‘డబుల్‌’ డేంజర్‌!

ABN , First Publish Date - 2021-05-15T00:03:51+05:30 IST

భారతదేశంలో శరవేగంగా విస్తరిస్తున్న డబుల్‌ మ్యూటెంట్‌ రకం కరోనా వైరస్‌ అత్యంత ప్రమాదకర ం. ఈ వేరియంట్‌ వల్ల యాంటీబాడీల సామర్థ్యం కోల్పోవడంతోపాటు వ్యాక్సిన్‌ల సామర్థ్యం కూడా 5-10ు మేర తగ్గే ప్రమా

‘డబుల్‌’ డేంజర్‌!

రోగనిరోధక శక్తిపై దాడి

వేగంగా వ్యాపిస్తోంది

టీకా సామర్థ్యానికీ సవాలు

చాలా దేశాల్లో కొరత

మన జాగ్రత్తలే మనకు రక్ష

అమెరికాకు జూన్‌లో మూడో వేవ్‌! 

‘ఆంధ్రజ్యోతి’తో ఎమోరీ వర్సిటీ ప్రొ. రామారావు


భారతదేశంలో శరవేగంగా విస్తరిస్తున్న డబుల్‌ మ్యూటెంట్‌ రకం కరోనా వైరస్‌ అత్యంత ప్రమాదకర ం. ఈ వేరియంట్‌ వల్ల యాంటీబాడీల సామర్థ్యం కోల్పోవడంతోపాటు వ్యాక్సిన్‌ల సామర్థ్యం కూడా 5-10ు మేర తగ్గే ప్రమాదం ఉందని నిపుణుల అంచనా. దీనిపై విస్తృతంగా అధ్యయనాలు జరుగుతున్నాయి. ఒకటి, రెండు నెలల్లో స్పష్టత వస్తుంది. అన్ని రకాల వేరియంట్లను సమర్థంగా ఎదుర్కొనే వ్యాక్సిన్‌లను అభివృద్ధి చేయడం తక్షణావసరం అంటున్నారు అమెరికా అట్లాంటాలోని ఎమోరి విశ్వవిద్యాలయంలో మైక్రోబయాలజీ, ఇమ్యునాలజీ విభాగంలో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న డాక్టర్‌ అమర రామారావు. దాదాపు సగం జనాభా టీకా తీసుకున్నా.. అమెరికాలో జూన్‌-ఆగస్టు మాసాల మధ్య థర్డ్‌వేవ్‌ వ్యాప్తి చెందనుందనే ఆందోళన వ్యక్తమవుతున్నాయని ఆయన చెప్పారు. హెచ్‌ఐవీ పరిశోధనలతో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన నెల్లూరు జిల్లా కావలికి చెందిన డాక్టర్‌ రామారావు.. ఏడాదిన్నరగా కరోనా వ్యాక్సిన్‌ అభివృద్ధికి కృషి చేస్తున్నారు. ప్రస్తుత పరిస్థితులపై ఆయన ‘ఆంధ్రజ్యోతి’తో ప్రత్యేకంగా మాట్లాడారు.


డబుల్‌ మ్యుటెంట్‌ తీవ్రతకు కారణాలేమిటి?

ప్రస్తుతం భారదేశంలో అధికంగా వ్యాప్తిలో ఉన్న బి.1.1617 రకం కరోనా వైరస్‌ ఊహించని వేగంతో వ్యాప్తి చెందుతోంది. ఈ వేరియంట్‌ సోకిన కణాలు ఒకదానికి మరొకటి ఫ్యూజ్‌ అవుతున్నాయని నిపుణులు భావిస్తున్నారు. దీనివల్ల మన దేహంలోఉన్న యాంటీబాడీల సామర్థ్యం తగ్గుతోంది. ఫలితంగా వైరస్‌ వేగంగా వ్యాప్తి చెందుతోందని, లక్షల సంఖ్యలో కేసులు పెరుగుతున్నాయని అంచనా వేస్తున్నారు. 


డబుల్‌ మ్యుటెంట్‌పై ప్రస్తుత వ్యాక్సిన్లు సమర్థంగా పనిచేస్తాయా?

ఈ రకం వైర్‌సకు యాంటీబాడీల సామర్థ్యాన్ని దెబ్బతీసే లక్షణం ఉంది. వ్యాక్సిన్‌ తీసుకున్నాక వచ్చే యాంటీబాడీలను కూడా ఇది కొంత వరకు దెబ్బతీసే ప్రమాదముంది. ఈ రకం వైరస్‌ వల్ల ప్రస్తుతం ఉన్న వ్యాక్సిన్ల సామర్థ్యం కాలక్రమంలో 5-10ు తగ్గవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం లభిస్తున్న అన్ని వ్యాక్సిన్లు యాంటీబాడీలను పెంచుతున్నాయి. దాంతో పాటు టీ-సెల్స్‌ సామర్థ్యాన్ని పెంచే వ్యాక్సిన్లను అభివృద్ధి చేయగలిగితే.. భవిష్యత్తులో ఎన్ని వేరియంట్లు వచ్చినా కరోనాను సమర్థంగా అడ్డుకోవచ్చు.


భారత్‌లో ఈ వేరియంట్‌ వ్యాప్తికి ప్రత్యేక కారణాలున్నాయా?

అధిక జనాభా.. జనసాంద్రత ఎక్కువగా ఉన్న భారత్‌ వంటి దేశాల్లో వైరస్‌ వ్యాప్తి పెరిగే కొద్దీ కొత్త ఉత్పరివర్తనాలు వస్తాయి. కొత్త వేరియంట్‌లకు అవి బీజాలు వేస్తాయి. సామాజిక దూరం పాటించడం, విధిగా మాస్క్‌లు ధరించడం ద్వారా ఏ రకం వైర్‌సనైనా అదుపులో పెట్టొచ్చు. పరిస్థితి తీవ్రతను బట్టి పూర్తి లాక్‌డౌన్‌ విధించేందుకు ప్రభుత్వాలు ఆలోచన చేయాలి.



మూడోవేవ్‌ ప్రమాదం పొంచి ఉందంటారా?

మరో కొత్త రకం వైరస్‌ రాకపోతే మూడో వేవ్‌ ప్రమాదం నుంచి తప్పించుకోగలం. వ్యాక్సిన్ల పంపిణీ నిరంతరం కొనసాగాలి. హెర్డ్‌ఇమ్యూనిటీ వచ్చి, ప్రజలు జాగ్రత్తలు తీసుకుంటే.. మూడోవేవ్‌ ముప్పు తప్పే అవకాశం ఉంది. ఈ వైర్‌సకు గాలి ద్వారా వ్యాప్తి చెందే లక్షణం ఉంది. అందుకే.. అత్యవసరం అయితే తప్ప బయటకు వెళ్లకపోవడం శ్రేయస్కరం.


వ్యాక్సిన్ల కొరత, ఇతర కారణాల వల్ల కొందరు ఒక డోస్‌ టీకా మాత్రమే తీసుకుంటున్నారు. దీని వల్ల ఎంత వరకు ఫలితం ఉంటుంది?

వ్యాక్సిన్‌ ఒక డోస్‌ తీసుకున్నా.. కొంత వరకు మేలే. కరోనా వచ్చినా ఆస్పత్రి పాలు కావలసిన తీవ్ర పరిస్థితుల నుంచి బయటపడవచ్చు. వ్యాక్సిన్‌ ఎంత కాలం ప్రభావం చూపిస్తుందనే అంశంపై ఇంకా పూర్తి స్పష్టతలేదు. కొత్త వేరియంట్లపై ప్రస్తుతం ఉన్న టీకాలు ఎంత సమర్థంగా పనిచేస్తాయో కూడా స్పష్టత లేదు. కాబట్టి అందుబాటులో ఉన్న టీకాలు రెండు డోస్‌లు తీసుకుంటే.. వైరస్‌ నుంచి చాలా వరకు రక్షణ లభిస్తుంది.


విదేశాల్లో వ్యాక్సిన్ల లభ్యత ఎలా ఉంది?

అమెరికా వంటి కొన్ని దేశాల్లో మినహా.. చాలా దేశాల్లో అవసరమైనన్ని వ్యాక్సిన్లు అందుబాటులో లేవు. త్వరలో మరిన్ని వ్యాక్సిన్లు వస్తాయి. అప్పుడు టీకాల కొరత తీరుతుంది. అందుకు కొంత సమయం పడుతుంది. అప్పటిదాకా ప్రజలు అప్రమత్తంగా ఉండ క తప్పదు.


అమెరికాలో అందరూ వ్యాక్సిన్‌ తీసుకుంటున్నారా?

భారత్‌లో మా దిరిగానే అమెరికాలో వ్యాక్సిన్‌ తీసుకునేందుకు చాలా మంది సందేహిస్తున్నారు. ఇక్కడ ఇప్పటి వరకు మొత్తం జనాభాలో 36ు మంది మాత్రమే వ్యాక్సిన్‌ తీసుకున్నారు. ఇంకా రెండు కోట్ల మంది రెండో డోస్‌ తీసుకోలేదు. జూన్‌-ఆగస్టు నెలల మధ్య ఇక్కడ వేసవి. ఎక్కువ మంది విస్తృతంగా ప్రయాణాలు చేస్తారు. వ్యాక్సిన్‌లు తీసుకుని అప్పటికి ఆరు నెలలు అవుతుంది. వ్యాక్సిన్‌ సామర్థ్యం తగ్గే అవకాశం ఉంది. ఆ సమయంలో ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా అమెరికాకు మూడోవేవ్‌ ముప్పు తప్పదనే భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి.

- స్పెషల్‌ డెస్క్‌

Updated Date - 2021-05-15T00:03:51+05:30 IST