టీలతో సహా ప్రాంతీయ పార్టీలుగా మిగిలిపోయాయి. ఈ పార్టీలు ఏవి కూడా జాతీయ స్థాయిలో అధికారంలోకి రాలేవని, ప్రాంతీయ పార్టీలని నయానా, భయానా మేనేజ్‌ చేయవచ్చని బిజెపి బలంగా నమ్ముతున్నది. ప్రాంతీయ పార్టీలు కలిసి ఒక ప్రతిపక్షంగా ఏర్పడడానికి చాలా శ్రమపడవలసి ఉంటుంది.


ఎన్నికల రాజకీయాలే ప్రజాస్వామ్య సారం కాదు. ప్రజాస్వామ్య వ్యవస్థలో అవి ఒక భాగం మాత్రమే. ఇప్పుడున్న రాజకీయ వాతావరణంలో ఎన్నికల ద్వారా ప్రజాస్వామ్యం పరిపూర్ణంగా వికసించడం సాధ్యం కాదు. ఎన్నిక ప్రక్రియకి ప్రజల జీవన్మరణ సమస్యలకుండవలసిన సజీవ సంబంధం తీవ్రమైన ఒత్తిడిలో ఉంది. ఈ అంతరం పూరించడానికి ప్రజలు ప్రత్యక్షంగా పాలకుల మీద నిరంతర ఒత్తిడి  పెట్టవలసి ఉంటుంది. తెలంగాణ రాష్ట్ర సాధన విస్తృత ప్రజా భాగస్వామ్యంతో సాధ్యమయ్యింది. రైతాంగం రాజీలేని పోరాటం ద్వారా రైతాంగ వ్యతిరేక మూడు చట్టాలని వెనక్కి తీసుకునేలా ఉద్యమించారు. ముస్లిం మహిళలు షహీన్‌బాగ్‌లో చూపిన చొరవ, ఉద్యమించిన పద్ధతి ప్రజాస్వామ్య సంస్కృతి వికాసానికి దోహదపడుతుంది.


ఉద్యమాలే ఒక ప్రత్యామ్నాయ ప్రజాస్వామ్య పరిష్కారం అనడానికి ప్రధాన కారణం ఇపుడు అమలులో ఉన్న నియోలిబరల్‌ అభివృద్ధి చాలా బలవంతమైనది. ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా దాని దిశను మార్చే శక్తి కలిగి లేరు. పాలన పద్ధతిలో కొన్ని తేడాలుంటాయి. ప్రజాస్వామ్య సంస్థలను విశ్వవిద్యాలయాల స్వయం ప్రతిపత్తిని గౌరవించే సంస్కారం కొంత ఉంటుంది. ఈ దేశంలోని అత్యంత సంపన్నులు ఎంత సంపద ఉన్నా లాభాల వేటలో మునిగి తేలుతున్నారు. కరోనా కాలంలో లక్షల మంది జనం చనిపోయినా, లక్షలాది మంది లేబర్‌ కట్టుబట్టలతో పిల్లల్ని చంకలో వేసుకుని వందల మైళ్లు నడిచినా సంపన్నులలో మానవత్వ స్పందనే కరువైంది. ఆశ్చర్యంగా అమెరికాలో అతి సంపన్నులు తమ ఆదాయాల మీద ఎక్కువ ట్యాక్స్‌ (Tax) వేయమని అమెరికన్‌ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసారు. సాండర్స్‌ అనే రాజకీయ నాయకుడు అమెరికాలోని సంపదను పునఃపంపిణీ చేయాలని నినదిస్తున్నారు. మన దేశంలో ఈ మాటే వినిపించడం లేదు.


ప్రభుత్వరంగ సంస్థలను అమ్మేసి ఆ సంపదను కూడా సంపన్నులకే చెందేలా ప్రభుత్వం కష్టపడుతున్నది. సాధారణంగా పెట్టుబడికి, మార్కెట్‌కి మానవీయ విలువ లొంగదు. వీటిని మనం ఆశించడం కూడా పొరపాటే. ఎన్నికల ద్వారా ఈ దిశను మార్చడం అంత సులభం కాదు. అలా అని ఎన్నికల ప్రక్రియ నిరర్ధకం అని కూడా కాదు. ఎన్నికలలో ప్రజలు పరోక్షంగా పాల్గొంటూనే, ప్రత్యక్షంగా రాజకీయ ప్రక్రియలో పాల్గొని తమ జీవితాలను మార్చుకోవడమే కాక ఈ దేశ ప్రజాస్వామ్యాన్ని సుసంపన్నం చేసి రాబోయే తరాలకి బాబాసాహెబ్‌ అంబేడ్కర్‌ రూపకల్పన చేసిన రాజ్యాంగంలోని సమానత్వం, సామాజిక న్యాయం, సౌభ్రాతృత్వం లాంటి సున్నితమైన విలువలని అందించాలి.


ప్రొ. జి. హరగోపాల్‌

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International

ప్రత్యేకంLatest News in Teluguమరిన్ని...

Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.