Advertisement

మార్కెట్ ఆధారిత పంటలతో లబ్ధి

Sep 29 2020 @ 00:45AM

కనీస మద్దతుధర లభించే పంటల సాగు నుంచి మార్కెట్ ఆధారిత పంటల సాగు వైపుకు రైతులను మళ్ళించవలసిన అవసరముంది. ముఖ్యంగా అంతర్జాతీయ డిమాండ్ బాగా ఉన్న పువ్వులు, సేంద్రియ ఆహారధాన్యాలు, కొత్త తరహా హైబ్రిడ్‌ రకాల కూరగాయలు మొదలైన వాటిని సాగు చేసేలా రైతులను ప్రోత్సహించాలి. పువ్వులు, కూరగాయల సాగులో మన దేశం ప్రపంచ అగ్రగామిగా రూపొందగల అవకాశం ఎంతగానో ఉంది. ఈ మార్కెట్ ఆధారిత పంటల సాగులో రైతులకు ఎదురయ్యే సమస్యలపై ఒక కచ్చితమైన అంచనాతో, వారికి సహాయకారిగా ఉండే ఒక విధానాన్ని ప్రభుత్వం రూపొందించాలి. 


రైతులు ఇప్పుడు తమ పంటలను ఎక్కడైనా, ఎవరికైనా అమ్ముకోవచ్చు. విధిగా మండీల ద్వారా విక్రయించడం ఇంకెంతమాత్రం తప్పనిసరి కాదు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన వ్యవసాయ ఉత్పత్తుల వర్తక, వాణిజ్యాల అభివృద్ధి, అనుకూలతల ఏర్పాటు బిల్లు రైతులకు ఈ వెసులుబాటును కల్పించింది. పెద్ద కంపెనీలు ఇప్పుడు వ్యవసాయ ఉత్పత్తులను ముందుగా నిర్ణీతమైన ధరలకు రైతుల నుంచి నేరుగా కొనుగోలు చేయగలుగుతాయి. ఈ కొత్త మార్కెటింగ్ పరిణామం కచ్చితంగా మండీ వ్యాపారుల ప్రయోజనాలను దెబ్బ తీస్తుంది. చిల్లర వ్యాపారంలోకి ఈ-–పోర్టల్స్ ప్రవేశించినప్పుడు ఏర్పడిన సమస్యల వంటివే ఇప్పుడు మండీ వ్యాపారులకూ ఎదురవనున్నాయి. ఈ–పోర్టల్స్‌ వచ్చినా వీథి చివరి కిరాణా దుకాణాలు ఇప్పటికీ వర్ధిల్లుతున్నాయి. వినియోగదారుకు అవసరమైన సరుకులను తక్షణమే అందజేయడం, ప్రత్యామ్నాయ సరుకులను ఇవ్వడం లాంటి సేవలను అందివ్వగలగడమే వాటి మనుగడకు దోహదం చేస్తోంది. అటువంటి సేవలను కిరాణా దుకాణాలు మాత్రమే సమకూర్చగలవు. ఈ-–పోర్టల్స్ వ్యాపారులకు అవి సాధ్యం కావు. ఇదే విధంగా, వ్యవసాయ ఉత్పత్తుల వ్యాపారంలోకి పెద్ద కంపెనీల ప్రవేశం వల్ల మండీల మనుగడకు ముప్పు వాటిల్లదు. రైతుల ఉత్పత్తులను నాణ్యత పరంగా విభిన్న తరగతులుగా వర్గీకరించి, వాటిని ఒక నిర్దిష్ట కొనుగోలుదారుకు విక్రయించడం మండీలు మాత్రమే చేస్తాయి. ఇది, రైతులకు మండీలు అందిస్తున్న విలువైన సేవ. ఒక వ్యాపారి, అల్వార్‌లో ఉత్పత్తి అయిన టొమాటోలను కొనుగోలు చేసి, వాటిని కాన్పూర్‌లోని వినియోగదారులకు సరఫరా చేస్తాడు. ఇటువంటి సేవను ఈ–-పోర్టల్స్ అందించలేవు. కనుక మండీలకు ప్రమాదమేమీ లేదు. పెద్ద కంపెనీలతో నేరుగా కాంట్రాక్టులు కుదుర్చుకునేందుకు రైతులకు పూర్తి హక్కు ఉంది. ఈ హక్కును వినియోగించుకోవడంలో వారికి గల స్వేచ్ఛను సంరక్షించి తీరాలి. 


తృణధాన్యాలు, పప్పుధాన్యాలు, వంటనూనెలు మొదలైన వాటిని మోదీ ప్రభుత్వం నిత్యావసర సరుకుల చట్టం పరిధి నుంచి మినహాయించింది. వ్యాపారులు నిర్దిష్ట సరుకులను నిల్వచేసే గరిష్ఠ పరిమాణంపై ఆ చట్టం పరిమితులు విధించింది. వ్యాపారులు తమ వ్యాపార ప్రయోజనాల నిమిత్తం సరుకులను నిల్వచేయడం కద్దు. ఆ సరుకులను గరిష్ఠంగా ఏ పరిమాణంలో నిల్వ చేయాలో నిత్యావసర సరుకుల చట్టం స్పష్టంగా నిర్దేశించింది. ఇప్పుడు ఈ చట్టం పరిధి నుంచి తృణ, పప్పుధాన్యాలు, వంటనూనెలను తొలగించినందున వ్యాపారులు ఇక వాటిని తాము కోరుకున్న పరిమాణంలో నిల్వ చేసుకునే అవకాశముంది. ఈ చర్య కొన్ని ప్రతికూల ప్రభావాలను చూపే అవకాశం ఎంతగానో ఉంది. వ్యాపారులు వ్యవసాయక ఉత్పత్తులను కొనుగోలు చేసి, పెద్దయెత్తున నిల్వచేసి మార్కెట్‌లో కృత్రిమ కొరత సృష్టించి, భారీ ధరలకు వాటిని విక్రయిస్తున్నారు. ఈ ప్రక్రియలో రైతులు, వినియోగదారులు ఇరువురూ నష్టపోతున్నారు. వ్యాపారులు కొనుగోలు చేసే సమయంలో ఆ వ్యవసాయక ఉత్పత్తులకు తక్కువ ధర ఉండడం వల్ల రైతులు నష్టపోతున్నారు. తిరిగి వాటిని విక్రయించే సమయంలో కృత్రిమంగా అధిక ధరను నిర్ణయించడం వల్ల వినియోగదారులు నష్టపోతున్నారు. ఇటువంటి వర్తక వంచనలను అరికట్టేందుకే ప్రభుత్వం ఆ పంటలను నిత్యావసర సరుకుల చట్టం పరిధిలోకి తీసుకువచ్చింది. అదలావుంచితే వ్యవసాయక ఉత్పత్తులను భారత ఆహారసంస్థ (ఎఫ్‌సిఐ) కంటే ప్రైవేట్ వ్యాపారులే సమర్థంగా నిల్వ చేయగలుగుతున్నారు. ఇప్పుడు సదరు ఉత్పత్తులను ఎంత పరిమాణంలో నిల్వ చేస్తోందీ వ్యాపారులు తప్పనిసరిగా వెల్లడించేలా ప్రభుత్వం ఒక చట్టాన్ని తీసుకురావల్సిన అవసరం ఉంది. వ్యాపారులు అక్రమంగా నిల్వ చేసే అవకాశమున్న వ్యవసాయక ఉత్పత్తులను పెద్ద ఎత్తున దిగుమతి చేసుకోవాలని ఎఫ్‌సిఐని ప్రభుత్వం ఆదేశించాలి. తద్వారా నిత్యావసర సరుకులకు ధరలను స్థిరపరచాలి. దీంతో రైతులూ, వినియోగదారులు ఇరువురూ లబ్ధి పొందుతారు. 


వ్యవసాయరంగంలో మౌలిక మార్పులకు ప్రభుత్వం మరిన్ని చర్యలు చేపట్టవలసిన అవసరముంది. వరి, గోధుమ, చెరకు మొదలైన పంటలకు ప్రభుత్వం ఏటా కనీస మద్దతుధరను నిర్ణయిస్తుంది. గిట్టుబాటు ధర లభిస్తున్నందున రైతులు ఆ పంటల దిగుబడులను అధిక మొత్తంలో సాధించేందుకు అమిత శ్రద్ధ చూపుతున్నారు. ఈ పంటల సాగులో సాధిస్తున్న సాఫల్యం దృష్ట్యా రైతులు ఇతర పంటల సాగును, ముఖ్యంగా అధిక ఆదాయాన్ని సమకూర్చే కూరగాయలు, పండ్లు, కలప, పువ్వులు మొదలైన వాటిని ఉపేక్షిస్తున్నారు. గిట్టుబాటు ధర లభిస్తుందో లేదో అన్న సంశయమే వారి ఉపేక్షకు కారణమని చెప్పక తప్పదు. మద్దతుధర పంటల నుంచి మార్కెట్ ఆధారిత పంటల సాగు వైపుకు రైతులను మళ్ళించవలసిన అవసరముంది. ముఖ్యంగా అంతర్జాతీయ డిమాండ్ బాగా ఉన్న పువ్వులు, సేంద్రియ ఆహార ధాన్యాలు, కొత్త తరహా హైబ్రిడ్‌ రకాల కూరగాయలు మొదలైన వాటిని సాగు చేసేలా రైతులను ప్రోత్సహించాలి. కేరళ నుంచి కశ్మీర్ వరకు భిన్న ప్రాంతాలలో భిన్న వాతావరణ పరిస్థితులు ఉన్నాయి. పువ్వులు, కూరగాయల సాగులో మన దేశం ప్రపంచ అగ్రగామిగా రూపొందగల అవకాశం ఎంతో ఉంది. ఈ ఉత్పత్తులను ఏడాది పొడుగునా మనం సరఫరా చేయగలుగుతాం. మార్కెట్ ఆధారిత పంటల సాగులో రైతులకు వాటిల్లే సమస్యలపై ఒక కచ్చితమైన అంచనాతో, వారికి సహాయకారిగా ఉండే ఒక విధానాన్ని ప్రభుత్వం రూపొందించాలి. ధరల పతనం నుంచి రైతుల ప్రయోజనాలను కాపాడేందుకు ప్రభుత్వ ఆర్థిక సహాయంతో బీమా విధానం ఒకదాన్ని ప్రవేశపెట్టాలి. ఈ పంటలను సాగు చేసేందుకు వీలుగా టిష్యూకల్చర్ (కణజాల సంవర్ధనం) మొదలైన అధునాతన వ్యవసాయక సాంకేతికతలను అభివృద్ధిపరిచేందుకు ఒక పరిశోధనా కార్యక్రమాన్ని ప్రారంభించాలి. 


వ్యవసాయరంగంలో ప్రభుత్వ పెట్టుబడుల తీరుతెన్నులను కూడా నిశితంగా అధ్యయనం చేయవలసిన అవసరముంది. కేవలం కొత్త నీటిపారుదల ప్రాజెక్టులను నిర్మించి, సాగు యోగ్య భూమి విస్తీర్ణాన్ని పెంచడం వల్ల ప్రయోజనం లేదు. వ్యవసాయానికి అదనపు విలువ సమకూర్చేలా ఆ రంగంలో ప్రభుత్వ పెట్టుబడులు ఉండి తీరాలి. ఉదాహరణకు సేంద్రియ ఆహారం - జామ పండ్లు, మామిడి పండ్లు, కాఫీ, తేయాకు మొదలైన వాటికి అంతర్జాతీయ డిమాండ్ బాగా పెరిగిపోతోంది. ఈ పంటల సాగును ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ప్రతి జిల్లాలోనూ ఒక సర్టిఫికేషన్ వ్యవస్థను సృష్టించాలి. వ్యవసాయ ఉత్పత్తులను ఎగుమతి చేసే ప్రైవేట్ వ్యాపారులకు సబ్సిడీ సమకూర్చాలి. 

 

భరత్ ఝున్‌ఝున్‌వాలా

(వ్యాసకర్త ఆర్థికవేత్త, బెంగుళూరు ఐఐఎం రిటైర్‌్డ ప్రొఫెసర్‌)


Follow Us on:
Advertisement
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.